తాడేపల్లి: అన్యాయానికి గురైన కార్యకర్తలకు వైయస్ఆర్‌సీపీ డిజిటల్ బుక్ అండగా ఉంటుందని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. డిసెంబర్ 15 నాటికి పార్టీ నిర్మాణం పూర్తి చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం.. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత: మామూలుగా ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్లు పాలన చేయడానికి ప్రజలు అధికారం ఇస్తారు. ఎవరికేదైనా మినహాయింపు ఉంటుందంటే, ప్రజలకు మంచి పనులు చేసినందు వల్ల, మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేసినందువల్ల మనకు ఉంటుందనుకున్నాం. ఆ దిశలో మార్పు ఉంటుందని కూడా ఆశించాం. కానీ, మనకే పరిస్థితి ఆ రేంజ్‌లో రివర్స్ అయినప్పుడు, చంద్రబాబు మాదిరిగా మోసాలు చేస్తూ, అబద్దాలు చెబుతున్న వ్యక్తికి తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెబుతారు. కాలం చాలా వేగంగా తిరుగుతోంది. ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు. మామూలుగా ఐదేళ్లు అంటే, చివరి ఏడాది ఎలక్షనీరింగ్ కింద తీసేస్తే నాలుగేళ్లు ఉంటుందనుకోవచ్చు. నాలుగేళ్లలో దాదాపు రెండేళ్లు పూర్తయ్యాయి. కళ్లు మూసితెరిచే లోగా మరో రెండేళ్లు పూర్తవుతాయి. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. మామూలుగా రెండేళ్ల తర్వాత పరిపాలన ఎలా ఉందనేది చూస్తే ప్రజల్లో ఈ తరహా వ్యతిరేకత కనిపించేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మీద ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్న విషయమే. సంపద ఎవరికి సృష్టిస్తున్నారు?: ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు ఏం చెప్పి వచ్చాడు? వచ్చాక ఏం చేస్తున్నాడు? అనేది చూస్తే, ఈ మనిషి అప్పట్లో పదే పదే చెప్పిన మాటలు.. సంపద çసృష్టిస్తానని చెప్పడం. ఇంకా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాత్రమే కాదు, జగన్ చేసినవన్నీ కూడా చేస్తూ.. ఇంకా ఎక్కువే ఇస్తానన్నాడు. ఎన్నికలప్పుడు ప్రతి మీటింగ్‌లో అదే చెప్పాడు. కానీ, ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటని చూస్తే.. సంపద సృష్టించడం అంటే, కేవలం తనకు, తన మనుషులకే సంపద సృష్టించడం అని. అదే తేటతెల్లం అయింది. అసలు రాష్ట్రానికి సంపద సృష్టించడం దేవుడెరుగు.. స్కామ్‌లు చేస్తూ ఉన్న సంపద ఆవిరి చేస్తున్న పరిస్థితి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇస్తానన్న పెద్ద మనిషి వాటి సంగతి దేవుడెరుగు.. అంతకు ముందు మన ప్రభుత్వంలో అమలు చేసిన స్కీములు కూడా పూర్తిగా రదై్ద పోయి, సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అనేది ఎలా ఉండాలి?: ఒక ప్రభుత్వం నడుస్తూ ఉందంటే ఎవరైనా ఏమేం ఆశిస్తారు? ఆ ప్రభుత్వ కనీస బాధ్యతలు ఏవి అంటే.. ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యావ్యవస్థను ఇస్తుందని అనుకుంటాం. వైద్య పరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, ఒక మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని అనుకుంటాం. రైతుకు అండగా, దండగా ఉంటుందనుకుంటాం. అలాగే ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పని చేయాలని, అది కూడా ఎలాంటి వివక్ష లేకుండా కొనసాగాలని, అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. ఓట్లు వేసినప్పుడు ఎవరైనా ఇవన్నీ కోరుకుంటారు. కానీ ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్.. ఇలా ఏది తీసుకున్నా, కనపించేది తిరోగమనమే. ‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’..!: ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ విద్యార్థిని కదిలించినా, ఏ నిరుద్యోగిని కదలించినా, ఏ యువకుడిని కదిలించినా, ఏ మహిళను కదిలించినా చివరికి ఏ ప్రభుత్వ ఉద్యోగిని కదిలించినా కూడా ఈ ప్రభుత్వం గురించి వారు చెప్పేది ఏమిటో తెలుసా?.. ‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’ అని ప్రతి నోటా వినిపిస్తోంది. ఇది నిజంగా వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో 16 నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు గతంలో మనం ఎప్పుడూ చూసుండం. కానీ ఇప్పుడు కనిపిస్తోంది. ప«థకాలు మాయమైపోయాయి: ఈమధ్య ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు. అనంతపురంలో విజయోత్సవ సభ అని పెట్టబోతున్నప్పుడు ఆ ప్రకటన ఇచ్చాడు. సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అంటూ అనంతపురంలో విజయోత్సవ సభ అని ఒకటి ఈ మధ్యే చేశారు. అప్పుడు ఇలా ఈ మాదిరిగా వాళ్ల పాంప్లెట్ పేపర్‌లో అడ్వరై్టజ్‌మెంట్ ఇచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని హెడ్డింగ్ పెట్టారు. అప్పుడు మనం ఏమనుకుంటాం.. అందులో చెప్పినవన్నీ అమలు చేశామని అనుకుంటాం కదా?. కానీ ఆ అడ్వరై్టజ్‌మెంట్‌లో ఏముంది? అంతకు ముందు ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్‌లో ఏముందో చూడాలంటూ.. (ఆ రెండు అడ్వరై్టజ్‌మెంట్స్ పీపీటీలో చూపారు) రెండింటిలో తేడా చూస్తే.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంశాలు మారిపోయాయి. ఎన్నికలప్పడు యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. అది మొన్నటి అడ్వరై్టజ్‌మెంట్‌లో కనిపించలేదు. అలాగే ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. కానీ, తాజాగా ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్‌లో అవి కనిపించలేదు. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ కూడా కనిపించలేదు. ఏ స్థాయిలో వీరి మోసం ఉందంటే, వీరు చెప్పే అబద్ధాలు ఎలా ఉన్నాయంటే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 16 నెలల తర్వాత కూడా అమలు చేయకపోయినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చేసేశామంటూ.. వాటికి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్స్‌లోని అంశాలను మార్చివేశారు. బలవంతపు విజయోత్సవాలు జరిపించేసి.. అన్నీ చేసేశాం అంటూ గోబెల్స్ ప్రచారం చేశారు. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచ చరిత్రలో చాలా తక్కువగా ఉంటారేమో?.ఇంకా చెప్పాలంటే ఇలాంటోడు ప్రపంచ చరిత్రలో మరొకరు ఉండరు. ఇంటింటికీ బాండ్లు. సంతకాలతో ప్రతిజ్ఞలు: సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ అంటూ, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామని ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. అవి ఎలా ఉన్నాయంటే.. బాండ్లకు సంబంధించి ప్రతి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆడబిడ్డ నిధి కింద ఇంత, తల్లికి వందనం కింద ఇంత, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, యువగళం (నిరుద్యోగ భృతి) కింద నెలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.36 వేల చొప్పున.. ఆ కుటుంబానికి ఏటా ఎంత మొత్తం ఎంత మొత్తం ఇస్తామంటూ బాండ్లు ఇచ్చారు. ఇంకా సంతకాలతో పంపించిన ప్రతిజ్ఞా పత్రంలో ఏమన్నారంటే.. ‘చంద్రబాబునాయుడు అనే నేను అధికారంలోకి వచ్చాక, భవిష్యత్ గ్యారెంటీలోని హామీలను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని, ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2024, జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్‌లో జమ చేయబడుతుంది’.. అంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫోటోలు, వారి సంతకాలతో కూడిన ప్రతిజ్ఞా పత్రాలు ఇంటింటికీ పంపించారు. ఇంకా ఏకంగా చెక్కు రాసినట్టుగా రాసేయడం.. ‘ఇదిగో అమ్మ మీ ఇంట్లో ఇద్దరున్నారు. మీ ఇంట్లో ఒక చదువుకున్న పిల్లాడు ఉన్నాడు. వాడికి నిరుద్యోగ భృతి కింద ఏటా రూ.36 వేలు, మీ ఇంట్లో రైతు ఉన్నారు. ఆయనకు అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం‘ అని చెప్పారు. ఇంకా 2024లో టీడీపీ, జనసేన సంయుక్త కూటమి అధికారంలోకి రావడంతోనే మేమిద్దరం భవిష్యత్ గ్యారెంటీలోని వాగ్ధానాలను అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధి, పురోగతికి పరస్పర సహకారంతో సమన్వయంతో పని చేస్తామంటూ బాండ్లు ఇచ్చారు. కానీ.. వాస్తవంగా ఏం చేశారు?: అలా బాండ్లు, ప్రతిజ్ఞా పత్రాలతో ప్రజలను నమ్మించిన వారి మోసాలు అధికారంలోకి వచ్చాక ఏ స్ధాయిలో ఉన్నాయంటే, సూపర్ సిక్స్ సూపర్ సెవెన్‌లో ఉన్న హామీలు అమలు చేయలేదు. కొన్నింటిని ఏదైనా కొద్దో గొప్పో అమలు చేసినా, వాటిని కూడా అందరికీ ఇవ్వకుండా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎన్నికల్లో చెప్పినంత ఇవ్వలేదు. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. ఆ తర్వాత పీఎం కిసాన్‌తో కలిపే రూ.20 వేలు ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగుర కొట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఈ పెద్దమనిషి ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. రెండేళ్లకు కలిపి ఆరు సిలిండర్లకు ఇచ్చింది ఒక్కటే. అది కూడా కొందరికి మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. కానీ అది కొన్ని బస్సులకే పరిమితం చేశారు. మనం ఇచ్చిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. చివరికి 30 లక్షల మంది పిల్లలకు కట్ చేశారు. రూ.15 వేలు ఇస్తానన్నది కాస్తా రూ.13 వేలు చేశారు. అదీ పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి రూ.10 వేలు, ఇంకొందరికి రూ.9 వేలు, మరి కొందరికి రూ.8 వేలు మాత్రమే ఇచ్చారు. ఇలా ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తోంది. రైతులకు అంతులేని కష్టాలు: ఈ పెద్ద మనిషి హయాంలో అన్ని వ్యవస్థలూ నీరుగారిపోయిన పరిస్ధితి కనిపిస్తోంది. రైతులు ఎంత దారుణ పరిస్ధితుల్లో ఉన్నారంటే, ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. అయినా యూరియా దొరకని దుస్థితి. రైతన్నకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయిన పరిస్ధితి. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం కట్టలేదు. నేను అడుగుతా ఉన్నా. మనం ఉన్నప్పుడు గడిచిన ఐదేళ్లలో ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి రైతు చూశాడా?. యూరియా దొరక లేదని ఏనాడన్నా ఐదేళ్లలో ఒక్కసారైనా రైతు క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. యూరియా దొరక్క ఈరోజు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు ఉందంటే దళారీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపినందువల్లనే. దళారీలతో వీళ్లే చేతులు కలిపి ప్రైవేటుకి కోటా పెంచేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ఇక పనిలో పని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు వచ్చే సరుకును వీళ్ల కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టారు. ఇంకా ఆర్బీకేలు లేవు. ఈ–క్రాప్ లేదు. మరోవైపు ప్రైవేటుకి యూరియా కోటా పెంచేశారు. దాంతో మార్కెట్‌లో యూరియా లేదు. వాళ్లు బ్లాక్ చేసేశారు. రేట్లు పెంచేశారు. రూ.266 ఉండే యూరియా బస్తాకు మరో రూ.200 ఎక్కువ ఇస్తే తప్ప యూరియా దొరకని పరిస్థితిలో ఇప్పుడు రైతుల బతుకులు దిగజారిన పరిస్థితి కనిపిస్తోంది. అదే వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో..: మన ప్రభుత్వంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు రావడమే కాకుండా, రైతుకు ఆర్బీకేల ద్వారా, ఈ–క్రాప్ ద్వారా మద్దతు ధర కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. గరిష్ట చిల్లర ధర (ఎమ్మెస్పీ) కన్నా ఎక్కువ ఇచ్చాం. ఇంకా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్సఫోర్టేషన్) కింద అదనంగా ఎకరాకు దాదాపు రూ.10 వేలు ఇచ్చిన పరిస్థితులు మన ప్రభుత్వంలో కనిపించాయి. ఈ ధాన్యం ప్రజలు తినరట! అందుకే గిట్టుబాటు ధర రావడం లేదట!: కానీ, ఈరోజు చంద్రబాబునాయుడు వచ్చేసరికి పరిస్థితి మారింది. ధాన్యానికి ఎందుకు గిట్టుబాటు ధరలు దొరకడం లేదు అని అడిగితే, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడిగితే ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు అంటాడు రైతులు పండించిన ధాన్యం తినే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన ఇప్పుడు చెప్తాడు. ఈ ధాన్యమంతా కూడా ఇథనాల్ (లిక్కర్‌లో వినియోగించే) తయారు చేసే దానికి వాడతారని ఈయన అంటున్నాడు. అంటే దానర్థం ఏంటి. రాబోయే రోజుల్లో కూడా ధాన్యం సేకరణలో నా విధానం ఇదేనని చెబుతున్నట్టేగా. ధాన్యం పండించిన రైతుకి ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర రాదు. మీరంతా పండించడం మానేయండి అని చెబుతున్నాడు. పోనీ ధాన్యం పరిస్థితి గురించి ఇలా చెబుతున్నాడనే అనుకుందాం. ఆయనొచ్చాక రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర వచ్చింది చంద్రబాబూ అని అడుగుతూ ఉన్నా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నా. కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, టమాటో, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తోందా? అని అడుగుతున్నా. ఏ పంటకూ కనీస ధర రావడం లేదు. కారణం.. దగ్గరుండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేయడమే. నాడు రూ.7 వేల కోట్లతో కొనుగోలు: నాడు మన ప్రభుత్వం సీఎం–యాప్ ఏర్పాటు చేసి ఆర్‌బీకే స్థాయిలో మనం జాయింట్ కలెక్టర్లను, మార్క్‌ఫెడ్ జాయింట్ ఎండీకి ప్రోక్యూర్‌మెంట్ బాధ్యతలు అప్పగించి, ఆర్‌బీకేల్లో పోస్టర్లు పెట్టి ఫలాన పంటకు ఈ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. మన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా నిలిచాం. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేకపోవడంతో రాష్ట్రంలో ఏ పంటకు కూడా ఇవాళ గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొంది. అధ్వాన్నంగా విద్యా రంగం: విద్యా రంగంలో ఎలిమెంటరీ స్కూల్ పరిస్థితిని పక్కన పెడితే, నాడు–నేడు పనులు ఆగిపోయాయి, టోఫెల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నీరుగారిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లిష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావి అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతే ఆ త్రైమాసికానికి వెంటనే మన ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను మన ప్రభుత్వం గొప్పగా అమలు చేసింది. కూటమి పాలనలో త్రైమాసికానికి సంబంధించి ఫీజులు అందని పరిస్థితి నెలకొంది. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంతే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఫినిష్. అప్పటి నుంచి ఈ సెప్టెంబరు వరకు 7 క్వార్టర్స్‌కు సంబంధించి, ఒక్కో క్వార్టర్‌కు రూ.700 కోట్లు. ఇలా మొత్తం రూ.4900 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ, ఈ పెద్దమనిషి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. వసతి దీవెన బకాయిలు రూ.2200 కోట్లు: గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ వల్ల జగనన్న వసతి దీవెన ఆగిపోయింది. వసతి దీవెన కింద ఏటా రూ.1100 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అలా వసతిదీవెన కింద ఈ ప్రభుత్వం రూ.2200 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది సున్నా. ఈ ప్రభుత్వ వైఖరి వల్ల ఈరోజు పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి. చదువుకోవడానికి పిల్లలు ధైర్యం చేయడం లేదు. చదువుకున్న పిల్లలకు సర్టిఫికెట్లు అందడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను చేర్పించుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇదీ విద్యారంగం పరిస్థితి. వైద్య రంగం నిర్వీర్యం: ఆరోగ్యశ్రీలో మన ప్రభుత్వంలో రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆరోజు 3 వేలకు పైగా ప్రోసిజర్లకు వైద్యం ఉచితంగా అందించాం. ఈ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీకి గత 16 నెలలుగా బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నడపాలంటే ప్రతి నెల రూ.300 కోట్లు అవసరం. ఈ 16 నెలల్లో దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టారు. దాంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేశాయి. పేదవాడు వైద్యం కోసం ఈరోజు ప్రైవేట్ ఆçస్సత్రులకు వెళ్లలేని పరిస్థితి. ఆరోగ్య ఆసరా ఊసే లేదు: రోగికి చికిత్స తర్వాత విశ్రాతి సమయంలో, డాక్టర్లు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి మన ప్రభుత్వంలో గొప్ప సహాయంగా ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలల్లో అయ్యే ఖర్చు దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ పథకానికి ఇచ్చింది పెద్ద సున్నా. మెడికల్ కాలేజీల అమ్మకం అత్యంత హేయం: ఒకవైపు వైద్య ఆరోగ్య రంగం అన్ని విధాలుగా నిర్వీర్యం కాగా, మరోవైపు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టాడు. బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని ఆలోచన చేస్తాడా? అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎక్కడైనా మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వాలే ఎందుకు నడుపుతాయో అందరూ ఆలోచన చేయండి. గవర్నమెంట్ వాటిని నడపకపోతే నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో పేదలు తమ పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆస్పత్రులు లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందడం సాధ్యమేనా?. గవర్నమెంట్ గాని బస్సులు నడపకపోతే ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించగలరా?. అందుకోసమే దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్లు, ఆసుపత్రులు, బస్సులు నడుపుతున్నారు. అందుకే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం: ఆరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ టీచింగ్ కాలేజీని తీసుకువచ్చాం. అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చాం. ఈ టీచింగ్ కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ మెడికల్, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, వివిధ సేవలు చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటారు. అంత మంది అందుబాటులో ఉంటారు కాబట్టి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంది. అలాంటి గొప్ప విప్లవాన్ని మన ప్రభుత్వంలో తీసుకువచ్చాం. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. మన పిల్లలు చాలా మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి కూడా ప్రైవేట్‌తో పోలిస్తే తక్కువ రేటుకే సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఇది రెండో అడ్వంటేజ్. రాష్ట్రంలో ఇన్నిన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో డాక్టర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంటారు. ఇలాంటి కార్యక్రమానికి చంద్రబాబు స్కామ్‌ల కోసం ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేశాడు. ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం: రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. మరో రెండు కాలేజీలు పులివెందుల, పాడేరు చంద్రబాబు ప్రభుత్వ రాకముందే ప్రారంభోత్సవానికి అన్నీ సిద్ధం చేశాం. వాటికి కూడా అనుమతులు వచ్చాయి. దాదాపుగా 17 కాలేజీలను మనం మొదలుపెట్టి వాటిలో 7 కాలేజీలను పూర్తి చేయగలిగాం. ఇంకో రూ.5 వేల కోట్లు అంటే, ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలన్నీ పూర్తి అవుతాయి కదా?. కానీ చంద్రబాబుగారు అందుకు సిద్ధంగా లేరు. రూ.2 లక్షల కోట్లతో అమరావతికి ప్రణాళికలు!: అమరావతిలో ఈ పెద్ద మనిషి చేస్తున్నది ఏంటి? చంద్రబాబు ప్రాజెక్టు రిపోర్టు ప్రకారమే అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు కావాలంటున్నాడు. మొదటి దఫా 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ కోసం మాత్రమే ఖర్చు అవుతుంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో వీటి కోసమే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాడు. ఇంకా రూ.95 వేల కోట్లు ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారు? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇంకా 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. ఈ 50 వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు కావాలని చంద్రబాబు ఎస్టిమేషన్ వేశాడు. మరీ ఈ రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? చేతిలో డబ్బు లేదు కానీ అమరావతికి రూ. 2 లక్షల కోట్లతో ప్రణాళికలు రూపొందించాడు. మరి ఇంత మంది పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడానికి చంద్రబాబు దగ్గర డబ్బు లేదట!. చంద్రబాబు అసలు నీవు మనిషివేనా?. ఇదీ ఇవాళ రాష్ట్రంలో విద్యా, వైద్యం, వ్యవసాయం పరిస్థితి. ఇక లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అంతులేని అవినీతి. యథేచ్ఛ దోపిడి: కూటమి పాలనలో అవినీతి గురించి ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవినీతి లేనిది ఎక్కడో చెప్పాలి. మద్యం, ఇసుక, లాటరైట్, బాక్సైట్, క్వార్ట్›్జ, సిలికాన్, మట్టి దేన్నీ వదలడం లేదు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు. కుట్టుమిషన్ల నుంచి మొదలు పెడితే, ఎకరా భూమి 90 పైసలే. కరెంటు కొనుగోలుకు సంబంధించి మన ప్రభుత్వంలో రూ.2.40 చొప్పున యూనిట్ కొనుగోలు చేస్తే, వీళ్లు అదే యూనిట్ రూ.4.60కి కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏదీ చూసినా స్కామ్‌లే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ప్రభుత్వ ఖజానాకు రావడం లేదు. దారి మళ్లీ వీరి జేబుల్లోకి వెళ్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. మన హయాంలోలో ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఖజానాకు రూపాయి కూడా రావడం లేదు. ఇసుక రేటు మాత్రం మన హయాంలో కన్నా డబుల్ అయ్యింది. ఆ ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. జీఎస్టీ ఎందుకు తగ్గుతుందంటే.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గబట్టే కదా?. అందుకే ఇవాళ రాష్ట్ర ఆదాయం తగ్గి దివాళ తీస్తోంది. రూ.2 లక్షల కోట్ల అప్పులు: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. మనం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 57 శాతం అప్పు కేవలం 16 నెలల్లోనే చేశారు. కొత్తగా స్కీమ్‌లు లేవు, పాత స్కీమ్‌లన్నీ రద్దు చేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది. ఎవరి జేబుల్లోకి పోతోంది. అవినీతి ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్: చంద్రబాబు అనే వ్యక్తి తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ డైవర్షన్ చేస్తున్నాడు. ఒక ఇష్యూ ఏదైనా జరుగుతుందంటే చాలు.. ఆ ఇష్యూ పెద్దది అవుతుందంటే చాలు.. దాన్ని బ్రేక్ చేయడం, దాంట్లో నుంచి డైవర్ట్ చేయడం. ఆ టాపిక్ డైవర్ట్ చేసే క్రమంలో గుడులు, బడులు, రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి. రకరకాల మనుషులపై బురద జల్లే పరిస్థితులు కనిపిస్తాయి. మీరంతా గట్టిగా నిలబడాలి: ‘మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. సజావుగా ఎన్నికలు జరుపుకునే పరిస్థితి అంత కన్నా లేదు. సజావుగా ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావాలని ఆయనకు కూడా తెలుసు. ఈ పెద్ద మనిషి సజావుగా ఎన్నికలు జరపడం లేదు కాబట్టే మీరందరూ ఇంకా గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలే పార్టీకి బలం: మన పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అయ్యింది. బహుశా మనది యంగ్ పార్టీ. ఈ స్థాయిలో ఉన్న పార్టీ దేశంలో ఎక్కడ ఉండకపోవచ్చు. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీని నడిపించింది, పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలే. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోబట్టే మనం బలంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీ ఒక్కటే ఒకవైపు, మిగిలిన అన్ని పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయి. అయినా 40 శాతం ఓట్లతో గట్టిగా నిలబడ్డాం. ఆ స్థాయిలో మనం నిలబడగలిగామంటే దానికి కారణం కార్యకర్తలే. ఈ రోజు మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే. నేను ఈ గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తను, ఈ గ్రామంలో నేను మహిళా విభాగం అధ్యక్షురాలిని, ఈ గ్రామంలో నేను రైతు విభాగం అధ్యక్షుడిని, యువత అధ్యక్షుడిని, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిని, ఈ గ్రామంలో నేను అనుబంధ విభాగం అధ్యక్షుడిని అంటూ గ్రామ స్థాయిలో మన పార్టీని ఓన్ చేసుకొని ఆ బాధ్యతలను భుజ స్కందాలపై వేసుకొని వాళ్ల కమిటీలు వాళ్లే వేసుకుంటే ఆ తరువాత చంద్రబాబు నాయుడు కాదు కదా? వాళ్ల నాయన తలుచుకున్నా కూడా వైయస్‌ఆర్‌సీపీపై పోటీకి కూడా పనికి రాకుండా పోతాడు. అలాంటి గుర్తింపు ఇవ్వాలి. అనుబంధ విభాగాలు కీలకం: ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ థీమ్, స్ట్రచర్‌ను చూస్తే ఈ 16 నెలల్లోనే ఎంతో డెవలప్ చేశాం. రీజినల్ కో–ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి రెండు నియోజవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులను నియమించాం. నియోజకవర్గ ఇన్‌చార్జులు ఉన్నారు. వీరంతా కూడా డిస్ట్రీక్ట్ కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్నారు. వీరితో పాటు అనుబంధ విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అనుబంధ విభాగాలను జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాలకు, మండల స్థాయిలో అనుబంధ విభాగాల అ ధ్యక్షులు, వారికి సంబంధించిన కమిటీలు, గ్రామానికి సంబంధించి విలేజ్ కమిటీలతో పాటు ఏడు అనుబంధ విభాగాలను ఎంపిక చేసి బలోపేతం చేయాలి. వీరంతా కూడా ఎక్స్ అఫిషియో కింద గ్రామ కమిటీలో ఉంటారు. అలా కమిటీలు వేసుకున్న తరువాత వాళ్లను మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. వీరందరికీ ఐడీ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. ఎప్పుడైతే ఈ ఐడీ కార్డు వాళ్ల జేబుల్లోకి వెళ్తుందో.. వాళ్లందరి డేటా నా వద్ద ఉంటుంది. వాళ్లను సాక్ష్యాత్తు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు గుర్తిస్తున్నాడు. గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ గుర్తింపు ఎప్పుడైతే వస్తుందో ఈ రోజు గ్రామ స్థాయిలో పార్టీని లీడ్ చేసే వారే రేపు పొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్లను ముందుర పెట్టి.. వాళ్ల ద్వారా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాను. అందరికీ ఒకటే చెబుతున్నా. ముందు మీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలను వేయండి. తర్వాత మండల స్థాయిలో కమిటీలు వేయండి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. తర్వాత మండల స్థాయిలో అనుబంధ స్థాయి కమిటీల అధ్యక్షులను నియమించండి. వాళ్లు వాళ్ల కమిటీ సభ్యులను తీసుకుంటారు. వాళ్లను మీ పర్యవేక్షణలో గ్రామాలకు పంపించండి. ప్రతి గ్రామానికీ మీరు కూడా వెళ్లండి. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ గురించి వివరించండి. గ్రామస్థాయిలో కమిటీలు. ఏర్పాటుకు టార్గెట్: తర్వాత గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. ఆ గ్రామంలో ఎవరు రైతు అధ్యక్షుడు, ఎవరు మహిళా అధ్యక్షురాలు, ఎవరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు, ఎవరు సోషల్ మీడియా అధ్యక్షుడు. ఎవరు బీసీ అధ్యక్షుడు, ఎవరు ఎస్సీ అధ్యక్షుడు.. అనే పేర్లను ఎంపిక చేయండి. అనుబంధ సంఘాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులను ఎంపిక చేసుకోండి. సంక్రాంతి కల్లా పేర్లను ఎంట్రీ చేస్తే.. వారంతా మన డేటాలో రిజిస్టర్ అవుతారు. ప్రతి కార్యకర్తను ఆ రకంగా ఎంపవర్ చేయగలగాలి. ఆ స్థాయిలో మీరు బలపడ్డారంటే.. మీరు గ్రామంలోకి వెళ్లగానే యూత్ అధ్యక్షుడి పేరు చెబుతారు. స్టూడెంట్ అధ్యక్షుడి పేరు చెబుతారు.. బీసీ అధ్యక్షుడి పేరు చెబుతారు.. సోషల్ మీడియా అధ్యక్షుడి పేరు చెబుతారు, ఎస్సీ అధ్యక్షుడి పేరు, రైతు అధ్యక్షుడి పేరు చెబతారు, మహిళా అధ్యక్షురాలి పేరు చెబుతారు. అంటే ఆ గ్రామంలోకి ఎటరవుతానే మీరు ఏడుగురి పేర్లు టకటకా చెబుతారు. గ్రామ పార్టీ అధ్యక్షుడితో కలిపి 8 మంది పేర్లు మీరు టక టకా చెప్పగలుగుతారు. ఆ విధంగా మీరు ఆ 8 మంది పేర్లు టక టకా చెప్పగలిగారంటే.. మీరు ఎలక్షన్ ఇంజినీరింగ్ చేసినట్లే. ఇది మిమ్మల్ని ఎలక్షనీరింగ్ కు సన్నద్ధం చేయడం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఈ రైతు కమిటీలు, అనుబంధ కమిటీలు, యూత్, యూత్ కమిటీలు, మహిళా కమిటీలు, స్టూడెంట్స్ కమిటీలు, సోషల్ మీడియా కమిటీలు, బీసీ కమిటీలు, ఎస్సీ కమిటీలు చురుగ్గా పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్‌తో పార్టీ ఇచ్చే మెసేజ్‌తో ఏ కార్యక్రమాన్నైనా గ్రామంలో విస్త్తృతంగా చేపట్టగలుగుతారు. ఆర్గనైజేషన్ అంటే ఇది. ఇప్పటికైనా మీరొక టైం పెట్టుకోండి. డిసెంబర్ 15 కల్లా నాకు వారి పేర్లు ఇవ్వండి. దీనివల్ల మీరే విన్ అవుతారు. గ్రామాల్లోకి వెళ్లగలుగుతారు. ప్రతి గ్రామంలో పది మందిని పేరు పెట్టి మీరు పిలవగలుగుతారు. ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ మీ ఆధ్వర్యంలో నిలబడుతుంది. డిజిటల్ బుక్. ఆవిష్కరణ. లక్ష్యం: మన కార్యకర్తల కోసం ఒక కార్యక్రమం లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్తల కోసం మీ సమక్షంలో డిజిటల్ బుక్ ను ఈరోజు లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ఒకటి db.weysrcp.comలో ఫిర్యాదు చేయవచ్చు. అందుకోసం వెబ్‌సైట్ లోకి ఎంటరై మీ ఫోన్ నంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే లొకేషన్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వగానే, మీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసేందుకు సౌలభ్యం ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డాటా.. ఆ డిజిటల్ బుక్ లో స్టోర్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. రెండోది ఐవీఆర్ ఎస్ విధానం. ఒక ఫోన్ నెం: 040–49171718 అన్యాయానికి గురైన వైయస్సార్ సీపీ కార్యకర్తలు ఆ నెంబర్‌కు ఫోన్ చేసి డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. ఫోన్ చేసిన వారు తాము ఏ నియోజకవర్గం వారో చెప్పాలి. తర్వాత ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో.. వివరాలు చెప్పాలి. ఆ విధంగా ఆ నంబర్‌కు ఫోన్ చేయగానే దశలవారీగా సమాచారం తీసుకుంటారు. డిజిటల్ బుక్ ఒక శ్రీరామరక్ష: ఈ డిజిటల్ బుక్.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు శ్రీరామరక్ష. మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ డిజిటల్ బుక్‌లో ఎంటర్ చేసిన కేసుల మీద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం. అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయినా, రాష్ట్రంలో లేకపోయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసినవారికి శిక్ష పడేలా, ఈరోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగేలా అడుగులు దీని ద్వారా వేస్తాం. వాళ్లేదో రెడ్ బుక్ అంటున్నారు. రేపు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో వాళ్లందరికీ అర్థం కావాలి అన్న శ్రీ వైయస్ జగన్.. ఆ తర్వాత డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు.