అభివృద్ధిని అడ్డుకుంటే ఆగ్రహం రాదా..?

బాబును ఉత్తరాంధ్ర ప్రజలెవరూ హర్షించరు

గుండాలు, రౌడీలు అంటే రాయలసీమలో కూడా తిరగనివ్వరు

ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘటన ప్రజలింకా మర్చిపోలేదు

రెండేళ్ల క్రితం వైయస్‌ జగన్‌ను రన్‌వే పైనే అడ్డుకుంది గుర్తులేదా..?

నీచ రాజకీయాలు చేసే బాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరం

జాతీయ నేతని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీ అల్లర్లపై స్పందించాడా..?

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజలు తెలివి తక్కువ వారు.. నేను ఏది చెప్పినా నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉన్నాడు. విశాఖపట్నానికి రాజధాని అవసరం లేదు.. అభివృద్ధి కూడా అవసరం లేదని మాట్లాడిన చంద్రబాబు ప్రజలు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వారు ఎవరూ హర్షించరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలంతా చంద్రబాబు యాత్రను అడ్డుకున్నారన్నారు. అమరావతే ముద్దు అని సిగ్గులేకుండా మాట్లాడే చంద్రబాబు ఎవరూ హర్షించరన్నారు. చంద్రబాబుదంతా రాక్షసానందం. తన రాజకీయం కోసం ఏ స్థాయికైనా దిగజారి ఎన్నైనా మాట్లాడుతాడు. తెలుగుదేశం పార్టీ స్థాపించి చోటు, గౌరవం కల్పించిన ఎన్టీఆర్‌నే ఘోరంగా అవమానించిన చరిత్ర చంద్రబాబుది అని ధ్వజమెత్తారు

విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో దాడి వీరభద్రరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ఉత్తరాంధ్ర ప్రజలు పార్టీలతో సంబంధం లేకుండా చంద్రబాబు యాత్రను అడ్డుకున్నారు. విశాఖపట్నం రాజధాని కావాలని ఎవరు అడిగారు.. వాళ్లకు ఏ రాజధాని, ఏ అభివృద్ధి కూడా అవసరం లేదు. అమరావతే నాకు ముద్దు. అమ్మకంటే అమరావతి గొప్ప అని చెప్పే చంద్రబాబును చూసి ఉత్తరాంధ్ర ప్రజలు ఏ పార్టీకి చెందినవారైనా భరించగలరా..?

ప్రతిపక్షనేతకు ఇచ్చే గౌరవం ఇదేనా..? పోలీసులు ఇచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబు అడిగాడు. రెండేళ్ల క్రితం ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్‌ జగన్‌ విశాఖకు వచ్చినప్పుడు ఏపీ  పోలీసులు రన్‌వేపైకి వెళ్లి అడ్డుకున్నారు. కనీసం ఎయిర్‌పోర్టులోకి కూడా అడుగుపెట్టనివ్వకుండా చేసింది వాస్తవం కాదా..? అప్పుడు పోలీసులు చేసింది సమంజమా..? ఇంకా ఇప్పుడు చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ, ప్రజలు అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని చెప్పి అడ్డుకున్నారు. ఒక వ్యక్తి పర్యటన కోసం షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని బాబు ఆశిస్తున్నారా..? ప్రజా ఆగ్రహం చూసి వెనక్కు వెళ్లాల్సిన వ్యక్తి నాలుగు గంటలు రోడ్డు మీద కూర్చొని రాజకీయం చేయాలని చూశాడు. జాతీయ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీ అట్టుడికి పోతుంటే అక్కడకు వెళ్లి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశారా..?

పులివెందుల నుంచి రౌడీలు, గుండాలు విశాఖకు వచ్చి అల్లర్లు చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. తునిలో కాపు నేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో సభ పెడితే.. అక్కడ రైల్వేబోగిని కొంతమంది కడప నుంచి వచ్చి తగలబెట్టారని చంద్రబాబు మాట్లాడాడు. సీఐడీ ఎంక్వైరీలో ఎంతమంది కడప వాళ్లను అరెస్టు చేశారు చంద్రబాబూ..? అది బోగస్‌ అని తేలిపోయింది. ఏది జరిగినా పులివెందుల, కడప అని ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటు. కడప, కర్నూలు వాసులను రౌడీలు, గుండాల్లా ప్రచారం చేస్తున్నాడు. ఇటువంటి ప్రచారం చేస్తే రాయలసీమలో కూడా చంద్రబాబు అడ్డుకొని వెనక్కు పంపించే పరిస్థితులు వస్తాయి.

1994లో చంద్రబాబు చేసిన పనేంటి. ఎన్టీఆర్‌ వైశ్రాయ్‌ హోటల్‌కు వచ్చినప్పుడు నందమూరి తారక రామారావుపై టమాటాలు, చెప్పులు, కోడిగుడ్లు విసిరించింది మీరు కాదా చంద్రబాబూ..? విశాఖలో మీపై విసిరిన ఒక్క చెప్పును చూపించలేకపోయారు. కానీ, వైశ్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పుల కుప్పలు కనిపించాయి. నేను ప్రత్యక్ష సాక్షిని. పార్టీని స్థాపించి చంద్రబాబుకు చోటు కల్పించి.. గౌరవం ఇచ్చిన ఎన్టీఆర్‌ని అవమానించిన విషయం ప్రజలు మర్చిపోయారనుకుంటారా..? చంద్రబాబు నీకు సిగ్గులేదా..? ఎన్టీఆర్‌ అసెంబ్లీకి వస్తే రూల్స్‌ను పక్కనబెట్టి ఆయన్ను మాట్లాడకుండా చేసింది మర్చిపోయారా..? మొదటిసారి ఎన్టీఆర్‌ కళ్లలో నీరు చూశాను. ఎన్టీఆర్‌ను అవమానిస్తుంటే చంద్రబాబు రాక్షసానందం పొందాడు.

ఇవాళ విశాఖలో తనకు అన్యాయం జరిగిందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి ఏనాడూ చూడలేదని బీరాలు పలుకుతున్నాడు.  డాల్ఫిన్‌ హోటల్‌లో ఎన్టీఆర్‌ వెన్నుపోటుకు కుట్ర రచించిన చంద్రబాబు దాన్ని వైశ్రాయ్‌ హోటల్‌లో అమలు చేశాడు. మామ అనే కనీస గౌరవం కూడా లేకుండా ఆయన చనిపోయిన తరువాత కూడా కక్షతీర్చుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో ఎన్టీఆర్‌ మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తే ఆనాటి పోలీస్‌ కమిషనర్‌ అప్పారావును పిలిచి ప్రజలు ఉండేందుకు వీల్లేదు.. రామారావును చూసేందుకు ఎవరూ రాలేదని అనుకోవాలని లాఠీచార్జ్‌ కూడా చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తి నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకొని ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని దాడి వీరభద్రరావు డిమాండ్‌ చేశారు.

 

తాజా వీడియోలు

Back to Top