పిన్నెల్లి బ్రదర్స్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

వారిపై పెట్టిన కేసులు కట్టుకథలు. రాజకీయ ప్రేరేపితం

పల్నాడు జిల్లాలో జంట హత్యలకు వారికి ఏం సంబంధం?

ప్రభుత్వ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఆక్షేపణ 

నర్సారావుపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి.

టీడీపీ కూటమి ప్రభుత్వంలో పల్నాడు జిల్లాలో దారుణం 

మా పార్టీ శ్రేణులను నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారు

అలా ఇబ్బందులు పెట్టిన వారిలో ఏ ఒక్కరిని వదలిపెట్టం

వైయ‌స్ఆర్‌సీపీ నేతల స్పష్టీకరణ

పల్నాడు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

:టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి కాసు మహేష్‌రెడ్డి సవాల్‌

జ‌గనన్న ప్రభుత్వం వచ్చాక రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం

మాజీ మంత్రి విడదల రజిని హెచ్చరిక

పిన్నెల్లి సోదరులకు పార్టీ పూర్తి అండగా ఉంటుంది

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

నర‌స‌రావుపేట: మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కట్టుకథలతో వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విడదల రజిని, కాసు మహేష్‌రెడ్డి, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అసలు పల్నాడు జిల్లాలో జంట హత్యలకు, పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏమిటి సంబంధం అని వారు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్నాడు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని,  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పుడు అలా తమ పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన వారిలో ఏ ఒక్కరిని వదలిపెట్టబోమని నర్సారావుపేటలో మీడియాతో మాట్లాడిన పార్టీ నేతలు కాసు మహేష్‌రెడ్డి, విడదల రజిని, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

పరాకాష్టకు చేరిన రెడ్‌బుక్‌ రాజ్యాంగం: విడదల రజిని. మాజీ మంత్రి
– టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కట్టుకథలతో కేసులు పెట్టడం పరాకాష్టకు చేరింది. పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏ మాత్రం సంబంధం లేని కేసుల్లో వారి పేర్లు పెట్టడం దారుణం. అసలు పల్నాడులో జంట హత్యలకు, పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏమిటి సంబంధం? గుండ్లపాడు జంట హత్యలకు టీడీపీ గ్రూపుల మధ్య గొడవే కారణమని అందరికీ తెలుసు. అయినప్పటికీ అన్యాయంగా పిన్నెల్లి సోదరుల పేర్లు చేర్చి వేధిస్తున్నారు. చివరకు నాపైనా ఎన్నో కేసులు పెట్టారు. పోలీసులతో బెదిరింపులు, స్టేషన్‌ హాజరులు, అవమానాలు సరేసరి. అవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు చెబుతున్నాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిలో ఎవ్వరినీ, రేపు మా ప్రభుత్వం వచ్చాక వదలి పెట్టబోం. వారికి కచ్చితంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం. కాసు కుటుంబం రాష్ట్రానికి చేసిన సేవలు అందరికీ తెలిసినవే. వారి గౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. కానీ అవన్నీ విఫలమవుతాయి.

దమ్ముంటే చర్చకు రండి: కాసు మహేష్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే.
– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎలాంటి తçప్పు చేయలేదు. జంట హత్యల కేసుతో వారికెలాంటి సంబంధం లేదు. కాగా, నిన్నటి ప్రెస్‌మీట్‌లో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నిరాధార ఆరోపణలు చేశారు. ఆయన జూలకంటి కాదు.. జూలకంత్రి. పల్నాడు జిల్లాలో మొత్తం తెలుసు. గుండ్లపాడు జంట హత్యలు టీడీపీలో అంతర్గత పోరు వల్లే జరిగాయి. అయినా ఆ కేసులో పిన్నెల్లి సోదరులను ఇరికించి వేధించాలని చూస్తున్నారు. ఇంకా మా కాసు కుటుంబ ఆస్తులు, కాలేజీ భూములపైనా జూలకంటి బ్రహ్మారెడ్డి పిచ్చి ఆరోపణలు చేశారు. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను పుట్టక ముందే మా సొసైటీ చట్టబద్ధంగా ఏర్పడింది. సొసైటీ ద్వారా అక్రమ నిర్మాణాలు చేశామన్నారు కదా? కనీసం ఒక్క ఆధారమైనా చూపండి. మా పెద్దలు ఆస్తులు సంపాదించడం కోసం కాకుండా విద్యా సేవ కోసం భూములు కొనుగోలు చేశారు. 
మా కాసు కుటుంబం ఈ ప్రాంతం (ఇప్పుడు పల్నాడు జిల్లా) అభివృద్ధి కోసం ఎంతో చేసింది. అది వాస్తవం కాదనే «ధైర్యం మీకుందా?. అలా ఉంటే పల్నాడు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి. మీకు ఇదే నా సవాల్‌. ఎక్కడైనా ఆ చర్చకు నేను రెడీ.

జంట హత్యలకు టీడీపీ ఆధిపత్య పోరే కారణం
:డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే.
– పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యలు టీడీపీలో ఆధిపత్య పోరే కారణం. సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు టీడీపీ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకొండి. ఆరోజు అరెస్టు అయిన అయిదుగురిలో పిన్నెల్లి సోదరులు లేరు. ఆ తర్వాత కావాలనే రాజకీయ కక్షతో వారిని ఆ కేసులో ఇరికించారు. మా పార్టీ పిన్నెల్లి సోదరులకు పూర్తి అండగా నిలుస్తుంది.
 

Back to Top