తాడేపల్లి: విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్స్ చేశారు. గురువారం రాత్రి అంబేద్కర్ స్మృతివనంలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి రోజు. భారతదేశ భావితరాల దిక్సూచి, భారతరాజ్యంగ నిర్మాత శిలాఫలకాన్ని, విగ్రహాన్ని విధ్వంసం చేయడానికి పూనుకోవడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గురువారం ఒక చీకటి రోజని మాజీమంత్రి మెరుగు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున భారతదేశ భావితరాల దిక్సూచి, భారతరాజ్యంగా నిర్మాత, దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలన్న తలంపుతో రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయునియొక్క శిలాఫలకాన్ని, విగ్రహాన్ని విధ్వంసం చేయడానికి పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. స్వయంగా ప్రభుత్వమే దాడి ఘటనలో ఇన్వాల్స్ అయి చేయించడం దారుణమన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికంటే ముందు అనేక ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టండి అని అడిగినందుకు కేసులు పెట్టారని, ఎక్కడో ముళ్లపొదల్లో విగ్రహం పెడుతున్నారని చూడ్డానికి వెళ్తే కూడా కేసులు పెట్టారని నాగార్జున మండిపడ్డారు. చివరకి మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాటలు కూడా వివాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసారు. అంబేద్కర్ భావజాలం మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు కోకొల్లలుగా చూశామన్నారు. ఇవాళ విజయవాడ నగరం నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టే స్ధలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా అమ్ముకుని వారి మనుషులకు అప్పగించాలని కుట్రలు చేస్తే దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగిన నేపధ్యాన్ని గుర్తు చేసారు. అలాంటి ప్రాధాన్యత ఉన్న ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్నికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డిగారు ఉన్నప్పుడు ఎవరూ అడగకుండానే స్వయంగా ఆయనే… కోట్లాది రూపాయలు ఖరీదు చేసే… మహనీయులు నడయాడిన ఈ స్ధలాన్నిఅంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు తీర్మానించి ముందుకు రావడం ముదావహమని ప్రసంశించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూ.404 కోట్లతో.. 125 అడుగుల బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్నిఏర్పాటు చేసి భారతదేశానికి అంకితం చేసిన చరిత్రను దేశంతో పాటు ప్రపంచమంతా చూసిందన్నారు. ఈ విగ్రహానికి ఒక చరిత్ర ఉందని…. ఇదొక గొప్ప స్మారకమని కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసి తపించాలని, భావితరాలకు ఉపయోగం ఉంటుందన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి ఈ స్మారకాన్ని విధ్వంసానికి పాల్పడ్డం చూసి హృదయం చలించిపోయిందన్నారు. విగ్రహ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిగా… అంబేద్కర్ భావజాలం మీద వైయస్.జగన్మోహన్రెడ్డికి ఉన్న తపన, అకుంఠితమైన దీక్ష, పట్టుదల చూస్తే ఎవరికైనా శెభాష్ అనిపిస్తుందని పేర్కొన్నారు. అలాంటి విగ్రహాన్ని లక్షలాది మంది సమక్షంలో ఆవిష్కరించుకున్నామన్నారు. గౌరవ గవర్నర్ గారి బంగ్లాతో పాటు విజయవాడ మన్సిపల్ కమిషనర్ గారి బంగ్లాకు కూతవేటు దూరంలో అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాంపై నిన్నరాత్రి దుండగులు, ప్రభుత్వ అనుమతి, అండదండలు, స్వయంగా ముఖ్యమంత్రి గారి అండతో పలుగుతో దాడిచేయడం క్షమార్హం కాని నేరమని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ భావజాలంపై ఉన్నటువంటి ఆలోనను ఈ చర్య తేటతెల్లం చేసిందన్నారు. మమ్నల్ని ఏం చేసినా, మేం ఏమైపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పై ఉందన్నారు. ఇలా వదిలేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోసే అవకాశం లేకపోలేదని దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు వహించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే… విగ్రహం ఉండదని భయపెట్టాలని చూస్తూ.. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూదని.. ఆయన పేరు ఉండకూడదని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ద్వారా అంబేద్కర్ భావజాలం మీద మీకు సానుకూలధృక్ఫదం లేదన్న విషయం తేటతెల్లమవుందన్నారు. ఆరు నూరైనా… ప్రభుత్వం మీదైనా.. అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడానికి మీరు పురికొల్పారు కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన వారిపై బాధ్యత కలిగిన ప్రభుత్వంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ ప్రభుత్వం, అధికారుల మీద మాకు నమ్మకం లేదని.. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మా అంబేద్కర్ విగ్రహం మీద పలుగు పడిన నేపధ్యంలో… రాబోయే రోజుల్లో ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఈ రాష్ట్రంలో ఉద్యమాలు రాబోతున్నాయని…. అవి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉరితాళ్లు అవడం ఖాయమని ఆయన హెచ్చిరించారు.. కోట్లాదిమంది అంబేద్కరీయుల గొంతు నొక్కడం మీ వల్ల కాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరగక ముందు.. దాడి జరిగిన తర్వాత అంబేద్కర్ స్మృతివనం వీడియోను మెరుగు నాగార్జున మీడియా ముందు ప్రదర్శించారు. నందిగం సురేష్, మాజీ ఎంపీ. అంబేద్కర్ విగ్రహంపై దాడి ఘటన ద్వారా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల నైజం మరోసారి బయటపడిందని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆక్షేపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మధ్యాహ్నం నుంచి మనుషుల్ని కొట్టి చంపడం, మహిళలపై అమానుషాలతో పాటు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వేటకొడవళ్లుతో వెంటపడి చంపడం, కిడ్నాపులు వంటి ఘటనలన్నీ చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఈ 60 రోజుల్లో హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, కిడ్నాప్ల వంటి అకృత్యాలకు పాల్పడుతుందన్నారు. హామీల అమలు చేయడానికి కమిటీ వేస్తామని లోకేష్ చెబుతున్నారని.. హామీ ఇచ్చినప్పుడే ఆ కమిటీ వేసుంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తుందని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం బయటపడిందన్నారు. హామీల అమలు చేయకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి దాడులు, అఘాయిత్యాలు చేస్తూనే ఇంకా కడుపు మంట చల్లారక ఏకంగా మహానుభావుడు బీఆర్ అంబేద్కర్ విగ్రహంపైన దాడికి దిగడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఒకప్పుడు తుళ్ళూరు ప్రాంతంలో ఐనవోలు గ్రామంలో మురికికూపంలో కేవలం ఎస్సీలు, బీసీలు ఓట్లుకోసమే విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి.. చివరికి పౌండేషన్ వేయకుండానే ఐదేళ్లు పబ్బం గడిపిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండాల్సిన చోటు అది కాదని.. ఏకంగా విజయవాడలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి ఆ విగ్రహంపై అక్కసు వెళ్లకక్కుతున్నారని మండిపడ్డారు. గతంలోనే టీడీపీ అధికారంలోకి రాకముందే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని పొన్నూరు శాసనసభ్యుడి వ్యాఖ్యలను ఈ సందర్బంగా గుర్తుచేశారు. చివరికి రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడిని కించపరిచే చర్యలు చేస్తున్నారని.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి నోరు నొక్కాలని చేస్తున్న అధికార పార్టీ తీరుపై భయపడేది లేదని సురేష్ తేల్చిచెప్పారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ దేశం మొత్తం తెలిసేలా చేస్తామన్నారు. నిన్నటి ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని నందిగం సురేష్ స్పష్టం చేశారు.