రాజమండ్రిలో ‘కల్తీపాల’ మరణ మృదంగం

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఐదుగురు బలి

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ధ్వజం

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి.

ప్రభుత్వానివి కాకి లెక్కలు 

క్షేత్ర స్థాయిలో భయంకర పరిస్థితి

రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి

బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలి 

డైవర్షన్ తప్ప డైరెక్షన్ లేని ప్రభుత్వ పాలన ఇది

106 కుటుంబాలకు పరీక్షలు చేయాలి

పాల శాంపిల్స్ ను నేషనల్ ల్యాబ్ లో పరీక్షించాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ 

రాజమండ్రి: రాజమండ్రి నగరంలో కల్తీ పాల కలకలం ఐదుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లాలా చెరువు, దివాన్ చెరువు, స్వరూప్ నగర్ బాధితులను పరామర్శించిన అనంతరం జక్కంపూడి విజయలక్ష్మి, వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మరియు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని, ప్రజల ప్రాణాల కంటే రాజకీయ కక్షసాధింపులకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వారు మండిపడ్డారు. ఆసుపత్రుల్లో ఉన్న బాధితుల సంఖ్యపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని జక్కంపూడి విజయలక్ష్మి మండిపడ్డారు. కల్తీపాల ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా.. ప్రభుత్వం, నుంచి అధికారుల నుంచి స్పందన లేకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేవలం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించి చంద్రబాబు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ 17 మెడికల్ కాలేజీలు కడితే, వాటిని ప్రైవేటు పరం చేసి కూటమి ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. మరోవైపు కల్తీపాల బాధితులంతా లక్షలాది రూపాయలు అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, తమ వైఫల్యాల నుంచి డైవర్షన్ తప్ప ఈ ప్రభుత్వానికి సరైన డైరెక్షన్ లేదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణగోపాల్ మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి బాధితుల అన్ని మెడికల్ ఖర్చులు భరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఇంకా ఏమన్నారంటే...

● జక్కంపూడి విజయలక్ష్మి -  వైయ‌స్ఆర్‌సీపీ నేత.

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 5 మంది చనిపోగా.. వివిధ ఆసుపత్రులలో ఉన్న వారికి కూడా సరైన చికిత్స అందడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. కిమ్స్ ఆసుపత్రిలో 5మంది, రెయిన్ బో లో ముగ్గురు మాత్రమే చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం చెబుతుండగా... క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పరిస్థితి విషమంగా ఉందన్నారు.  ఆదిత్యతో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లో కూడా బాధితులు చికిత్స పొందుతున్నట్టు తాము క్షేత్రస్ధాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు తెలిసిందని ఆమె స్పష్టం చేశారు. ఈ  ఘటన జరగడం దురదృష్టకరం. పౌష్టికాహారం అనుకున్న పాలే కల్తీ అయి ప్రాణాలు తీయడం బాధాకరం.  రాజమండ్రి లాలా చెరువు, దివాన్ చెరువు, స్వరూప్ నగర్ లో ఈ పాలు తాగి ఇబ్బంది పడుతూ చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి సంతాపం తెలిపాం. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి కూడా పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాం. కల్తీ పాలు బారిన పడినవారంతా చిన్న చిన్న కుటుంబాలకు చెందిన పేద, మధ్యతరగతి ప్రజలే. కనీసం చికిత్స కూడా చేయించుకోలేని స్దితిలో ఉన్నారు. ఒకే కుటుంబంలో అత్తాకోడళ్లు తాడి కృష్ణవేణి, రమణి అత్త కోడళ్ళు చనిపోవడం కూడా మరింత బాధాకరం.  రెయిన్ బౌ ఆస్పత్రిలో నెలల పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. వారి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. అయినప్పటికీ ప్రభుత్వం లో ఇప్పటివరకు సరైన కదలికలేదు. కూటమి ప్రభుత్వం లో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదనడానికి ఇదే నిదర్శనం. కేవలం ప్రతిపక్షనేతలను అక్రమ అరెస్టులు చేయడం తప్ప... ప్రభుత్వానికి మరో పనిలేదన్నారు. వ్యవస్దలను నిర్వీర్యం చేయడం, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు తప్ప మరో లేదన్నారు. మున్సిపాల్టీ పరిధిలో అయితే పారిశుద్ధ్యం మరింత అధ్వాన్నంగా ఉంది.  

తిరుపతి లడ్డు కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. పదే పదే దేవుడి ప్రసాదంపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు, ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రం నోరు మెదపడం లేదు. బాధ్యతగల ప్రతిపక్షంగా మేం క్షేత్రస్దాయికి వెళ్లి నిలదీస్తే తప్ప ప్రభుత్వంలో చలనం రాలేదు. ప్రభుత్వమే బాధితులకు పూర్తిగా మెరుగైన వైద్యాన్ని అందించాలని, ప్రతి రూపాయి ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. 

● జక్కంపూడి రాజా - వైయ‌స్ఆర్‌సీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు.

