అనంతపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం రోడ్డుపై నిలబడే పరిస్థితి తెచ్చారని వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక 18 నెలల నుంచి ఏ పంటకూ మద్దతు ధర కల్పించలేదని మండిపడ్డారు. మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. విత్తనం నుంచి ఎరువులు, పంట విక్రయం వరకు రైతాంగం రోడ్డెక్కే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు. రైతుల కష్టాలు ఏ ప్రజాప్రతినిధికీ పట్టడం లేదని.. చెవులు, కళ్లున్నా వినలేని..చూడలేని స్థితిలో వాళ్లున్నారని విమర్శించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లలోనూ రైతులు తీవ్రంగా నష్టపోయారని..ఈ ఖరీఫ్‌లోనూ అదే పరిస్థితి వచ్చిందన్నారు. పంట మార్పిడి చేసుకున్నా గిట్టుబాటు ధరలు దక్కడం లేదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాలు బీడుగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసిన పంటలు దిగుబడులు రావడం లేదని, వచ్చిన పంటను అమ్ముకుందామన్నా గిట్టుబాటు ధరలు ఉండడం లేదని చెప్పారు. కనీస మద్దతు ధర ప్రకటించినా ఒక్క పంటనూ మద్దతు ధరకు కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. మీసం మెలేస్తున్న దళారులు రైతులను ఆదుకునే విషయంలో సీఎం చంద్రబాబు మాటలకే పరిమితం అవుతున్నారని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. రైతులు మీసాలు మెలేసేలా చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, వాస్తవానికి కూటమి ప్రభుత్వం అండతో దళారులు మాత్రమే మీసాలు మెలేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక రైళ్లు వేసి, సబ్సిడీలు అందించి అరటి, చీనీ పంటలను ఎగుమతి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో అరటి టన్ను రూ.30 వేలు పలికితే నేడు రూ.2 వేలకు పడిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని చురకలంటించారు. రైతులు రోడ్డుపాలవుతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ పంటకైనా మద్దతు ధర కల్పించారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 18 నెలలుగా ఏ పంటకైనా మద్దతు ధర కల్పించారా? అని అనంత ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో మొక్కజొన్న పంట 73 వేల ఎకరాల్లో సాగు చేశారని తెలిపారు. ఎంఎస్‌పీ ధర రూ.2400 ఉంటే రూ.1600 నుంచి రూ.1700కు అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కజొన్న బూజు పడుతోందని, అయినా ప్రజాపతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో వేరుశనగ పంట 2.25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే ఎంఎస్‌పీ ధర రూ.7200 ఉంటే రూ.5300 నుంచి రూ.6100కు అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. వరి పంట పరిస్థితీ అదేనన్నారు. జిల్లాలో సుమారు 66 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తే మద్దతు ధర లభించడం లేదని అన్నారు. పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇప్పటికే జూన్‌లో వేసిన పంటను దున్నేశారని తెలిపారు. పత్తి పంట రకాన్ని బట్టి ఎంఎస్‌పీ ధర రూ.7700 నుంచి రూ.8100 ఉంటే ప్రస్తుతం రూ.5500 నుంచి రూ.6100లోపే పలుకుతోందని చెప్పారు. సజ్జలు కనీస మద్దతు ధర రూ.2700 ఉంటే రైతుకు రూ.1800 కూడా దక్కడం లేదన్నారు. చీనీ టన్ను గతంలో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పలికితే నేడు రూ.18 వేలు మాత్రమే ఉందన్నారు. జిల్లాలో కందులు ఎన్నడూ లేని విధంగా 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారని.. రూ. 8000 ఎంఎస్‌పీ ఉంటే రూ.6 వేలు కూడా రావడం లేదని అన్నారు. ధైర్యముంటే రండి..రైతుల వద్దకు వెళ్దాం జిల్లా రైతాంగం దయనీయ పరిస్థితుల్లో రోడ్డుమీదకు వస్తుంటే ప్రజాప్రతినిధులు మాత్రం ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ధైర్యముంటే గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్దాం రండి అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి వ్యవసాయం తప్పితే అన్నీ మాట్లాడతారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఏ పంటనూ కొనుగోలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మండిపడ్డారు. పత్తి పంట కొనుగోలుకు పెద్దవడుగూరు, గుత్తిలో కేంద్రాలు పెడతామని చెప్పినా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. మొక్కజొన్న పంటను ఎంఎస్‌పీ ధరకు కొనుగోలు చేయాలని సాక్షాత్తూ ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు లేఖ రాసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఇవ్వాల్సిన డబ్బులను తొలి ఏడాది ఎగ్గొట్టారని మండిపడ్డారు. ఈ ఏడాది 14 వేలు ఇచ్చామని చెప్పుకుంటున్నా రైతుకు కలిగిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్యల కారణంగా పంటను బట్టి ఎకరాకు రూ.50 వేల నుంచి లక్ష వరకు రైతు నష్టపోయాడని తెలిపారు. మాటలతో మభ్యపెట్టడం ప్రజాప్రతినిధులకు అటవాటుగా మారిందని అన్నారు. సీమను ఆత్మహత్యలకు నిలయంగా మార్చొద్దు రాయలసీమను హార్టికల్చన్ బోన్‌గా కాదు.. రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మార్చొద్దని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి రైతులకు ధైర్యం చెప్పాలని సూచించారు. రూ.50 వేల కోట్లతో సీమను ఆదుకుంటామని చెప్పడం కాదని, ముందుగా రైతు పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్నారు. రూ.50 వేల కోట్ల మాటలు పక్కన పెట్టి రూ.200 నుంచి రూ.300 కోట్లు ఖర్చు పెట్టి అరటిని కొనుగోలు చేసి స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరా చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రులు తక్షణం స్పందించి పంటలను ఎంఎస్‌పీ ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. 18 నెలలైనా గత ప్రభుత్వంపై నెపమా? జిల్లాకు హంద్రీనీవా, తుంగ్రభద్ర నుంచి నీళ్లు వస్తున్నా సరిగ్గా అందించలేని దద్దమ్మ ప్రభుత్వమిదని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. చివరకు గేట్లు కూడా సరిచేయలేదన్నారు. ఇదేమంటే గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని, 18 నెలలైనా ఇంకా గత ప్రభుత్వంపై విమర్శలా? అని చురకలంటించారు. రైతుల తరఫున రోడ్ల దిగ్బంధనం రైతులు పండించిన అన్ని పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి రోడ్లు దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మనసు, నా మనసు ఒకటేనని చంద్రబాబు అంటున్నారని, మీ ఇద్దరి మనసులూ రైతు సమస్యల పరిష్కారంపై నిమగ్నం చేయండని చురకలంటించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కోవిడ్ వంటి పరిస్థితుల్లోనూ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనే వ్యక్తి చొరవ తీసుకుంటే రైతుల కష్టాలు ఉండవని తెలిపారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను ఎకరా 99 పైసలకే ఇచ్చే ప్రబుద్ధులు రైతులను ఆదుకునే ఆలోచన చేయలేరా? అని అన్నారు. రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధర ఉండడం లేదని, కానీ మార్కెట్‌లో వినియోగదారులకు ఏ పంట ధర అయినా తగ్గిందా? అని ప్రశ్నించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీ తరఫున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా పోరాటాలు చేస్తాయని స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు.