అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీసారి న‌న్ను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు 

జైలులో నన్ను టెర్రరిస్టుల ట్రీట్‌ చేశారు 

ఎంపీ మిథున్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తనకు అండగా నిలిచిన వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎంపీ ధన్యవాదాలు

తిరుపతి: టీడీపీ ప్రభుత్వం త‌న‌పై న‌మోదు చేస్తున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి(MP Mithun Reddy) స్ప‌ష్టం చేశారు.  టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న ప్ర‌తీసారి త‌న‌ను ఇబ్బందులు పెడుతూనే ఉంద‌ని, తాజాగా జైలులో తనను టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్‌ చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు(YS Jagan) ధన్యవాదాలు తెలిపారు. బుధ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి  తిరుపతిలో(Tirupati) మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ కేసులతో నేను అధైర్యపడను. టీడీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టింది. వేధించడానికే నాపై కేసులు పెట్టారు. ఇలా అక్రమ కేసులు పెట్టి సాధించింది ఏంటి?.. పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదు. నన్ను అరెస్ట్ చేసి నా తల్లిదండ్రులను మానసిన వేదనకు గురి చేశారు. 73 రోజులు.. దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు. గౌరవ కోర్టు నాకు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ ఆర్డర్‌లో కోర్టు చెప్పినవన్నీ నిజాలే. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. చివరిగా ఒకటే చెబుతున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టీ డైవర్షన్ చేస్తున్నారు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

న్యాయస్థానం బెయిల్ సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు నూటికి నూరుశాతం వాస్తవం. వాటిని చదివితే ప్రజలకు నాపై నమోదైన కేసుకు సంబంధించిన నిజాలు అర్థమవుతాయి. కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం నాపైన పెట్టిన కేసుకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లడలేకపోతున్నాను. అయితే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా, భయపడేది లేదు. అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్దం. ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇదే తరహాలో కేసులతో వేధించడం వారికి మామూలే. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాతో పాటు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, బియ్యపు మధుసూధన్‌ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. నేను ఇంజనీరింగ్ చదివే సమయంలో నాపైన మొట్టమొదట కేసు పెట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. తాజాగా లేని లిక్కర్ స్కాంలో జైలుకు పంపినా కూడా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌ గారితో పాటు పార్టీ శ్రేణులు నాకు అండగా నిలిచారు. నాపైన పెట్టిన కేసు ద్వారా కూటమి నేతలు ఒక పైశాచిక ఆనందం పొందడం తప్ప వారు సాధించింది ఏమీ లేదు. నా తల్లిదండ్రులను క్షోభపెట్టడం తప్ప వారికి ఒరిగింది ఏమీ లేదు. ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, మరింత గట్టిగా ప్రజల్లోకి వెలతాం. ప్రభుత్వ అసమర్థత బయటపడుతున్న ప్రతి సందర్భంలోనూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. దానిలో భాగంగానే సంబంధం లేని అంశాలను అంటగడుతూ తప్పుడు కేసులు బనాయించి, ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు.

జైలులో సీసీ కెమేరాలతో ప్రతిక్షణం నిఘా

ఒక తీవ్రవాదిని చూసినట్లుగా జైలులో నా పట్ల వ్యవహరించారు. నన్ను ఉంచిన బ్లాక్‌లో మరో వ్యక్తి లేకుండా చూశారు. కేవలం ములాఖాత్‌ల సమయంలో, లేదా ఇంటికి మూడు ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం తప్ప మరొకటి లేకుండా చేశారు. అంతేకాదు మొత్తం నా కదలికలపై ఇరవై నాలుగు గంటలు పరిశీలించేందుకు నిఘా కోసం సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమేరా ఫుటేజీని ఎవరు చూస్తున్నారో తెలియదు. విజయవాడలో కూర్చుని కూడా ఆ ఫుటేజీని చూసే అవకాశం ఉందని తెలుసు. జైలు అధికారులు సైతం నాతో మాట్లాడేందుకు భయపడ్డారు. వసతుల విషయంలో కోర్ట్‌ ఆదేశాలు ఇచ్చే వరకు ఏ వసతీ కల్పించలేదు. జైలు అధికారులపై ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. అందుకే వారు కూడా నిబంధనల ప్రకారం ఖైదీలకు ఇచ్చే వసతులను కూడా ఇవ్వలేదు.

Back to Top