దోచుకోవ‌డం, దాచుకోవ‌డం.. నిల‌దీస్తే పారిపోవ‌డం 

ఏ ప్ర‌శ్న‌డిగినా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేదు

బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఎక్క‌డా స్ప‌ష్ట‌త లేదు 

బ‌డ్జెట్ మొత్తం అబ‌ద్ధాలు, అభూత క‌ల్ప‌న‌లే 

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు

వెల‌గ‌పూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు 

మండ‌లిలో హెరిటేజ్ అవినీతిపై ప్ర‌శ్నిస్తే పారిపోయారు

ప్ర‌శ్నించే వారు లేరు గ‌నుక‌నే తిరుమల ల‌డ్డూపై అసెంబ్లీలో అబ‌ద్ధాలు చెప్పారు 

రెండేళ్ల‌లో అన్ని వ‌ర్గాల‌ను ఈ ప్ర‌భుత్వం పూర్తిగా ముంచేసింది

చంద్ర‌బాబు పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లూ స‌ర్వ‌నాశ‌నం 

ప్ర‌భుత్వ తీరుపై  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆగ్ర‌హం

అసెంబ్లీ మీడియా పాయింట్‌, వెల‌గపూడి: బడ్జెట్ కేటాయింపుల‌పై మండ‌లిలో జ‌రిగిన చ‌ర్చ‌లోనూ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ వాస్త‌వాలు చెప్ప‌కుండా గ‌త ప్ర‌భుత్వం అంటూ రాజ‌కీయ ప్ర‌సంగంతో స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారని వైయ‌స్ఆర్‌సీపీశాస‌న‌మండ‌లి స‌భ్యులు ధ్వ‌జ‌మెత్తారు. వెల‌గ‌పూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద వారు మాట్లాడుతూ సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లు, ప్ర‌ధాన హామీల సంగ‌తి, 20 నెల‌ల్లో చేసిన అప్పులు, ఉద్యోగాల క‌ల్ప‌న‌, పంట‌లకు గిట్టుబాటు ధ‌ర‌, రైతుల ఆత్మ‌హత్య‌లు.. ఇలా ఏ ప్ర‌శ్న అడిగినా ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పుకోలేక పారిపోయింద‌ని, రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌తోపాటు, స‌భ సాక్షిగా త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు బంధువు ఎంపీ భ‌ర‌త్‌కి చెందిన‌ గీతం కాలేజీకి 55 ఎక‌రాల భూముల కేటాయింపుల‌పై తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా తిర‌స్కరించార‌ని చెప్పారు. తిరుమ‌ల నిధుల దోపిడీకి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన అక్ర‌మాల‌పై మండలిలో ఆధారాల‌తో స‌హా నిల‌దీస్తే స‌మాధానం చెప్ప‌లేక‌పోయిన మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నించే వారు లేర‌నే ధీమాతో అబ‌ద్ధాల‌ను వ‌ల్లె వేశార‌ని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. మూడో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టినా ఇప్ప‌టికీ సూప‌ర్ సిక్స్‌లో ప్ర‌ధాన హామీల‌కే దిక్కులేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. 
వారు ఇంకా ఏం మాట్లాడారంటే..:

అబ‌ద్ధాల‌తో తిరుమ‌ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం  
: లేళ్ల అప్పిరెడ్డి

-అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతున్నా ఇంకా గ‌త ప్ర‌భుత్వం అంటూ వైయ‌స్ఆర్‌సీపీ మీద నింద‌లు మోప‌డానికే మంత్రులు ప్రాధాన్యం ఇస్తున్నారే కానీ, హామీల అమ‌లు గురించి మాట్లాడ‌టం లేదు. మూడో బడ్జెట్‌లోనూ ఏ ప‌థ‌కానికి ఎంత నిధులు కేటాయిస్తారో స్ప‌ష్టత లేదు. వీటిపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తుంటే మండ‌లిలో స‌మాధానం చెప్ప‌లేక శాస‌న‌స‌భ‌లో తిరుమ‌ల‌ ల‌డ్డూ ప్ర‌సాదంపై మ‌ళ్లీ త‌ప్పుడు ప్ర‌చారానికి పూనుకున్నారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ సంస్థ చేసిన అవినీతిపై నిల‌దీస్తే అడుగ‌డుగునా అధికార పార్టీ స‌భ్యులు అడ్డుకునే ప్ర‌య‌త్నమే చేశారు. శాస‌న‌మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోయిన దేవాదాయ‌శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, శాస‌న‌స‌భ‌లో మాత్రం నోటికొచ్చిన అబ‌ద్ధాలు చెబుతున్నాడు. భ‌క్తులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. జీవో నెంబ‌ర్లు 746, 747 గురించి తెలిసినా ఇప్ప‌టికీ అడుగడుగునా అబ‌ద్ధాలే ప్ర‌చారం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంది క‌దా అని అసెంబ్లీలో అబ‌ద్ధాల‌నే నిజాలుగా న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆధారాలతో ప్ర‌శ్నిస్తుంటే కూట‌మి నాయ‌కులు మాత్రం అబ‌ద్ధాల‌తో బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్రమం చేస్తోంది. 

మా హ‌యాంలో జ‌రిగిన మేలును క‌ప్పి పుచ్చుతున్నారు
: తూమాటి మాధ‌వ‌రావు

-బడ్జెట్ ప్ర‌సంగాన్ని కూడా మంత్రి ప‌య్యావుల రాజ‌కీయ ప్ర‌సంగంగా మార్చేశాడు. కోవిడ్ సంద‌ర్భంగా రిజ‌ర్వు పెంచిన ఎంజీఎల్ఆర్ ని ప్ర‌స్తుతం త‌గ్గించ‌గా దాని వ‌ల‌న జ‌రిగిన మేలును తమ గొప్ప‌త‌నంగా చెప్పుకుంటూ రూ.40 వేల కోట్లు వ‌డ్డీ తగ్గించ‌బోతున్నట్టు ప్ర‌చారం చేసుకుంటున్నాడు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ‌త రెండేళ్లలో ఏం చేశారో చెప్ప‌లేదు. రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చెప్పుకోకుండా వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో జ‌రిగిన మేలును కప్పి పుచ్చి త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డ‌మే ధ్యేయంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంది. క‌ల్తీ నెయ్యిపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ నిల‌దీస్తే అక్క‌డ స‌మాధానం చెప్ప‌డానికి భ‌యప‌డి దేవాదాశాఖ మంత్రి శాస‌న‌స‌భ‌లో మాట్లాడుతున్నాడు.     

అప్పులపై స‌మాధానం చెప్పే ద‌మ్ము లేదు
: మొండితోక అరుణ్ కుమార్ 

-సంప‌ద సృష్టిస్తాన‌ని న‌మ్మించి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, దేశంలో ఏ రాష్ట్రం చేయ‌ని విధంగా 20 నెల‌ల్లోనే రూ.3.28 ల‌క్ష‌ల కోట్ల‌కుపైగా అప్పులు చేశాడు. వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల‌లో చేసిన అప్పులో 95 శాతం అప్పులు చంద్ర‌బాబు 20 నెల‌ల్లోనే చేశాడు. ఈ అప్పుల‌పై ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం లేదు. బ‌డ్జెట్ అంచ‌నాల‌కు, బ‌డ్జెట్ కేటాయింపుల్లో తేడాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమ‌లు గురించి ప్ర‌శ్నిస్తే లెక్క‌లు చూపించ‌లేక‌పోతున్నారు. సీఎం చంద్ర‌బాబు చెప్పిన 6.28 ల‌క్ష‌ల ఉద్యోగాల వివ‌రాలు అడిగినా స్పంద‌న లేదు. నిజంగా 6.28 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చుంటే వారు క‌ట్టే ప‌న్నుల ద్వారా రాష్ట్రానికి వ‌చ్చిన ఆదాయం గురించి చెప్ప‌మన్నా మంత్రికి నోరు పెగ‌ల‌డం లేదు. కంపెనీల వివ‌రాలు కూడా బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. ఎన్నిక‌ల హామీల్లో ప్ర‌ధానంగా ప్ర‌చారం చేసుకున్న నిరుద్యోగ భృతి గురించి మ‌ర్చిపొమ్మంటున్నారు. దేని గురించి అడిగినా గ‌త ప్ర‌భుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింద‌ని త‌ప్ప‌, ఇంకేం మాట్లాడ‌టం లేదు. 

రోజుకి 8 మంది రైతులు, రైతు కూలీల ఆత్మ‌హ‌త్య‌
: వ‌రుదు క‌ళ్యాణి

-మూడు బ‌డ్జెట్‌లు పూర్త‌యినా ఇప్ప‌టివ‌ర‌కు సూప‌ర్ సిక్స్ లో ఏ ఒక్క హామీని పూర్తిగా అమ‌లు చేయ‌లేదు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఈ ప్ర‌భుత్వం ఘోరంగా వంచించింది. రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. రైతుల‌కు క‌నీస గిట్టుబాటు ధ‌ర‌లు ద‌క్క‌క రోజుకి 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. బాధిత రైతు కుటుంబాల‌కు ఒక్క‌రికీ ప‌రిహారం ఇచ్చింది లేదు. ఎంత మంది రైతులు ఆత్మ‌హత్య చేసుకున్నారో ఆ వివ‌రాలు కూడా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స్ప‌ష్టంగా లేదు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో 478 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు ప‌రిహారం రూ.7 ల‌క్ష‌ల‌కు పెంచి ఆదుకోవ‌డం జ‌రిగింది. ప్ర‌కృతి విపత్తుల క‌న్నా ప్ర‌భుత్వ విప‌త్తుల వ‌ల్లే రైతులు ఎక్కువ‌గా న‌ష్ట‌పోతున్నారు. మోంథా తుపాన్ బాధితుల‌కు ఇప్ప‌టికీ రూ. 410 కోట్లు ఇన్‌పుట్ స‌బ్సిడీ చెల్లించాల్సి ఉంది. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక వివిధ తుపాన్‌ల కార‌ణంగా పంటలు న‌ష్ట‌పోయిన రైతుల‌కు దాదాపు రూ. 1,100 కోట్లు బ‌కాయి ప‌డింది. ఇంకా ఎంతమంది రైతులు చ‌నిపోతే ఈ ప్ర‌భుత్వం క‌ళ్లు తెరుస్తుందో. ల్యాండ్ పూలింగ్ లో పోయే పొలాన్ని బిల్‌గిట్స్‌కి చూపించి ఉద్యాన‌వ‌న పంట‌లు పండిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు బిల్డ‌ప్ ఇచ్చాడు. గ‌తంలో వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ట‌న్ను అర‌టి పంట రూ. 30 వేల వ‌ర‌కు ప‌లికితే నేడు రూ.5 వేలు కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి. వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల పాల‌న‌లో రైతుల కోసం రూ. 1.84 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తే, కూట‌మి 20 నెల‌ల పాల‌న‌లో రూ.5 వేల కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌ని ప‌రిస్థితి. అన్న‌దాత సుఖీభ‌వ పేరుతో ఏకంగా 27,465 కోట్లు మేర రైతుల‌ను మోసం చేశారు. బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఎక్క‌డా కౌలు రైతుల ఊసే లేక‌పోవడం దుర్మార్గం. 

*గీతం కోసమే మేయ‌ర్‌ను దింపేశారు*

-గీతం కాలేజీకి ప్ర‌భుత్వ భూములు కేటాయిస్తూ విశాఖ కార్పొరేష‌న్‌లో చేసిన తీర్మాణాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన‌ వాయిదా తీర్మాణాన్ని ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. 5 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను వ‌మ్ము చేస్తూ రూ. 5వేల కోట్ల విలువైన భూముల‌ను గీతం భ‌ర‌త్ కాజేస్తున్నాడు. కూట‌మి నాయ‌కులు విశాఖ‌ను దోపిడీకి అడ్డాగా మార్చేసుకున్నారు. గీతం కాలేజీకి భూములు క‌ట్ట‌బెట్ట‌డం కోసమే మేయ‌ర్‌ను దింపేశారు. విశాఖ‌లో పేద‌లు వ్యాపారం కూడా చేసుకోలేక‌పోతున్నారు. ప్ర‌భుత్వ భూముల‌ను ప్రైవేటు సంస్థ‌ల‌కు ఇవ్వ‌కూడ‌ద‌ని 2012లో రెవెన్యూ శాఖ జీవో ఇచ్చింది. స్థానిక సంస్థ‌ల ఆధీనంలో ఉన్న భూముల‌ను ప్రైవేట్ సంస్థ‌ల‌కు ఇవ్వ‌కూడ‌ద‌ని 2011లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇవ‌న్నీ ఖాత‌రు చేయ‌కుండా ప్ర‌భుత్వం గీతంకాలేజీకి ప్ర‌భుత్వ భూముల‌ను ధారాద‌త్తం చేస్తోంది.

