విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని సిగ్గులేకుండా సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడారని వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... గత పదహారు నెలలుగా రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం చీకటి రోజులను చూస్తోందని, కమీషన్లు, కాంట్రాక్ట్‌ల పేరుతో నిత్యం కూటమి పార్టీల నేతల వేధింపులతో అతలాకుతలం అవుతోందని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో జరుపుతున్న అరాచక పాలన చూసి ఏపీ వైపు ఒక్క పారిశ్రామికవేత్త కూడా వచ్చేందుకు సిద్దంగా లేని దారుణమైన పరిస్థితిని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైయస్ఆర్‌సీపీ పాలనలో అనేక మంది పారిశ్రామికవేత్తలతో సీఎం వైయస్ జగన్ చేసుకున్న ఒప్పందాలను, తీసుకువచ్చిన పరిశ్రమలను తమ ఘనతగా చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అసత్యాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పడంలో దిట్ట. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఎలా ఉందంటే...అట్టర్ ఫ్లాప్ సినిమాకు వందరోజుల పండుగ చేసుకున్నట్లుగా ఉంది. హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత మొక్కుబడిగా వాటిని అమలు చేసి చేతులు దులుపుకుని, దానినే తమ ఘనతగా చాటుకునేందుకు చంద్రబాబు తెగబడ్డారు. సూపర్ సిక్స్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు. నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి పథకాల కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? పీ-4 అంటూ ఎవరికీ అర్థంకాని మాటలు మాట్లాడుతున్నారు. గత ఏడాది అన్ని పథకాలను అమలు చేయలేదు. ఈ ఏడాది కొన్ని పథకాలను అరకొరగా ప్రారంభించి, మొత్తం చేసేశామంటూ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. వీటన్నింటి మీద వైయస్ఆర్‌సీపీ వాస్తవాలను ప్రజల ముందు పెట్టింది. నియంత పాలనను చూసి పరిశ్రమలు భయపడుతున్నాయి రాష్ట్రంలో ప్రారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు చెప్పుకున్నారు. గత పదహారు నెలలుగా ఈ రాష్ట్రంలో దేనిలో ప్రగతిని సాధించిందంటే, లేని దానిని చేసుకున్నట్లుగా ప్రచారం చేసుకోవడంలో. మా హయాంలో జరిగిన వాటిని తమ ఘనతగా చెప్పుకోవడం, మేం చేసిన ఎంఓయులను తామే చేసుకున్నట్లుగా ప్రచారం చేసుకోవడం, ఎల్లో మీడియాలో దానిపై పబ్లిసిటీ చేయడం, వారానికి ఒక సారి విశాఖకు వచ్చి, సమావేశాలు పెట్టి తమ గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి గిమ్మిక్కులతో ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారు? రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం, శాంతిభద్రతలు పటిష్టంగా ఉండటం, మంచి పాలనను అందిస్తుంటేనే ఏ పారిశ్రామికవేత్తలైనా రాష్ట్రానికి వస్తారు. గత పదహారు నెలలుగా రాష్ట్రంలోని కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కమీషన్లు, కాంట్రాక్ట్‌లు, వాటాలు ఇవ్వాలంటూ రౌడీయిజం చేస్తూ పారిశ్రామిక సంస్థలను వేధిస్తుంటే, వారు రాష్ట్రం విడిచి పారిపోతున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఒక నియంత పాలనను సాగిస్తున్నారు. శాంతిభద్రతలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్త ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెడతారు. ఈ వేధింపులపై ఏం చర్యలు తీసుకున్నారు? గత ప్రభుత్వంలో మాపైన నిత్యం తప్పుడు ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కడప స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు వచ్చిన జెఎస్‌డబ్ల్యు సంస్థను జత్వానీ అనే నటిని అడ్డం పెట్టుకుని ఆ సంస్థ నిర్వాహకుడు జిందాల్‌పై ఆరోపణలు చేసి, వేధింపులకు పాల్పడ్డారు. చివరికి ఆయన ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు. జమ్మలమడుగులో సిమెంట్ ఫ్యాక్టరీలకు రామెటీరియల్ సప్లై కాంట్రాక్ట్‌లను తనకు ఇవ్వకపోతే, ఆ ప్లాంట్‌లను నడవనివ్వనూ అని బిజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎలా రౌడీయిజం చేశారో ప్రజలంతా చూశారు. అలాగే కర్నూలులోని అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థను మంత్రిగా ఉన్న బిసి జనార్థన్‌రెడ్డి, తాడిపర్తికి చెందిన జేసీ బ్రదర్స్ లారీకి రూ.250 మామూలు ఇస్తే తప్ప రా మెటీరియల్ సప్లై చేయడానికి వీలులేదని ఎంత వివాదం సృష్టించారో అందరికీ తెలుసు. జమ్మలమడుగులో ఆదానీకి చెందిన స్టీల్‌ప్లాంట్‌కు ఫ్లైయాష్ తోలకంపై ఆదినారాయణరెడ్డి, జేసీ బ్రదర్స్‌కు మద్య జరిగిన గొడవలు, సాక్షాత్తు సీఎం చంద్రబాబు వారిద్దరి మద్య పంచాయతీ చేశారు. కృష్ణపట్నం పోర్ట్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్‌పై దౌర్జన్యం చేసి, ఆదానీపోర్ట్ నుంచి తమకు కమీషన్లు ఇవ్వాలని బెదిరించారు. రామాయపట్నం పోర్ట్‌ను నిర్మిస్తున్న సంస్థలో తనకు వాటాలు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే బెదిరించారు. యూరోప్‌కు చెందిన ప్రముఖ సంస్థకు చెందిన సిమెంట్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న గోవిందప్ప బాలాజీని తప్పుడు కేసులో ఇరికించి, జైలుకు పంపారు. ఉత్తరాంధ్రలో యూబీ ఫ్యాక్టరీ నుంచి నెలకు కోటిన్నర రూపాయలు మామూలు ఇస్తే తప్ప దానిని నడపడానికి వీలులేదని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేయలేదా? కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఇది పాలనలా లేదు, వ్యాపారంలా ఉంది. పల్నాడులో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్కడి సిమెంట్ ఫ్యాక్టరీలను వేధించి, మామూళ్ళు ఇవ్వాలంటూ బెదిరించారు. దాల్మియా సిమెంట్ సంస్థను ఇలాగే వేధించారు. ఇన్ని వేధింపులకు పాల్పడుతూ, తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పుకోవడానికి సిగ్గులేదా? భూకేటాయింపుల్లో భారీ అవినీతి దందా సాక్షాత్తూ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులే దౌర్జన్యకారులుగా మారి, పారిశ్రామికవేత్తలను వేధిస్తుంటే, ఒక్కరిపైన అయినా కేసు పెట్టారా? పరిశ్రమలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకున్నారా? వాస్తవాలను కప్పిపుచ్చుతూ, పబ్లిసిటీ స్టంట్‌లతో పారిశ్రామిక విధానంలో తాము గొప్పగా చేసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ 2022 సెప్టెంబర్, 22న అప్పటి సీఎం వైయస్ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా ఐటీ సేవలను కొనసాగించేందుకు రావాలని ఆహ్వానించారు. తరువాత ముంబైకి వెళ్ళి పరిశ్రమలశాఖ మంత్రిగా ఆయనను కలిసాం. ఇటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు రాష్ట్రానికి వచ్చే సందర్భంలో ఇన్సెంటీవ్‌లను కోరతాయి, వాటికి సహేతుకంగా ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇటువంటి కంపెనీల పేరును అడ్డం పెట్టుకుని ఊరుపేరు లేని ఉర్సా క్లస్టర్ అనే సంస్థకు అత్యంత విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టేందుకు తెగబడ్డారు. సెప్టెంబర్ 2024లో మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో ఈ ఉర్సా అనే కంపెనీయే లేదు. ఫిబ్రవరి 2025లో ఈ కంపెనీని ప్రారంభిస్తే, రెండునెలల్లో అంటే ఏప్రిలో లో ఆ కంపెనీకి దాదాపు రూ.2000 కోట్ల విలువైన భూమిని ఎకరం రూ.50 లక్షల చొప్పున ఇచ్చేశారు. ఇదేనా ఐటీ రంగంలో మీరు తీసుకువస్తున్న