తాడేపల్లి: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా దళితులంటే చంద్రబాబుకి ఇప్పటికీ చిన్నచూపేనని, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినా దళితుల పట్ల ఆయన ఆలోచనలో మార్పు రావడం లేదని వైయస్ఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. మాజీ సీఎం వైయస్ జగన్ రాజధాని అమరావతిలో దళితులకు ఇళ్ల పట్టాలిచ్చి గౌరవిస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని ఊడపెరికేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కవికోకిల గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ విద్య ద్వారా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావాలని తపించే తండ్రీ కొడుకులు వైయస్సార్, వైయస్ జగన్ చదువుల విప్లవాన్ని సృష్టిస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రంగాన్ని నిర్వీర్యం చేశాడని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి నిధులు కేటాయించకుండా వేధిస్తున్నాడని, నాడు- నేడు ద్వారా ప్రభుత్వ బడులను ఆధునీకరిస్తే పెండింగ్ పనులను చంద్రబాబు మూలన పడేశాడని చెప్పారు. మెడిసిన్ చదివి డాక్టర్ కావాలన్న వెనుక బడిన పేద విద్యార్థుల కలను చిదిమేసేలా వైయస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే... చదువుల విప్లవాన్ని నిర్వీర్యం చేశారు: ఎమ్మెల్సీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి గుర్రం జాషువా భౌతికంగా మన మధ్య లేకపోయినా తన రచనలతో సమాజాన్ని నిత్యం తట్టిలేపుతూనే ఉంటారు. సమాజంలో మానవ హక్కుల అణచివేతపై గళమెత్తిన ఉద్యమకారుడు గుర్రం జాషువా. స్వేచ్ఛ, సమానత్వం ఉన్నప్పుడు సమాజపురోభివృద్ధి సాధిస్తుందని నమ్మిన సామాజికవేత్త. గుర్రం జాషువా మాదిరిగానే నాటి దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ కూడా ఆలోచించి చదవుల ద్వారా సమాజంలో వెనుకబాటుతనాన్ని పారదోలవచ్చని నమ్మారు. అందుకే పేద, వెనుకబడిన వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఉన్నత చదువులు చదివించారు. ఆయన స్ఫూర్తిని మన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరింత ముందుకు తీసుకెళ్లారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా రాజకీయాలు చేయకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి దళితులకు వెన్నుదన్నుగా నిలిచారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నేతృత్వంలో నియంత పాలన సాగిస్తున్నారు. రెడ్ బుక్ పేరుతో వెనుకబడిన వర్గాల మీద దాడులకు తెగబడుతున్నారు. తండ్రీకొడుకులు వైయస్సార్, వైయస్ జగన్ లు తీసుకొచ్చిన చదువుల విప్లవాన్ని చంద్రబాబు నాశనం చేశాడు. పేదల కోసం మాజీ సీఎం వైయస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల ఆశలను చిదివేశాడు. ప్రశ్నించే గొంతులను పోలీసులను ఉపయోగించి అక్రమ కేసులు బనాయించి అణచివేస్తున్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, పోర్టులు, రోడ్లు, ఆలయ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఎవరెన్ని నిర్బంధాలకు గురిచేసినా వేధించినా వైయస్ జగన్ నాయకత్వంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా వైయస్ఆర్‌సీపీపోరాడుతుంది. వందల మంది గుర్రం జాషువాలు మళ్లీ పుట్టాలి: ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గబ్బిలం, పిరదౌసి వంటి రచనలతో సమాజాన్ని మేల్కొల్పి కుల మత తారతమ్యాలను రూపుమాపేందుకు కృషి చేసిన గొప్ప సామాజికవేత్త గుర్రం జాషువా. దశాబ్దాల కిందటే వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడిన ధీశాలి. ఎన్నో ఏళ్ల కిందటే నిలువ నీడ కోసం సెంటు స్థలం కావాలని తన రచనల ద్వారా వెనుకబడిన కులాల కోసం గుర్రం జాషువా నినదిస్తే, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం అమరావతి రాజధానిలో దళితులకు స్ధానం లేదని తరిమేశాడు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేటాయించిన 54 వేల ఇళ్ల పట్టాలను రద్దు చేసి ఆ స్థలాల నుంచి ఎస్సీలను గెంటేశాడు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బహిరంగంగా మాట్లాడిన నీచుడు చంద్రబాబు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, యావత్ తెలుగుదేశం పార్టీ మొత్తం దళితులకు వ్యతిరేకం. చంద్రబాబుని మించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని అవమానించాడు. దళితులు.. మీకెందుకురా రాజకీయాలు అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హేళన చేశాడు. ఇలాంటి నీచమైన చంద్రబాబు నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీని తరిమేయాలంటే వందల మంది గుర్రం జాషువాలు మళ్లీ పుట్టాలి. వైయస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే దళితులకు ఆత్మగౌరవంతో బతికే స్వేచ్ఛ లభిస్తుంది. వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో దళితులకు (మాల, మాదిగ, రెల్లి, పైడి కులస్తులకు) ఏకంగా రూ.69,848 వేల కోట్ల మేర వివిధ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూర్చాడు. సగటున ఏడాదికి దాదాపు రూ. 14వేల కోట్లు లబ్ధి చేకూర్చితే, 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక దళితులను పూర్తిగా వంచించారు. వైయస్ జగన్ హయాంలో అందిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు. వైయస్ జగన్ సీఎం అయితేనే దళితులకు మళ్లీ మేలు జరుగుతుంది. అందుకోసం కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు, లాఠీ దెబ్బలకు వెరసి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రేపు (30వ తేదీ మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా నిరసన: షెడ్యూల్డ్ కులాలకు విద్య, వైద్య రంగాలను దూరం చేసే కుట్ర జరుగుతోంది. ఇప్పటికే నాడు-నేడు పేరుతో మాజీ సీఎం వైయస్ జగన్ స్కూళ్లను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దితే చంద్రబాబు సీఎం అయ్యాక పెండింగ్ పనులను పక్కన పడేశాడు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేశాడు. ఈ నేపథ్యంలో షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా విద్య, వైద్య రంగాల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 30వ తేదీన వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధాన కూడళ్లలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం. వెనుబడిన కులాలను కూటమి ప్రభుత్వం అణచివేస్తోంది: వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు ఆధునిక తెలుగు కవుల్లో అగ్రగణ్యుడు గుర్రం జాషువా. ఏ కులంతో తాను అవమానాలకు గుర్రయ్యాడో అదే కులం రక్కసి మీద తన రచనలతో నిప్పులు కురిపించిన గొప్ప రచయిత గుర్రం జాషువా. కలం అనే కొరడాతో సమాజంలోని అసమానతలు తరమికొట్టాడు. తన కవిత్వం ద్వారా వెనకడుగు వర్గాలు పడుతున్న కష్టాలను సమాజానికి అర్థవంతంగా వెలుగెత్తి చాటారు. గుర్రం జాషువా రాసిన పిరదౌసి కవిత్వంలో రాజు ఎలాగైతే కవులను మోసం చేశాడో నేడు ప్రజలను చంద్రబాబు అదే విధంగా తన మోసపు హామీలతో వంచించాడు. వెనుకబడిన కులాలు ఆత్మగౌరవంతో బతకాలన్న గుర్రం జాషువా స్పూర్తిని తన ఐదేళ్ల పరిపాలనతో వైయస్ జగన్ చక్కగా చూపిస్తే, కూటమి ప్రభుత్వంలో దళితులు సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో అణచివేతకు గురవుతున్నారు.