బ‌డ్జెట్‌లో ప్ర‌ధాన హామీల ఊసేలేదు
: పి.రామ‌సుబ్బారెడ్డి

-మూడో బ‌డ్జెట్‌లో అయినా సూప‌ర్ సిక్స్ లో ప్ర‌ధాన హామీలు ఆడ‌బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్ల‌కే పింఛ‌న్ హామీలు అమ‌లు చేస్తార‌నుకుంటే ప్ర‌భుత్వం దాని ఊసే లేకుండా మ‌రోసారి మోసం చేసింది. 

అంగ‌న్‌వాడీల వేత‌నాలు ఎప్పుడు పెంచుతారో చెప్పాలి
: క‌ల్ప‌ల‌తా రెడ్డి 

-నాలుగు రోజులుగా అంగన్‌వాడీ వ‌ర్క‌ర్లు త‌మ డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ధ‌ర్నాలు చేస్తుంటే వారి డిమాండ్లు ప‌రిష్క‌రించామని మంత్రి నిండు సభ‌లో ప‌చ్చి అబ‌ద్ధం చెప్పింది. 10 డిమాండ్ల‌లో 9 నెర‌వేర్చితే వారు ఇంకా ధ‌ర్నాలు ఎందుకు చేస్తారు? వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక అంగన్‌వాడీల‌కు పెరిగిన జీతాల‌ను చూపించి కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పెంచిన‌ట్టు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ధ‌ర్నాల్లో ఉన్న అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల ప‌ట్ల ప్ర‌భుత్వం అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించింది. వారు నిద్ర‌పోతుండ‌గా వేకువ‌జామున వారి టెంట్ల‌ను కూల్చి, టాయ్‌లెట్ల‌ను ప‌గ‌ల‌గొట్టి వారి వ‌స్తుల‌ను చింద‌ర‌వంద‌ర‌గా విసిరేసి వారిని ఈడ్చి పడేస్తున్నారు. అధికారంలోకి రావ‌డం కోసం నోటికొచ్చిన‌ట్టు హామీలివ్వ‌డం, వ‌చ్చాక విస్మ‌రించ‌డం చాలా త‌ప్పు. వారి వేత‌నాలు ఎప్ప‌టిలోపు పెంచుతారు? ఎంత మేర‌కు పెంచుతారో స్ప‌ష్టంగా చెప్పాలి. మంత్రి నుంచి స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతోపాటు త‌ప్పుడు స‌మాచారంతో స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డాన్ని నిరసిస్తూ స‌భ నుంచి వాకౌట్ చేయ‌డం జ‌రిగింది. 

గీతంకి భూ కేటాయింపుపై స‌మాధానం చెప్పాలి 
: కుంభా ర‌విబాబు

-నారా లోకేష్ తోడల్లుడు, ఎంపీ భరత్ కు చెందిన గీతం వర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన 55 ఎక‌రాల ప్ర‌భుత్వ భూములను క‌ట్ట‌బెట్ట‌డాన్ని నిర‌సిస్తూ మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున వాయిదా తీర్మానం ఇస్తే ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. విద్యావ్యాపారం చేస్తున్న ప్రైవేట్ సంస్థ‌కు సీఎం చంద్ర‌బాబు త‌న కుటుంబ స‌భ్యుడనే ప్రేమ‌తో ప్ర‌భుత్వ భూముల‌ను కారు చౌక‌గా క‌ట్ట‌బెట్ట‌డాన్ని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంది. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హయాంలో రుషికొండ‌లో టూరిజం శాఖ‌లో ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను నిర్మిస్తే త‌ప్ప‌న్న‌ట్టు ప్రచారం చేశారు. పెట్టుబ‌డుల ముసుగులో విశాఖ‌లో వేల కోట్ల విలువైన భూముల‌ను చంద్ర‌బాబు త‌న బినామీల‌కు 99పైస‌ల‌కే ఇష్టారాజ్యంగా క‌ట్ట‌బెట్టేస్తున్నాడు.

Back to Top