ప్రగతి. ఒక పెద్ద కంపెనీని ముందు పెట్టడం, దాని వెనుక ఇలాంటి బినామీ, డొల్ల సంస్థలను ఉంచి, వాటికి వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఇచ్చేస్తున్నారు. అలాగే అనేక దేశాల్లో బ్రాంచీలను మూసుకుంటున్న లూలు కంపెనీకి కూడా వేల కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు. రూ.2వేల కోట్ల విలువైన భూములను ఇస్తే, దానిలో రూ.500 కోట్లు ఎవరైనా పెట్టబడి పెట్టరా? దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే సత్వా, కపిల్ అనే సంస్థలకు కూడా భూకేటాయింపులు చేశారు. ఈ సంస్థలు బెంగుళూరు, హైదరాబాద్, పూనే, చెన్నై వంటి నగరాల్లో ఐటీ సంస్థల ఏర్పాటు కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వేలంలో ఈ సంస్థ పాల్గొని భూములను కొనుగోలు చేస్తుంది. అటువంటి సంస్థను ఐటీ సంస్థగా చూపి, భూములను కేటాయించారు. ఇతర రాష్ట్రాల్లో వేలంలో భూములు కొంటారు, ఏపీలో మాత్రం ప్రభుత్వం కారుచౌకగా భూములను ఇచ్చేస్తున్నారు. ఇండస్ట్రీయల్ పార్క్‌లను కూడా ప్రైవేటీకరిస్తున్నారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇండస్ట్రీయల్ పార్క్‌లను ప్రైవేటీకరణ చేసేందుకు కొత్త ప్రతిపాదనలతో సిద్దమవుతున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడులతో అచ్యుతాపురంలో దాదాపు 1200 ఎకరాల్లో పెట్టేందుకు సిద్దమైతే, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అంగీకరించి, ఎంఓయు చేసుకుంది. ఈ హబ్‌కు అన్ని అనుమతులు ఇచ్చి, కేబినెట్‌లో అప్రూవల్స్ ఇచ్చాం. అలాగే డిసెంబర్ 2020లో వచ్చిన టైర్ల కంపెనీ, శ్రీసిటీలో డైకన్ కంపెనీ, బ్లూస్టార్, ప్యానసోనిక్ తదితర ఏసీ కంపెనీలకు మా ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చాం. ఏసీ మేనిఫేస్టింగ్ హబ్‌గా శ్రీసిటిని తీర్చిదిద్దేందుకు కృషి చేశాం. ఇవ్వన్నీ కూడా మేమే చేశామని చెప్పుకునేందుకు సిగ్గులేదా? మూడు పోర్ట్‌లు, ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్, పది ఫిషింగ్ హార్బర్లు, పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నాడు-నేడు కింద విద్యా, వైద్యరంగాల్లో ఆధునిక వసతులు ఇలా అనేక కార్యక్రమాలను మేం చేశాం. పరిశ్రమలను తీసుకురావడం, ఎంఓయులు కుదుర్చుకోవడం, ప్రోత్సాహకాలను ఇవ్వడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాం. వైయస్ జగన్ చేసిన కార్యక్రమాలను తాము చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు స్పందించాలి తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చిరంజీవికి సీఎంగా వైయస్ జగన్ గారు గౌరవం ఇవ్వలేదంటూ నందమూరి బాలకృష్ణ అభ్యంతరకరమైన భాషతో మాట్లాడారు. చివరికి వాస్తవాలను చిరంజీవి గారే పత్రికా ప్రకటన విడుదల చేయడంతో విమర్శించిన వారి నోళ్ళు మూతపడ్డాయి. తప్పుడు ఆరోపణలు చేసిన వారి మనస్తత్వం ప్రజలకు అర్థమయ్యింది. తన సినిమా కోసం బాలకృష్ణ సీఎంగా ఉన్న వైయస్ జగన్‌ను కలుస్తామని అడిగితే, ఆయన రాకుండానే వెంటనే ఆయన సినిమాకు టిక్కెట్ రేటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇలాంటి మంచి మనస్సున వైయస్ జగన్ గారిని ఉద్దేశించి బాలకృష్ణ తప్పుడు కూతలు కూశారు. సినీ పరిశ్రమలో అందరూ గౌరవించే చిరంజీవి గురించి ఇష్టం వచ్చినట్లు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున అభిమానుల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అందరూ దీనిని ఆక్షేపించారు. కానీ దురదృష్టం ఏమిటీ అంటే చిరంజీవి సొంత సోదరులు పవన్, నాగేంద్రబాబులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించలేకపోయారు. చిరంజీవి అభిమానులు కూడా దీనిని గమనిస్తున్నారు.