విశాఖపట్నం: పార్వతీపురం జిల్లా కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య పాఠశాలల్లో అనారోగ్య పరిస్థితుల్లో గిరిజన విద్యార్ధినుల ప్రాణాలకు రక్షణలేని పరిస్థితులు కనిపిస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే ఇద్దరు ఆశ్రమ పాఠశాల విద్యార్ధినులు మృత్యువాత పడ్డారని, మరో 120 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖపట్నం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన, ఎకలవ్య పాఠశాల విద్యార్ధినులను మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి, అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే రాజన్నదొర, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను తదితరులు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు ఆసుపత్ర వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే... కలుషిత నీరు కారణంగానే విద్యర్ధినుల అస్వస్థత : మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి కురుపం ఆశ్రమ, ఎకలవ్య పాఠశాలలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు కామెర్ల వ్యాధి లక్షణాలతో అంజలి, కల్పన అనే ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో విద్యార్ధినులు జ్వరాలు, కామెర్ల బారిన పడి ఆసుపత్రుల్లో చేరారు. కురుపాం గురుకుల గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన నేపథ్యంలో అక్కడ అధ్వాన్నమైన పారిశుధ్య లోపం కనిపిస్తోంది. ఆర్వో ప్లాంట్ రెండు నెలల నుంచి పనిచేయడం లేదని సిబ్బంది చెప్పారు. కలుషిత మంచినీటి వల్ల విద్యార్ధులకు కామెర్ల వ్యాధికి గురవుతున్నారని వైయస్ఆర్‌సీపీ వెలుగులోకి తీసుకువచ్చిన తరువాత మాత్రమే అధికారులు స్పందించారు. ఈనెల రెండో తేదీన కలెక్టర్, పీఓ ఆశ్రమపాఠశాలను పరిశీలించారు. పక్కనే ఉన్న ఏకలవ్వ, గురుకుల పాఠశాలలకు నీటిని అందించే బోర్ ఒక్కటే. ఏకలవ్వతో పాటు గురుకుల పాఠశాల విద్యార్ధినులు కూడా కామెర్ల వ్యాధి భారిన పడ్డారు. కేజీహెచ్‌లోని వైద్యులు సైతం నీటి కలుషితం వల్లే విద్యార్ధినులు అస్వస్తతకు గురయ్యారని నిర్ధారించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. వాటి ఫిల్టర్లను కూడా మార్చలేదు. నెలన్నర రోజులుగా ఆ హాస్టల్‌లో నాన్‌వెజ్ పెట్టడం లేదు. దానికి కారణం కొందరు విద్యార్ధులు అప్పటికే కామెర్ల వ్యాధి భారిపడటంతో, ప్రిన్సిపల్ ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా భోజనంలో ఇచ్చే నాన్‌వెజ్‌ను నిలిపివేశారు. అలాగే గత నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్ ఆ హాస్టల్ విజిట్ చేశారు. అలాగే హాస్టల్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు, ఈ క్యాంప్‌లో అంజలికి ఫీవర్ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. ఈ విషయాన్ని హాస్టల్ ప్రిన్సిపాల్ దీనిని నిర్ధారించారు. అయితే నేడు అధికారులు అంజలిని తల్లిదండ్రులు బలవంతంగా హాస్టల్ నుంచి తీసుకువెళ్ళి నాటు వైద్యం ఇచ్చారని మాట మార్చారు. గత నెల 22న కల్పన అనే విద్యార్ధి కురుపం సీహెచ్‌సీలో చేరింది. స్కూల్ లోనే ఆమె అస్వస్తతకు గురయ్యింది. స్కూల్‌లోని అందరు విద్యార్ధులు 21వ తేదీన ఇళ్ళకు వెడితే, 20వ తేదీనే స్కూల్ మేనేజ్‌మెంట్ ఆ విద్యార్ధినిని పంపించేసింది. 22న కల్పన సీహెచ్‌సీలో చికిత్స తీసుకుని పార్వతీపురం ఆసుపత్రిలో గతనెల 24న అడ్మిట్ అయ్యింది. అక్కడి నుంచి 29వ తేదీన ఆమెను కేజీహెచ్‌కు పంపించారు. అక్టోబర్ 1వ తేదీన కల్పన ఇక్కడ చనిపోయింది. ఈ రెండు మరణాలకు ప్రభుత్వ బాధ్యత వహించకుండా స్థానికంగ ఉన్న ప్రిన్సిపల్, ఇతర సిబ్బందిని సస్సెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. గిరిజనశాఖ మంత్రి పూర్తి వైఫల్యం గత ఏడాదిన్నరగా 199 గురుకుల పాఠశాలల్లో నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. పారిశుధ్యం, సురక్షిత మంచినీరును పట్టించుకోవడం లేదు. మూడు నెలలుగా పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో వారు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. మంత్రిగారు మేం దోమతెరలు ఇచ్చామని చెబుతున్నారు, కనీసం ఒక్క స్కూల్‌లో అయినా దోమతెరలు ఇచ్చారా? ఆర్వో వాటర్ ప్లాంట్‌ల నిర్వహణను గాలికి వదిలేశారు. డార్మెటరీల్లో కనీసం ఫ్యాన్లు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. ఒకటో తేదీన విద్యార్ధుల అస్వస్తత బయటపడితే అయిదో తేదీన మంత్రిగారు స్పందించారు. నిన్న గురుకుల కార్యదర్శి గౌతమి గారు ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని బహిరంగంగా మీడియాకు చెబితే, ఈ రోజు విజిట్‌కు వెళ్ళిన మంత్రి ఆర్వోప్లాంట్ పనిచేస్తోందంటూ సమర్థించుకోవడం అత్యంత దారుణం. నీటిని పరీక్షించాం, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. సికిల్ సెలీమియాతో కల్పన చనిపయిందని గిరిజనశాఖ మంత్రి ఎలా చెబుతున్నారు? కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడతారా? సీఎం నుంచి గిరిజన బాలిక మరణాలపై ఫోన్ వస్తే తప్ప ఆమె విజిట్‌కు రాలేదని పత్రికల్లోనే వార్తలు వచ్చాయి. అంటే సంబంధిత మంత్రి తన గిరిజన సంక్షేమశాఖపై ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 129 మంది విద్యార్ధులు జాండీస్‌తో ఇబ్బంది పడుతున్నారు : అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి కురుపం గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్ధినులు కామెర్ల వ్యాధి బారినపడ్డారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆ విద్యార్ధినులను పరామర్శించడం జరిగింది. గత రెండు నెలలుగా గురుకుల పాఠశాలలో అనారోగ్యకర పరిస్థితులు ఉన్నా కూడా దానిని సరిదిద్దే ప్రయత్నం చేయడం, విద్యార్థినులకు సకాలంలో మెరుగైన చికిత్సలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గిరిజన విద్యార్ధినుల పట్ల ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. పారిశుధ్యం, రక్షిత మంచినీటి సరఫరా, దోమ తెరల సరఫరా, సీజనల్ జ్వరాలకు సంబంధించి వైద్య సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోంది. కామెర్ల వ్యాధి లక్షణాలతో ఇద్దరు విద్యార్ధినులు మరణించడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.