కాకినాడ: తనమీద నమోదైన కేసులను తానే ఎత్తేయించుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు ఒక్కరేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తాను నిందితుడుగా ఉన్న కేసులో తానే విచారణాధికారిగా ఉంటూ తీర్పులిచ్చుకోవడంపై ఆయన విష్మయం వ్యక్తం చేశారు. 2023లో లిక్కర్ కేసులో గతంలో ఆధారాలతో కేసు నమోదు చేసిన సీఐడీ నేడు అదే కేసులో ఆధారాల్లేవని సీఐడీ చిలకపలుకులు పలకుతోందని.. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అధికారులను బెదిరించి కూటమి ప్రభుత్వం పబ్బం గడపుకుంటున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 538 రోజుల పాలనలో రోజుకి సగటున రూ.466 కోట్లు చొప్పున రూ.2.51 లక్షల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు.. హామీలు అమలు చేయకుండానే చేసిన అప్పంతా ఏమైందని నిలదీశారు. కూటమి పాలనలో కిలో అరటి రూ.1 కి పడిపోయి అన్నదాతలు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతుంటే... ప్రభుత్వం మాత్రం ఎకరం భూమి 99 పైసలు చొప్పున ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా దోచిపెట్టడంపై తీవ్రంగా ఆక్షేపించారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ప్రతినెలా పెన్షన్ పంపిణీ పేరుతోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని తేల్చి చెప్పారు. 18 నెలల కాలంలో 5 లక్షల పెన్షన్లు కోత విధించిన చంద్రబాబుది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే... ● లిక్కర్ కేసు విత్ డ్రా - ముమ్మాటికీ భరితెగింపే... కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికొదిలేసింది. ప్రజల అవసరాలను తీర్చాలన్న ఆలోచన కూడా లేదు. వాళ్లను పెంచుకోవడానికి తప్ప మరో కార్యకలాపాలేవీ రాష్ట్రంలో చేయడం లేదు. స్వలాభం తప్ప ప్రజల కోసం ఆలోచన లేదు. హఠాత్తుగా నిన్న తెరపైకి 2014-19 కాలంలో చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ విక్రయాల్లో జరిగిన కుట్ర, అవినీతికి సంబంధించిన కేసు బయటకు వచ్చింది. దీనికి సంబంధించి 2023లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిమీద కేసు పెట్టింది. ఇవాల హఠాత్తుగా సీఐడీ ఈ కేసుకు సంబంధించి మా దగ్గర ఆధారాల్లేవని సీఐడీ కోర్టులో దాఖలు చేయడం ద్వారా పునీతుడ్ని చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం శాంతిభద్రతలు ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే... ఇదే చంద్రబాబు 2023లో లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు. కారణం 2014-19 మధ్య జరిగిన లిక్కర్ విక్రయాల్లో అవినీతికి సంబంధించిన కేసు ఇధి. గతంలో ఇదే సీఐడీ అధికారులు చంద్రబాబు మీద కేసు పెట్టి... ఇవాళ మరలా అదే సీఐడీ ఈ కేసులో మాకేమీ సంబంధం లేదు.. ఈ కేసులో ఆధారాల్లేవని మాట్లాడ్డం అంటే ఇంతకన్నా ఫార్స్ ఉంటుందా? చంద్రబాబు ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చుని తానే నిందితుడు, తానే విచారణాధికారి. ఆయన మీద ఆయనే విచారణ చేసుకుని ఆయనే తీర్పు ఇచ్చేస్తాడు. ఇక్కడ దొంగ, పోలీసూ రెండూ చంద్రబాబే. ఇది ప్రభుత్వ భరితెగింపు కాదా? ● పక్కా ఆధారాలతో 2023 లో కేసు నమోదు చేసిన సీఐడీ.... ప్రజలు మన గురించి ఏమనుకుంటారోనన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మీకు మీరే పునీతులుగా కడిగేసుకుంటారు. 