తాడేపల్లి: పోలీసు ఆంక్షలతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈనెల 9న మాకవరపాలెంలో మెడికల్ కాలేజీని సందర్శించడంలో ఎలాంటి మార్పూ ఉండదని వైయస్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు అనుమతి లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ, విశాఖ సీపీ ప్రకటించిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నర్సీపట్నంకి వస్తుంటే భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేయడం రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయనడానికి నిదర్శనం అని మండిపడ్డారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి పర్యటనకి భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. వారం రోజులుగా ఉత్తరాంధ్రలో తీవ్రమైన వర్షపాత పరిస్థితులున్నా ఆయన్ను హెలిక్యాప్టర్ లోనే రావాలనడం చూస్తుంటే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. ఇంకా వారేమన్నారంటే... వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే అక్కసుతోనే: పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా డాక్టర్లుగా ఉన్నత చదువులు చదివి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడాలని ఆకాంక్షించి మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడమే కాకుండా 5 కాలేజీల నిర్మాణం కూడా పూర్తి చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి మరో రెండు మెడికల్ కాలేజీలు పాడేరు, పులివెందుల పూర్తయ్యాయి. విడతల వారీగా కాలేజీల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు నిధుల కొరత రాకుండా ముందు చూపుతో నాబార్డు నిధులతో టైఅప్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల నిర్మాణాలను పక్కన పెట్టింది. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఒక్క రూపాయి కూడా వాటికోసం ఖర్చు చేయకుండా పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి సిద్ధమైపోయింది. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే అక్కసుతో పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యాన్ని వారికి దక్కకుండా చేయడం దుర్మార్గం. ప్రభుత్వ బాధ్యతగా అందించాల్సిన ప్రజావైద్యాన్ని కార్పొరేట్ చేతుల్లో పెడుతూ పేదలకు వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేస్తున్నారు. ప్రైవేటీకరణ పేరుతో 10 మెడికల్ కాలేజీలకి చెందిన ప్రభుత్వ సంపదను తన వారికి దోచిపెట్టడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలనను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ● ఆంక్షల పేరుతో జగన్ పర్యటనని అడ్డుకోలేరు విజయవాడ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకుని అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నంలోని మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించడం జరుగుతుంది. భద్రత కల్పించలేమన్న కారణంతో ఉద్దేశపూర్వకంగా వైయస్ జగన్ పర్యటనని కట్టడి చేయాలని కుట్ర చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కి ఉద్యమాలు కొత్తకాదు. ఎవరు ఎన్ని విధాలుగా కట్టడి చేసే కుట్రలు చేసినా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారు. అందులో రెండో ఆలోచన లేదు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకుడికి ప్రజల్లో తిరగడం కొత్తకాదు. మా నాయకుడి అనకాపల్లి జిల్లా పర్యటనకు సంబంధించి ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చాం. అందుకు అనుగుణంగా పోలీసులు రోప్ పార్టీలను సిద్ధం చేసుకోవాలే కానీ, భద్రతా కారణాలను చూపించి చేతులెత్తేయడం ప్రభుత్వానికి అవమానకరం. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో రోడ్డు మార్గంలో చాలాసార్లు పర్యటించారు. ఆ సమయంలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. చంద్రబాబు కందుకూరు, గుంటూరు పర్యటనల్లో తొక్కిసలాట జరిగినా, పీలేరులో తెలుగుదేశం శ్రేణులు పోలీసులపై దాడులకు దిగి విధ్వంసం సృష్టించినా ఆయన పర్యటనలకు ఎక్కడా మేము అనుమతులు నిరాకరించలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పర్యటనలకు సహకరించాం. కానీ వైయస్ జగన్ పర్యటనలపై ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు విధించడం, ఎలా రావాలో ఎక్కడికి రావాలో ప్రభుత్వమే చెప్పడం సిగ్గుచేటు. ఉత్తరాంధ్రలో వాతావరణం అనుకూలంగా లేదన్న విషయం ప్రభుత్వానికి, పోలీసులకు తెలిసి కూడా హెలిక్యాప్టర్‌లో రావాలనడం విడ్డూరంగా ఉంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా మెడికల్ కాలేజీకి చేరుకుని పరిశీలించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడతారు. ప్రతిపక్ష నేత పర్యటన గురించి వైయస్ఆర్‌సీపీ తరఫున మూడు రోజుల క్రితమే ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వడం జరిగింది. ● వైయస్ఆర్‌సీపీ నాయకులపై ఆంక్షలు ప్రతిపక్ష నేత అనకాపల్లి వస్తుంటే ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ప్రతిపక్ష నేత పర్యటనకు ఎవరూ వెళ్లకూడదని ఇప్పటికే నాయకులు నోటీసులిస్తున్నారు. కార్యకర్తలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎవరొస్తున్నారు? ఎంత మంది వస్తున్నారు? ఆధార్ నంబర్, కార్ నెంబర్ చెప్పాలని వేధిస్తున్నారు. హౌస్ అరెస్టులు చేయాలని చూస్తున్నారు. వైయస్ జగన్ లాంటి మాస్ లీడర్ వస్తుంటే లెక్కలేసుకుని కొంతమందినే అనుమతించాలని చూడటం అవివేకం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు ప్రైవేటీకరిస్తుంటే ప్రతిపక్ష పార్టీగా చూస్తూ ఊరుకోవాలా? మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే విషయంలో తప్పు చేస్తున్నామన్న భావన ప్రభుత్వంలో ఉంది కాబట్టే వైయస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేస్తున్న ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించడం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆటంకపర్చవద్దని వైయస్ఆర్‌సీపీ తరఫున పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్ష నేత పర్యటనకు ప్రభుత్వమే భద్రత కల్పించాలి : పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పర్యటనలో ఎలాంటి మార్పూ ఉండదు. ముందుగా ప్రకటించినట్టుగానే 9వ తేదీన మాకవరపాలెంలో మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. కాలేజీ నిర్మాణం ఎంతవరకు పూర్తయిందో పరిశీలిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా మొండివైఖరితో ముందుకు వెళుతోంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రతిపక్షపార్టీగా వైయస్ఆర్‌సీపీ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే ఉండదు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ స్పష్టంగా చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి కోటి సంతకాలను స్వీకరించి వైయస్ఆర్‌సీపీ తరఫున గవర్నర్‌ను కలుస్తాం. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి పోలీసులు భద్రత కల్పించాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నాం. ● జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు నర్సీపట్నంలో నిర్మాణం జరుగుతున్నది మెడికల్ కాలేజీయా కాదా అన్నది స్పీకర్ అడిగితే వైద్యారోగ్యశాఖ అధికారులు వివరాలు ఇచ్చేవారు. మాకిచ్చిన నోటీసుల్లో ఆ బిల్డింగుని సందర్శించాలంటే ఏపీ మెడికల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. అక్కడ నిర్మాణంలో ఉన్నది మెడికల్ కాలేజీయే కానట్టయితే ఏపీఎంఐడీసీ అనుమతులు తీసుకోవాలని ఎలా సూచిస్తున్నారో ఆయనకు తెలియదా? ఆయన తెలిసి మాట్లాడారో తెలియకుండా మాట్లాడారో మాకు అనవసరం. అయినా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వస్తానంటే ఆయనకు మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించిన జీవోలు చూపిస్తాం. నిర్మాణాలు చూపిస్తాం.