ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోండి

ప్రధాన మంత్రికి వైయస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధుల విజ్క్షప్తి

ఓర్వకల్లులో ప్రధాని మోదీకి వైయస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధుల వినతిపత్రం

కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం  ప్రైవేటీకరించేందుకు చేస్తున్న చర్యలను అడ్డుకోవాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్‌, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిలు ఓర్వకల్లులో ప్రధాని నరేంద్రమోదీకి వినపతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో గత ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే, నేడు సీఎం చంద్రబాబు వాటిని తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ప్రైవేటుపరం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా సింగిల్ టెండర్ విధానాన్ని కూడా అంగీకరించేందుకు తెగబడటం దారుణమన్నారు. తన అనుయాయులకు ప్రైవేటు కాలేజీలను కట్టబెట్టేందుకు అన్ని నిబంధనలకు నీళ్ళొదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో పేదలకు మెడికల్ విద్యను, మెరుగైన వైద్యాన్ని అందించేందుకు సీఎంగా వైయస్ జగన్ చేసిన ప్రయత్నాలను పూర్తిగా నేడు నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనే అయిదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి, తరగతులను కూడా ప్రారంభించామని, మరో రెండు కాలేజీల నిర్మాణం గత ఏడాది పూర్తయ్యిందని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సిన కాలేజీలను గంపగుత్తగా ప్రైవేటు వారికి అప్పగించడం వల్ల పేదలు దారుణంగా నష్టపోతారని, బిజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వ పరంగానే నడుస్తున్నాయని అన్నారు. దీనిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వానికి మార్గనిర్ధేశం చేయాలని ఆ వినతి పత్రంలో కోరామని వెల్లడించారు.

Back to Top