అమరావతి: శాంతి భద్రతల పరిరక్షణలో వైయస్ఆర్‌సీపీపీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందన్న వాస్తవం మరోసారి నిగ్గు తేలింది. గత ప్రభుత్వంపై నాడు టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్రేనన్నది స్పష్టమైంది. 2023లో వైయస్ఆర్‌సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2023 నివేదికను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో వెల్లడించింది. 2022తో పోలుస్తూ 2023లో దేశంలో నేరాల తీరు ఎలా ఉందన్నది విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల నేరాలను వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లు ఆ నివేదిక వెల్లడించడం విశేషం. దాడులు, హత్యలు, కిడ్నాప్‌లు, ఎస్సీ–ఎస్టీలపై నేరాలు, మహిళలు–బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు.. ఇలా అన్ని రకాల నేరాలు 2022తో పోలిస్తే 2023లో గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. ⇒ 2022లో ఏపీలో మొత్తంగా 1,95,284 కేసులు నమోదు కాగా.. 2023లో 1,84,293కు తగ్గింది. నేరపూరిత కేసులు నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు 2022లో 1,58,547 నమోదు కాగా 2023లో ఆ కేసుల సంఖ్య 1,53,867కు తగ్గాయి. స్థానికచట్టాల ఎస్‌ఎల్‌ఎల్ కేసులు 2022లో 36,737 నమోదు కాగా.. 2023లో ఆ కేసుల సంఖ్య 30,436కు పరిమితమయ్యాయి. ⇒ దేశంలో 2022లో మొత్తం 58,24,946 నేరాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు 35,61,379 ఉండగా ఎస్‌ఎల్‌ఎల్ నేరాలు 22,63,567 ఉన్నాయి. 2023లో దేశంలో మొత్తం నేరాలు 62,41,569కు పెరిగాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు 37,63,102 ఉండగా, ఎస్‌ఎల్‌ఎల్ నేరాలు 24,78,467 ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా నేరాలు పెరిగినా ఏపీæలో మాత్రం అప్పటి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం నేరాలను కట్టడి చేసిందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. ⇒ 2024 ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ అసత్య ప్రచారమేని ఆ నివేదిక గణాంకాల సాక్షిగా వెల్లడైంది. ప్రధానంగా 34వేల మంది మహిళలు, బాలికలు కిడ్నాప్ అయ్యారని జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గతంలో చేసిన విమర్శలన్నీ పూర్తిగా అవాస్తవమేనని కేంద్ర హోంశాఖ నివేదిక విస్పష్టంగా ప్రకటించింది. నేరాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుని సత్వరం శిక్షలు పడేలా చేయడంలో కూడా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందని నివేదిక వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక–2023లో ఏపీకి సంబంధించి కీలక అంశాలివీ తగ్గిన నేరాలు–ఘోరాలు వైయస్ఆర్‌సీపీ హయాంలో 2022లో కంటే 2023లో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు, ఘోరాలు గణనీయంగా తగ్గాయి. ఐపీసీ నేరాలు, నిబంధనలు అతిక్రమించే పౌరులపై స్థానిక చట్టాల కింద నమోదు చేసే (ఎస్‌ఎల్‌ఎల్) నేరాలు తగ్గాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాపులను కూడా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కట్టడి చేసింది. ఇక మహిళలు, బాలికలపై నేరాలు తగ్గేలా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించింది. ఎస్సీ, ఎస్టీల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది.. అందుకే ఆ వర్గాలపై నేరాలు తగ్గాయి. 2022లో దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు పెరిగినా ఏపీలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తన సమర్థ పనితీరుతో నేరాలను నియంత్రించడం గమనార్హం. దేశంలో 54 శాతం.. నాడు ఏపీలో 85.7 శాతం 2022లో రాష్ట్రంలో ఆచూకీ దొరకనివారు 621 మంది ఉన్నారు. వారిలో బాలురు 250 మంది కాగా బాలికలు 371 మంది ఉన్నారు. 2023లో మొత్తం 4,433 మంది కనిపించకుండా పోయారని / ఇంటినుంచి అలిగి వెళ్లిపోయారని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో బాలురు 1,196 మంది బాలురు కాగా 3,237మంది బాలికలు ఉన్నారు. మొత్తం మీద 1,446మంది బాలురు, 3,608మంది బాలికలు కనిపించకుండా / ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయినట్టు కేసులు నమోదయ్యాయి. కాగా వారిలో 4,331 మందిని పోలీసులు కనిపెట్టి సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారిలో బాలురు 1,141 మంది, బాలికలు 3,190 మంది ఉన్నారు. అంటే 85.7 శాతం మందిని 2023లోనే పోలీసులు సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. (మిగిలిన వారిని 2024లో పోలీసులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు). కనిపించకుండాపోయిన బాల, బాలికలను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది. అందుకే ఏకంగా 85.7 శాతం మందిని సురక్షితంగా వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చింది. దేశం మొత్తం మీద 54 శాతం మందినే సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏకంగా 85.7 శాతం మంది బాల, బాలికలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే పవన్‌కళ్యాణ్ 2024 ఎన్నికల ముందు అవాస్తవ ఆరోపణలు చేశారన్నది మరోసారి స్పష్టమైంది. నేర పరిశోధనలో భేష్ నేరాలను కట్టడి చేయడమే కాదు.. నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలోనూ మెరుగైన భూమిక పోషించింది. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే కేసు నమోదు చేసి నిర్ణిత కాలంలో చార్జ్‌షిట్ దాఖలు చేసేలా చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో ఏకంగా 91.6 శాతం కేసుల్లో చార్జ్‌షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్ణిత సమయంలోగా చార్జ్‌షిట్లు దాఖలు చేయడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. పవన్ ఆరోపణలు పూర్తి అవాస్తవం.. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్‌లో 34వేల మందిమహిళలు, బాలికల అపహరణకు గురయ్యారని పవన్‌కళ్యాణ్ గతంలో చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమేని కేంద్ర హోంశాఖ నివేదిక స్పష్టం చేసింది. 2024 ఎన్నికల ముందు తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటూ పవన్‌కళ్యాణ్ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. కాగా ఆయన చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది