కర్నూలు: గిట్టుబాటు ధర కల్పించి ఉల్లి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్ఆర్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతుల పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, గిట్టుబాటు ధర లేక రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను పారబోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పరి మండలం యాటకల్లు గ్రామంలో ఉల్లి పండించిన రైతు శేఖర్ గిట్టుబాటు ధర లేక పారబోయడంతో బుధవారం శేఖర్‌ను ఎమ్మెల్యే పరామర్శించి, పారబోసిన పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. ఉల్లికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రవాణా, కూలీ ఖర్చులు కూడా రావని మనస్తాపంతో రైతు శేఖర్ తన పంటను పారబోయడం బాధాకరమన్నారు. రైతులు పడుతున్న కష్టాలపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఉల్లి కి రూ.1200 గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినా, ఏ ఒక్క రైతు వద్ద కూడా ఉల్లిని రూ.1200 కొనుగోలు చేయలేదన్నారు. హెక్టార్‌కు రూ.50 వేలు పరిహారం ప్రకటించారని, అది ఏమాత్రం సరిపోదని చెప్పారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.