2014-15 మధ్య రూ.5300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకి నష్టం కలిగిందని సీఐడీ తేల్చింది. కారణం 2016లో చంద్రబాబు ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది.. అందులో భాగంగా 4840 మద్యం షాపులు, బార్లకు కలిపి ప్రివిలైజ్ ఫీజు రద్దు చేయడం, 20శాతం అదనపు ధరలకు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం, 14 డిస్టలరీలకు కొత్తగా అనుమతులు, 43వేల బెల్టుషాపుల ద్వారా అధిక ధరలకు అమ్ముకోవడానికి కనీసం కేబినెట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా రాత్రికి రాత్రే అనుమతి ఇవ్వడం అనేది ఈ కేసు సారాంశం. ఈ కేసులు కొట్టేయాలి చంద్రబాబు ఆయన మనుషులు హైకోర్టుకు వెళ్లితే అందుకు కోర్టు అంగీకరించలేదు. సుప్రీం కోర్టుకు వెళ్లినా కేసు కొట్టేయడానికి అంగీకరించలేదు. ఇవాళ చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో తనకు తానే చంద్రబాబు కేసు కొట్టేయించుకుంటున్నాడు. ఒకే వ్యక్తి దొంగ, పోలీసులు ఇద్దరిలా వ్యవహరిస్తున్నాడు. తాను నిరపరాధి అయితే చంద్రబాబు ఎందుకు కోర్టులో నిరూపించుకోవడం లేదు? ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా ఎందుకు దర్యాప్తు సంస్థలు చేతులెత్తేస్తుందన్నది పెద్ద చర్చనీయాంశం. ● తన హయాంలో లిక్కర్ స్కామ్ డైవర్షన్ కోసమే తెరపైకి లేని లిక్కర్ కేసు... వాస్తవానికి వైయస్సార్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రచారం చేయడానికి మూల కారణమే చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్. 2014లో తన హయాంలో లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా స్కామ్ జరిగినట్లు చిత్రీకరించారు. అంతే కాకుండా దానిపై తన సొంత మీడియాలో ప్రచారం చేశారు. ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి, భయపెట్టి ఆయనతో తప్పుడు వాంగ్మూలం ఇచ్చి బిల్డప్ చేశారు. ఇప్పుడు కూడా అదే వాసుదేవరెడ్డి ఎండిగా ఉన్నప్పుడు 2023లో ఇచ్చిన ఫిర్యాదును రివర్స్ చేయించారు. అంటే అధికారులను, సాక్ష్యులను బెదిరిస్తున్నారని స్పష్టం అయింది. మీరు నిరపరాధులు అయితే కోర్టు ద్వారా పోరాటం చేయకుండా ఇలాంటి ఆరాటం ఎందుకు? అంటే కారణం మీ ద్వారా తప్పులు జరిగాయి కాబట్టి... మీరు నమ్ముతున్నారు కాబట్టి కోర్టుల ద్వారా నిరూపించుకోకుండా కేసులు ఎత్తివేయించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తన కేసులమీదే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడమే దీనికి నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ ధనంతో తన కేసులను వాదించేందుకు సిద్దార్ధ లూధ్రా అనే న్యాయవాదిని తీసుకొచ్చారు. వైయస్సార్సీపీ నేతలను వేధిస్తూ నమోదు చేసిన వేధింపుల కేసులకు, చంద్రబాబుకు వ్యక్తిగత కేసులకు ఆయనే సలహాదారు. ఆయనకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్నిచ్చి కేసులు నడిపిస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ కేసులో ఆధారాల్లేవని చిలకపలుకులు పలుకుతున్న లా అండ్ ఆర్డర్ శాఖ పరిధిలో