తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈసారి గట్టిగా బదులిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాధవరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఎమ్మెల్యే బాలకృష్ణకి తన భాగస్వామ్యపక్ష నాయకుడి మీద కోపం ఉంటే ఆయన మీద చూపించుకోవాలి. ఓజీ సినిమాకి సీఎం చంద్రబాబు రూ.1000 లకు టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చాడనే కడుపు మంట ఉంటే వెళ్లి చంద్రబాబుతో మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాన్ మీద కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలి. నీ పేరు 9వ నెంబర్‌లో రాస్తే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ని అడగాలి. అంతేకాని సభలో లేని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడటం సిగ్గుచేటు. ఇది సభా మర్యాదలను అగౌరవపర్చడమే. బాలకృష్ణతో సహా ఇకపై ఎవరైనా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ మాజీ సీఎం వైయస్ జగన్‌ని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడితే దానికి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నాం. మీరెలా మాట్లాడతారో మేం కూడా అలాగే మాట్లాడతాం. మీరు గౌరవం ఇస్తే.. మేం కూడా గౌరవం ఇస్తాం. ఇంకోసారి వైయస్ జగన్ గురించి ఇలా వాగితే దానికి సమాధానం మరోలా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు సందర్భంగా తనకు సహకరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరీశ్వరి దంపతులను కూడా చంద్రబాబు వాడుకుని వదిలేశాడు. ఆ దంపతులిద్దరికీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా పురంధరీశ్వరికి దివంగత వైయస్ఆర్ కేంద్ర మంత్రి పదవి ఇప్పించిన విషయాన్ని బాలకృష్ణ మరిచిపోకూడదు. వైయస్ఆర్ లేకపోయుంటే పురంధరీశ్వరి రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. వైయస్ఆర్ ఆదుకోకపోయుంటే బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యేవాడా? కనీసం జైలుకు పోకుండా సినిమాలు చేసుకునే అవకాశం ఉండేదా అని ఆలోచించుకోవాలి. బాలకృష్ణ ఇంకోసారి నోరుజారి మాట్లాడితే వైయస్ఆర్‌సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అదేభాషలో ఆయనకు సమాధానం చెబుతారని హెచ్చరిస్తున్నా. ● బాలకృష్ణ ప్రవర్తన గురించి అందరికీ తెలుసు: బాలకృష్ణ బయటకొచ్చినప్పుడు ఫ్యాన్స్ తో ఎలా ప్రవర్తిస్తాడు. సినిమా ఫంక్షన్లలో ఎలా మాట్లాడతాడు. హీరోయిన్లతో ఎలా నడుచుకుంటాడో రాష్ట్ర ప్రజలంతా చాలా సందర్భాల్లో చూసి అసహ్యించుకున్నారు. బాలకృష్ణ తన ఇంట్లో కాల్పులు జరిపి ఇద్దర్ని తీవ్రంగా గాయపర్చడమే కాకుండా మరో వ్యక్తికి మృతికి కారణమయ్యాడు. ఈ కేసులో ఆయన కోర్టుకి మెంటల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి మానసిక రోగినని చెప్పుకుంటూ బయట తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తి నిత్యం ప్రజల కోసం తపించే రియల్ హీరో వైయస్ జగన్ గురించి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సినిమాల్లో నటించి, సినిమాల్లో ఎదిగి, సినిమాలను అడ్డం పెట్టుకుని పార్టీలు పెట్టిన పవన్ కళ్యాణ్, చిరంజీవి, అదే సినిమాల ద్వారా వచ్చిన ఫాలోయింగ్‌తో ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణలు.. ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీని ఏపీకి తరలించడానికి ప్రయత్నం చేయలేదు. కానీ వైయస్ జగన్ సీఎం అయ్యాక సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆహ్వానించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే వారికి కావాల్సిన ఇళ్ల స్థలాలు, స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు ఇస్తామని ఆఫర్ చేశారు. సినిమా వారిని సాదరంగా ఆహ్వానించి గౌరవంగా మాట్లాడి పంపితే, వైయస్ జగన్ అవమానించాడని రాజకీయ ప్రయోజనాల కోసం విష ప్రచారం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సినిమా వాళ్లని కనీసం ఇంట్లోకి కూడా ఆహ్వానించడకుండా బయట లాన్ లో కూర్చోబెట్టి కాలిమీద కాలేసుకుని మాట్లాడితే మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఆనాడు మా నాయకులు వైయస్ జగన్ ని ఉద్దేశించి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ప్రచారం చేశారు. సందర్భం ఉన్నా లేకపోయినా ప్రతిసారీ ఆయన్ను లాగి విషం ప్రచారం చేస్తూ వచ్చారు. సినిమాల విషయంలో వైయస్ జగన్ అనుసరించిన విధానాలే కరెక్ట్ అని పలు సందర్భాల్లో ఇదే సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంగీకరించిన మాట వాస్తవమా కాదా చెప్పాలి.