తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ఇవాళ సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తోందని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తేల్చి చెప్పారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... హామీల అమల్లో వైఫల్యాల పై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక.. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏడాది కాలంలో ఏకంగా 282 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వీటన్నింటికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు పవిత్రమైన శాసనసభ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను భరత్ తీవ్రంగా ఖండించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు... కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలపై అనేక హామీలిచ్చిన కూటమి నేతలు.. వాటి అమల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల పై ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేని ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేస్తూ ప్రజల గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది కాలంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాదాపు 282 అక్రమ కేసులు, 822 మందికి నోటీసీలు జారీ చేయడంతో పాటు 86 మందిని అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర్యం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ స్ధానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గతంలో పచ్చి బూతులు మాట్లాడారు. గుంటూరులో సోషల్ మీడియా యాక్టివిస్టు తారక్ ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేశారు. వాక్ స్వాతంత్ర్యం హరించే విధంగా ఆయనపై నేరాలు, దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాపులు చేసే వారిపై నమోదు చేసే బీఎన్ ఎస్ 196, 353, 111 / 3,4,5, 143 ఆర్ / 61 / 2 సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. ఇవి ముమ్మాటికీ అక్రమ కేసులు. పూర్తిస్థాయి విచారణ చేయకుండా కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు మెట్టికాయలు వేసినా దాన్ని కూడా బేఖాతరు చేస్తూ.. అర్నష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్, సవీంద్రరెడ్డిపైనా అక్రమ కేసులు నమోదు చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన భరత్ చంద్ర అనే సోషల్ మీడియా యాక్టివిస్టును కూడా అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు ఆయన ఆచూకీ చెప్పాలని.. భరత్ చంద్ర సోదరి ప్రీతిని ఆత్మకూరు పోలీసులు పది రోజుల క్రితం నిర్బంధించారు. అంతటితో ఆగకుండా భరత్ తల్లి ఇతర కుటుంబసభ్యుల ఫోన్లను కూడా సీజ్ చేసి ఇబ్బంది పెట్టారు. ఇక రాజమండ్రిలో వర్షం వల్ల ముంపునకు గురైందని పోస్టు పెడితే... సోషల్ మీడియా యాక్టివిస్టు దళిత సామాజిక వర్గానికి చెందిన పులిసాగర్ ను స్టేషన్ కు తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతూ .. అర్ధనగ్నంగా సెల్ లో పెట్టారు. వాటిపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తే.. కలెక్టర్ ని, డీజీపీని వివరణ ఇమ్మని నోటీసులు ఇచ్చారు. దానికి అత్యంత దారుణంగా రెండు నెలల నుంచి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ..కూటమి పెద్దలు రాక్షసానందం పొందుతున్నారు. ● బాలకృష్ణది దిగజారుడు భాష: అసెంబ్లీ వేదికగా మా నాయకుడు వైయస్.జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. నిండు సభలో జేబులో చేతులు పెట్టుకుని సభామర్యాదలు పాటించకుండా మాట్లాడుతూ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు. సభలో బాలకృష్ణ ఉపయోగించిన భాష అభ్యంతకరం. మీ హావభావాలు, భాష చూస్తుంటే అసెంబ్లీలో వచ్చినప్పుడు కూడా మీకు బ్రీత్ ఎనలైజర్ పెట్టాలేమో అనిపించేలా ఉంది. ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. సాధారణంగా బాలకృష్ణ మాట్లాడే విధానం, ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట తీరుకు మధ్య తేడాచూస్తే మీకే అర్ధం అవుతుంది. ● లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం - కార్యకర్తల్లా పోలీసులు.. రెడ్ బుక్ పేరుతో గతంలో లోకేష్ చెప్పినదాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునిస్తే.. వైయస్ఆర్‌సీపీలో చురుగ్గా పనిచేస్తున్న 10 మంది క్రియాశీలక కార్యకర్తల ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్లి పార్టీలో చురుగ్గా ఉన్నారు జాగ్రత్త అని కుటుంబ సభ్యులను హెచ్చరిస్తున్నారు. పోలీసులను ఈ రకంగా తెలుగుదేశం పార్టీ రక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. పది రోజుల క్రితం రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ కు చెందిన రౌడీషీటర్లు పోలీసులను కొట్టిన వీడియో హల్ చల్ చేసింది. ఇంత దారుణంగా రాష్ట్రంలో రౌడీయిజం పేట్రోగిపోతుంది. వీళ్లంతా అధికార పార్టీకి చెందినవాళ్లే. తిరుపతికి చెందిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అమరావతి ముంపునకు గురవుతుందని.. ఫేస్ బుక్ లో షేర్ చేస్తే.. ఆయన్ను సస్పెండ్ చేశారు. నిజంగా వరదతో ముంపునకు గురైంది కాబట్టే.. ఆయన పోస్ట్ చేశారు. ఇటీవల జంగారెడ్డి గూడెంలో కుసుమ కుమారి అనే మహిళా కండక్టర్ ... పల్లె వెలుగు బస్సులో ఫ్రీ బస్సు వల్ల 150 మందికి పైగా జనాలతో అత్యంత రద్దీగా ఉంది.. ఊపిరి కూడా ఆడడం లేదు, విధి నిర్వహణ కష్టంగా ఉందని సోషల్ మీడియాలో చెబితే ఆమెను విధుల నుంచి తప్పించారు. ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశా? తాలిబాన్ రాజ్యమా ? ఇంత అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడుతున్నారు. ● మీ అక్రమాలకు మూల్యం చెల్లించక తప్పదు... ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను నేరుగా సైకో అని అత్యంత సంస్కార హీనంగా మాట్లాడాడు. ఆ రోజు లోకేష్ పై మేం ఎన్ని కేసులు పెట్టాలి? కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఇప్పటికే డిజిటల్ బుక్ లాంఛ్ చేశాం. మేం ఎవ్వరిపైనా కక్ష సాధింపు చర్యలు చేయబోము. అన్యాయానికి గురైన మా కార్యకర్తలు, పార్టీ నేతలు వివరాలు డాక్యుమెంట్ చేసి, డిజిటల్ బుక్ లో అప్ లోడ్ చేస్తాం. ఎన్ని లక్షల కేసులు ఉన్నా.. వాటన్నింటినీ స్క్రూటినీ చేస్తాం. రాబోయే రోజుల్లో జగనన్న 2.0 వచ్చిన తర్వాత వీటన్నింటికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు తగిన మూల్యం చెల్లించకతప్పదని మార్గాని భరత్ హెచ్చరించారు.