ఉంటుంది. అది ఇప్పుడు చంద్రబాబునాయడే చూస్తున్నారు. అలాంటప్పుడు తన మీద కేసులు తను ఎలా లిఫ్ట్ చేసుకుంటారు. కనీస ఇంగితం ఉండాలి కదా? దీంతో పాటు చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ కూడా ఉంది. అందులో ఆయన అరెస్టు కూడా అయ్యారు. ఇంకా అసైన్డ్ భూములు కుంభకోణం కూడా జరిగింది. ఈ కేసులన్నింటిపైనా అధికారులను బెదిరించి మరలా కోర్టులో కొత్త వాంగ్మూలాలను పైల్ చేయిస్తున్నారు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక భాగం. చంద్రబాబు తనను తాను సచ్చీలుడని నిరూపించుకునే ప్రయత్నంలోనే ఇదంతా చేస్తున్నాడు. చంద్రబాబు చట్టం నుంచి ఏదో ఒకవిధంగా తప్పించుకుంటూనే ఉంటాడు. అయితే బెయిల్ తెచ్చుకోవడం లేదా ఏదో ఒక విధంగా బయటపడ్డం తప్ప.. కోర్టులకెళ్లి ఎప్పుడూ తాను నిరపరాధిని వాదించుకోవడం చంద్రబాబు చరిత్రలో ఎప్పుడూ లేదు. ● అధికారులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు... వాసుదేవరెడ్డి వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేశారు. గతంలో చంద్రబాబు హయాంలో మద్యం అక్రమాలపై ఆయనే ఫిర్యాదు చేశారు. ఇవాళ మరలా ఆయనే వచ్చి ఒక అబద్దపు వాంగ్మూలం ఇస్తాడు. అంటే అధికారులను బెదిరించి సాక్ష్యాలను కూడా మార్పు చేసుకుంటున్నారన్న విషయం అర్థమవుతుంది. దీంతోపాటు అసైన్డ్ భూముల కేసులో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ కూడా మళ్లీ కోర్టుకు వెళ్లి.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరొక రకమైన వాంగ్మూలం ఇచ్చింది. అంటే ఈ ప్రభుత్వం వైయస్సార్సీపీ శ్రేణులను, ప్రజలు, అధికారులతో పాటు అన్ని వర్గాల వారిని బెదిరించి పబ్బం గడుపుకుంటుంది. కేవలం మీరు ఆ రోజు దొరికిపోయారు కాబట్టి.. దాన్నుంచి భయటపడ్డం కోసమే 2019-24 మధ్య వైయస్.జగన్ ప్రభుత్వంలో మద్యం పాలసీలో ఏదో జరిగిపోయిందని.. గతంలో మీ మీదున్న కేసుకు కౌంటర్ గా తెరమీదకు తీసుకువచ్చారని అర్ధం అవుతుంది. వాస్తవానికి 2023 అక్టోబరు 28 నాడు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు ప్రభుత్వం మీద నమోదైన లిక్కర్ కేసుకు ప్రధాన ఆధారం కాగ్ రిపోర్టు. దాని ప్రకారం అసలు కథ మొదలై దానికనుగుణంగా విచారణ మొదలై అందులో రూ.5300 కోట్ల ప్రభుత్వ ధనానికి గండికొట్టారని, అవినీతి జరిగిందని తేలింది. ● బాబు గత పాలనలోనే లిక్కర్ స్కామ్... రాష్ట్రంలో మొత్తం 20 డిస్టలరీలు ఉంటే అందులో 2014-19 మధ్యలోనే చంద్రబాబు హాయంలోనే ఏకంగా 14 డిస్టలరీలకు అనుమతులు మంజూరు చేసారు. వైయస్సార్సీపీ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి మంజూరు చేయలేదు. అంతే కాకుండా కొన్ని డిస్టలరీలకు, కొన్ని బ్రాండ్లకు మాత్రమే ప్రోత్సహించేవిధంగా సరఫరాకు అనుమతి ఇచ్చినట్లు తేలింది. చంద్రబాబు ఆనాడున్న మద్యం విధానం, నేటి మద్యం విధానం పూర్తిగా అవినీతికి చోటిచ్చేదే. బెల్టుషాపులు, కల్తీ మద్యం, పర్మిట్ రూములతో వీధి, వీధినా మద్యం ఏరులా పారిస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే ప్రజల దృష్టి మరల్చడానికి ఏదో ఒక అంశాన్ని తెరపైని తీసుకొచ్చి...డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీస్తారు. అప్పుడు అసలు విషయాన్ని పక్కనపెట్టి తమకు కావాల్సిన విధంగా ప్రచారం చేసుకుంటారు. తన చేతిలో ఉన్న మీడియాతో తిమ్మిని బమ్మి చేయవచ్చన్నది చంద్రబాబుకు ఉన్న నమ్మకం. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన మీద కేసులను తానే తొలగించుకునే పరిస్ధితి ఎక్కడైనా చూశామా? ఇదేమి విధానం? గతంలో దోపిడీ జరిగిందని చెప్పిన సీఐడీ ఇవాళ దోపిడీ లేదని ఎలా చెబుతుంది? అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఇదో నిదర్శనం. ఆ రోజు చంద్రబాబు పై లిక్కర్ కేసులో ఆధారాలతో సహా వాళ్లే కేసులు పెట్టారు. ఇవాళ వెనక్కి తీసుకుంటున్నారు. చంద్రబాబు సాక్ష్యులను, అధికారులను బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఎవరు నోరెత్తితో ఆ గొంతు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాము చేసిన దానికే ఏం జరగలేదని ఏ విధంగా చెబుతారు? ● రాష్ట్రంలో అప్పులు, గొప్పలు తప్ప మరేం లేదు... ఎవరైనా నిష్పాక్షపాతంగా ఈ కేసుల మీద విచారణ చేయండి తటస్ద వ్యక్తులను గొంతెత్తితే ఆ గొంతు నొక్కేయడం లేదా వారిని నయానో భయానో వారిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లు కావాలని తిలక్ అనే ఓ సీనియర్ జర్నలిస్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి ప్రతిస్పందనగా....నువ్వు ఫిర్యాదు దారుడివి కాదు, బాధితుడివీ కాదు, ఎందుకు నీకు ఈ విషయం అన్నట్టు కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? చంద్రబాబు అన్నీ డబుల్ యాక్షన్. ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికలు ముగిసిన తర్వాత మరోలా వ్యవహరించడం ఆయనకలవాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ కేసులు ఎత్తివేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం దశలవారీగా అమలు చేస్తున్నారని ఇవాళ స్పష్టమయింది. గతంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో విలువైన భూములను సంతర్పణ చేశారన్న దగ్గర నుంచి చంద్రబాబు వ్యవహారం పై అనేక ఉదంతాలున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు, గొప్పలు, అబద్దాలు తప్ప మరేం జరగడం లేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. అద్భుతం, అమోగం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైయస్.జగన్ విపరీతంగా అప్పులు చేస్తున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవాళ కేంద్ర ఆర్ధికసంస్ధల నుంచి అన్ని రూపాల్లోనూ గతంలో కన్నా చంద్రబాబు విపరీతంగా అప్పులు చేస్తున్నారన్న విషయం బయటపడిన తర్వాత దాన్నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రచారాలకు తెరతీస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 538 రోజులైంది. అంటే దాదాపు 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన అప్పులు రూ. 2,51,131 కోట్లు. రోజుకు సగటున రూ.466 కోట్లు అప్పు చేస్తున్నారు. అంటే చంద్రబాబు గంటకు రూ.19.66 కోట్లు అప్పు చేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ అప్పు చేసిన రికార్డు చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది. ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం... ఇది తప్పు కదా అంటే మా దగ్గర డబ్బుల్లేవంటారు. మరి తెచ్చిన అప్పు ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. చంద్రబాబు ఒక రోజు చేసిన రూ.466 కోట్ల అప్పు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయడానికి సరిపోతుంది. అంటే డబ్బుల్లేక కాదు, పేదలకు సాయం చేయాలన్న మనసు లేక, కార్పొరేట్లకు దోచిపెట్టడానికే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మనసునిండా కార్పొరేట్లే నిండిఉంటారు. పెట్టుబడిదారుల పక్షాన నిలబడ్డం ఏ రకమైన రాజనీతి? ● మద్ధతుధర లేని రైతులు - పప్పుబెల్లాల్లా ప్రభుత్వ భూములు... ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అరటిపండు కేజీ రూపాయి అయితే.. చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో కేటాయించిన ఎకరం భూమి కేవలం 99 పైసలు. ఇంచుమించు వైయస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు అరటి టన్ను రూ.25వేలు అయితే ఇవాళ కేవలం రూ.500 మాత్రమే. ఇంత ఇబ్బందుల్లో అరటి రైతులుంటే కనీసం రైతులను ఎలా ఆదుకుందామన్న ఆలోచన కూడా లేదు. మాట్లాడితే ఆర్టిఫీషియల్ టెక్నాలజీ పేరుతో హడావుడి చేస్తారు. అసలు రియల్ ఇంటెలిజెన్స్ ఏమైంది? రైతులను గాలికొదిలేయాని నిర్ణయానికి వచ్చారా? రూపాయికి ఒక చాక్లెట్ కూడా రాదు కానీ చంద్రబాబు ఎకరా భూమి మాత్రం కేటాయిస్తాడు. ఇదా దూరదృష్టి? ప్రతినెలా ఒకటో తేదీన అబద్దాలు ప్రచారం చేయడానికి మాత్రమే చంద్రబాబు పెన్షన్లు పంపిణీకి వెళ్తున్నాడు. అసలు ఇంటికి పెన్షన్ పంపించాలని అవ్వా, తాతలకు ఇబ్బంది రాకూడదన్న ఆలోచన చేసిందే వైయస్.జగన్. ఇంటింటికీ పెన్షన్ పంపించి.. పారదర్శకంగా కులం, మతం, ప్రాంతం చూడకుండా పంపిీ చేశారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చెబుతున్నంత గొప్పగా పెన్షన్ల పంపిణీ జరగడం లేదు. పెన్షన్ల విధానం గొప్పగా ఉందన్న భ్రమల్లో కూటమి నేతలు ఉన్నారు. వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆఖరి నెలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చి పెన్షన్లు 66.34 లక్షలు కాగా... ఈ సంఖ్య 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి సంఖ్య కన్నా ఇంచుమించు 29 లక్షల పెన్షన్లు అదనం. 2025 నవంబరు 1వ తేదీనాటికి చూసుకుంటే 61.64 లక్షల పెన్షన్లు పంపిణీ చేశారు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో 5 లక్షల పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఇటీవల కాలంలోనే దివ్యాంగుల పెన్షన్లకి సంబంధించి ఒక ఉద్యమంలా ఇంటింటికీ వెరిఫై చేసి... తీసే కార్యక్రమం చేపడితే దానిమీద విపరీతమైన వ్యతిరేకత రావడంతో నిలిపివేశారు. మరి మీరు పెన్షన్లు గొప్పగా చేశామని ఎలా చెబుతారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ అయినా అదనంగా మంజూరు చేశారా? భర్త చనిపోతే ఆ పెన్షన్ నే భార్యకి ఇస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12-13 నెలల్లో ఆ టైంలో భర్తలను కోల్పోయి దురదృష్టవశాత్తూ వితంతువులుగా మారిన వారికి మీ ప్రభుత్వం ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదు? ఎందుకు వారికి మంజూరు చేయడం లేదు? లక్షలాది మంది రాష్ట్రంలో అర్హత ఉన్నవారున్నా పారదర్శకంగా అర్హత ఉన్నవారికి పెన్షన్ ఇవ్వడం లేదు? ● హామీల అమల్లో అట్టర్ ఫెయిల్... చంద్రబాబు తన మేనిఫెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 18నెలలు అయింది అధికారం చేపట్టి.. 50 ఏళ్ల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? ఏమైంది? సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎలాగూ అటకెక్కిపోయాయి. సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి.. ఒకటే ఇచ్చారు. ఆర్టీసీ ఉచిత బస్సు అదో పెద్ద చరిత్ర.అరకొరగా చేసి సూపర్ హిట్ అంటున్నారు.మీ తీరు ప్లాప్ సినిమాకి వియోజత్సవం చేసినట్లుంది. ప్రతి పథకాన్ని పారదర్శకంగా పేదల దరికి చేర్చిన వైయస్.జగన్ పాలనకు మీ పాలనకు చాలా తేడా ఉంది. అయితే మీరు భాజాబజంత్రీలు వాయించే సొంత మీడియా సంస్థలున్నాయి. మాకు లేవు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైయస్సార్సీపీ ప్రభుత్వం వల్ల లేడీ డాన్ లు పెరిగిపోయారని చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలో చెలరేగిపోతున్న లేడీడాన్ లను మా పార్టీకి అంటగడతారా? మీ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా విఫలమైందో అందరికీ తెలుసు. 2024 జూన్ అంటే 2025 మే వరకు కూటమి పాలనలో 1291 అత్యాచారాలు జరిగాయని మీ ఎల్లో ఛానెల్స్ లోనే ప్రసారం చేస్తున్నారంటే ... లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా దిగజారిందో అర్ధం అవుతుంది. పైగా ఇది మంచి ప్రభుత్వమని ప్రచారం. మీది ముంచే ప్రభుత్వమా, మంచి ప్రభుత్వమా అన్నది ప్రజలు అర్దం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పామాయిల్ రైతులను పూర్తిగా గాలికొదిలేసింది. మా హయాంలో వారి కోసం పెద్ద ఎత్తున కృషి చేసి ఆ రైతుల కళ్లల్లో ఆనందం చూశాం. రూ.80 కోట్లు చెల్లించాం. చంద్రబాబు మాత్రం పామాయిల్ తోటల్లో డ్రోన్లు ఎగరేసి లోపాలు గుర్తిస్తానని పెద్ద మాటలు చెబుతాడు. ద్వితా తుపాన్ ప్రభావంతో రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. ఈ తుపాన్ మీద సీఎం స్ధాయిలో కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించిన పాపానపోలేదు. మొంతా తుపానులో నష్టం పోయినవారికి సాయం చేయలేదు.. ఈ లోగా మరో తుపాన్ వచ్చింది. అరటి, ఉల్లి, మొక్కజొన్న, పత్తి రైతులు ఈ ప్రభుత్వ తీరుతో మద్దతు ధర రాక నాశనమైపోయారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎక్కడా ఒక కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి. అవేవీ పట్టించుకోకుండా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కాలక్షేపం చేస్తున్నారు.వరి పండించవద్దని చెబుతారు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ పంటలేవో రైతులకు చెప్పారా? అది కూడా లేదు. ఇదేదే లేకుండా నోరేసుకుని ఎవరినైనా తిడుతూనే ఉంటారు. అమరావతి రైతులను ఎన్నిసార్లు మోసం చేస్తారా అర్ధం కావడం లేదు? 2014లో 33వేల ఎకరాలు సేకరించి.. ఇప్పుడేమో అవి సరిపోవు ఈ భూమితో మున్సిపాల్టీ అవుతుందని చెబుతున్నారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. మీ కేసులు మీరే ఎత్తేసుకుంటారు. మీ గొప్పలు మీరే చెప్పుకుంటారు. పచ్చిఅబద్దాలు వండి వారుస్తారు. ఇదేమి ప్రభుత్వమని కన్నబాబు నిలదీశారు.