శ్రీసత్యసాయి జిల్లా: క్యాబ్ డ్రైవర్లు మొయినుద్దీన్, షఫి వేధింపులకు గురైన మహిళా హోంగార్డు ప్రియాంక బాయికి న్యాయం చేయాలని శ్రీసత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరించడమే కాక శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన గోరంట్ల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ బోయ శేఖర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం గోరంట్ల పోలీసు స్టేషన్ ఎదుట వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఐగా బాధ్యతలు చేపటినప్పటి నుంచి అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ, అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణను గాలికి వదిలేశారన్నారు. మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళా హోంగార్డు ప్రియాంక తనను క్యాబ్ డ్రైవర్లు మొయినుద్దీన్, షఫి వేధించారని ఫిర్యాదు చేసినా సీఐ పట్టించుకోలేదన్నారు. పైగా వేధింపులకు గురిచేసిన క్యాబ్ డ్రైవర్లకే వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. గత నెలలో అధికార పార్టీ మాజీ సర్పంచ్, మంత్రి సవిత ప్రధాన అనుచరుడు ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. సీఐ అండదండలతో ఆ మాజీ సర్పంచ్ అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారని గుర్తు చేశారు. భూ సమస్య విషయంలో సీఐ వేధింపులు భరించలేక పెనుకొండకు చెందిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి అయిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సీఐ వ్యవహారశైలిపై నూతన ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. రావణ రాష్ట్రంగా ఏపీ ఆంధ్రప్రదేశ్‌ను కూటమి ప్రభుత్వం రావణ రాష్ట్రంగా మారుస్తుందని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు. రోజురోజుకు మహిళల పట్ల టిడిపి నాయకులు దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి సవిత సొంత నియోజకవర్గంలో మహిళల పోలీసులకు భద్రత కరువైందని విమర్శించారు. మంత్రి సవిత అండతో టిడిపి నాయకులు షఫీ, మైనుద్దీన్ మహిళ పోలీస్ సుగాలి ప్రియాంక వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. సీఐ దగ్గరికి పోయినా తన మీద లేనిపోని ఆరోపణ మోపుతున్నారు అని, గోరంట్ల సీఐ శేఖర్ కూడా వారి మాటలు నమ్మి వాళ్లకే వత్తాసు పలుకుతూ నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పో అలాగే తనను క్వార్టర్స్ ఖాళీ చేయమన్నాడని మహిళా హోంగార్డ్ సుగాలి ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. ప్రియాంకను వేధించిన ఇద్దరు నిందితులను, సీఐ శేఖర్ ను వెంటనే వీధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.