పాలల్లో కల్తీ జరిగి ఇప్పటివరకు 16 మంది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5 మంది చనిపోవడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలను ఇవాళ పరామర్శిస్తే... దాదాపు వారం రోజుల నుంచి ఒకేరకమైన లక్షణాలతో ఆసుపత్రులలో చేరుతున్నా... ప్రభుత్వ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల కోసమే వాడుతుంది తప్ప... ప్రజల సంక్షేమం, వారి అవసరాలను తీర్చడానికి వాడ్డం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ కేసులో అరెస్టై బెయిలుపై  జైలు నుంచి విడుదలైన సందర్భంలో రాజమండ్రి నుంచి ఇంటికి వెళ్తున్న సందర్భంలోనూ దాదాపు 150 మంది పోలీసులు ఆయన్ను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలీసు వ్యవస్థను ఇలాంటి కక్షసాధింపు చర్యలకు ఉపయోగించే బదులు, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఉపయోగిస్తే ప్రజలకు మేలు జరిగేది. అదే జరిగితే వారం రోజుల నుంచి కల్తీ పాల వ్యవహారంలో ప్రాణాప్రాయస్దితిలో రోగులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది కాదు.  మేం బాధితుల పరామర్శకు వెళ్లినప్పుడు  ఆశ్చర్యపోయే వాస్తవాలు చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కేవలం కల్తీపాల వల్లే  బల్లా అనంతలక్ష్మి అనే మహిళ... హఠాత్తుగా రోజుల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురై డయాలసిస్ చేయాల్సిన స్థితికి చేరుకున్నారు. బాధితులను  ప్రభుత్వం తరపున నుంచి ఒక్క ప్రజాప్రతినిధి కాని, అధికారి కాని వెళ్లి పరామర్శించలేదు. రెండేళ్లు నిండని బాలుడికి కల్తీ పాల ఘటనలో.. చికిత్స కోసం ఇప్పటివరకు రూ.8.50 లక్షలు ఖర్చైంది. వీళ్లంతా పేద, మధ్యతరగతికి చెందిన వారే. ఇలాంటి వారి కోసమే మా నాయకుడు మాజీ సీఎం వైయస్.జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వాటిని ప్రైవేటు పరం చేసి పేదలకు నాణ్యమైన వైద్యం దూరం చేస్తూ ఇలాంటి పరిస్థితే వస్తుంది.  

ఆసుపత్రులో బిల్లులే దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంటే..  కొద్ది సేపటి క్రితం సీఎం చంద్రబాబు చనిపోయిన వారికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించడం చాలా దురదృష్టకరం. తక్షణమే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాజమండ్రి రావాలి. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం దీనిమీద పూర్తిగా దృష్టి పెట్టాలి. చనిపోయిన వారు, వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారంతా.. అడ్డాల గణేష్ అనే వ్యక్తి దగ్గర పాలు తీసుకున్నవారే. కల్తీ పాలు ఘటనలో చనిపోయిన వారికి చికిత్స అందించడంలో సకాలంలో స్పందించని ప్రభుత్వం.. మృతి చెందిన వారికి మాత్రం ఆగమేఘాల మీద పోస్టు మార్టమ్ చేసి మృతదేహాన్ని అప్పగిస్తున్నారు. అక్కడ నుంచే అంత్యక్రియలకు తీసుకెళ్లండని ఒత్తిడి చేస్తున్నారు. మీరు ప్రకటించిన 106 కుటుంబాలకు గణేష్ అనే వ్యక్తి పాలు సరఫరా చేశాడు. వారందరికీ అవసరమైన మెడికల్ పరీక్షలు నిర్వహించి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారికి అయిన ఖర్చంతా ప్రభుత్వమే భరించడంతో పాటు మృతుల కుటుంబాలకు కచ్చితంగా నష్టపరిహారం పెద్ద ఎత్తున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితుల తరపున పోరాటం తప్పదని హెచ్చరించారు. అదే విధంగా కల్తీ అయిన పాల నమూనాలను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లలో పరీక్షలు చేసి.. కల్తీకి కారణాలు బహిర్గతం చేయాలని కూడా డిమాండ్ చేశారు. 

● డైవర్షన్ తప్ప డైరెక్షన్ లేని ప్రభుత్వ పాలన ఇది: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ  

పాలకల్తీ వలన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి, వారికి సానుభూతి తెలియజేసాం. అదేవిధంగా వివిధ ఆసుపత్రులలో ఉన్నవారికి అందుతున్న చికిత్సపై కూడా ఆరా తీసి, వారికి దైర్యం చెప్పాం. కల్తీ పాలన ఘటనల అనారోగ్యం పాలైన వారిలో దాదాపు అందరూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ చికిత్స కోసం అయ్యే ఖర్చు భరించడం వీళ్లకు తలకు మించిన పని. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.   కానీ ప్రభుత్వం ఆ పని చేయడంలో విఫలమైంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే... అసలు పాల కల్తీ కి కారణమైన గణేష్ వద్ద పాలు తీసుకుంటున్న 106 కుటుంబాలను ఈ సరికే  ప్రభుత్వం వారందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఈ పనిచేయకపోవడం వల్ల బాధితులు చికిత్స కోసం ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి వస్తోంది. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుని.. బాధితులను దేవుడే దిక్కన్నట్టు వదిలివేసింది. కల్తీ పాలను రోజూ వాడుతున్న 106 కుటుంబాలకు ఆరోగ్య అత్యవసర పరిస్థితి ని విధించి, కాల్ సెంటర్ తో పాటు వారి కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. చనిపోయిన వారికి నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్న సీఎం చంద్రబాబు.. వివిధ ఆసుపత్రుల్లో ఉన్న బాధితుల చికిత్స గురించి మాత్రం మాట్లాడ్డం లేదు. రాజమండ్రిలో ఈ తరహా కేసులున్న చోట హెల్త్ హెమర్జెన్సీని ప్రకటించి, ప్రత్యేకమైన ఆసుపత్రిలో చికిత్స అందించాలని చెల్లుబోయిన వేణుగోపాల్ డిమాండ్ చేశారు. మరోవపైు జాతీయస్ధాయి ల్యాబ్ లలో పాల శాంపిళ్లను పరీక్షించాలని కోరారు. అంతే తప్ప ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నించిన ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ... ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాన్ని మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

Back to Top