టీడీపీ నాయకుల దాష్టీకం 

బాలికపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకుడు

భూమి ఆక్రమించవద్దని వేడుకున్న బాలికపై దౌర్జన్యం

బాలిక తల్లిపైనా విచక్షణరహితంగా దాడి

జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను లాగిపడేసిన వైనం 

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపలలో ఘటన 

అనంతపురం: తమ భూమి ఆక్రమించవద్దంటూ అడ్డుపడిన బాలికపై టీడీపీ నేతలు దాష్టీకం ప్రదర్శించారు. దాడి చేసి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లి పక్కన పడేశారు. అసభ్యపదజాలంతో దూషించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపల చోటు చేసుకుంది. బాధితురాలు సోమవారం గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తన గోడు విన్నవించింది. వివరాలిలా ఉన్నాయి. జంబుగుంపల గ్రామానికి చెందిన గొల్ల దొడ్డయ్య కుమార్తె  శాలిని పదో తరగతి వరకు చదివింది. అదే గ్రామ సర్వే నంబర్‌ 110లో వీరికి 4.05 ఎకరాల భూమి ఉంది.  
109–1 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉందంటూ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేశారు. శాలిని తల్లిదండ్రులు గొల్ల లక్ష్మి, దొడ్డయ్య తమ పట్టా భూమిలో దారి లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు అధికారులు ఏమీ తేల్చకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గత శనివారం టీడీపీ నాయకులైన గొల్ల బొమ్మయ్య, కుమారుడు గొల్ల తిప్పేస్వామి, గొల్ల నరసింహప్ప భార్య గొల్ల చిక్కమ్మ  కలిసి శాలిని తల్లిపై  విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తన్ని నానా దుర్భాషలాడారు. 

జేసీబీని తెప్పించి వారి పొలం మీదుగా దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు సిద్ధం కాగా.. శాలిని అడ్డుకోబోయింది. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు వెట్టి మారెప్ప కుమారుడు వెట్టి హనుమంతురాయుడు,  ఈరప్ప కుమారుడు జి.హనుమంతురాయుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా పక్కకు లాగిపడేశారు. జేసీబీతో తొక్కించి చంపుతామంటూ.. బండ బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు. 

ఈ దృశ్యాలను వీడియో తీసి టీడీపీ నేతలే సోషల్‌ మీడియాలో పెట్టి  వైరల్‌ చేశారు.  ఘటనా స్థలంలోనే పోలీసులు ఉన్నా టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఆపలేకపోయారు. దీంతో టీడీపీ నేతలకు భయపడి బాధిత కుటుంబం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లలేకపోయింది. తమకు న్యాయం చేయాలని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. 

Back to Top