సింగనమల : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సింగనమల మండల కేంద్రంలో వైయస్ఆర్‌సీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ సూచనలతో వైయస్ఆర్‌సీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు ఆటోను లాగుతూ నిరసన తెలుపుతూ, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న నాయకులు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, వాటిపై విధిస్తున్న పన్నులే అందుకు కారణమని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపశమనం కల్పించాలంటే పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్‌తో పాటు ఇతర పన్నులను తగ్గించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం జోనల్ ఇన్‌చార్జ్ మంజునాథ్, నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం. మోహన్ రెడ్డి, నాయకులు శ్రీరామరెడ్డి, వంశీ గోకుల్ రెడ్డి, గువ్వల శ్రీకాంత్ రెడ్డి, వీరాంజనేయులు, నూరు మహమ్మద్, మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఆంజనేయులు, పార్వతి, శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి, బండి శీన, ఎన్వీ రమణ, శివమ్మ, రామకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.