తన వర్గ ప్రయోజనాలకే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ

ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ నియంతలా నిర్ణయం

చంద్రబాబుపై మాజీ మంత్రి సాకె శైలజానాథ్‌ ఫైర్‌

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త సాకె శైలజానాథ్‌.

ప్రైవేటుతో పేదలకు అందని ద్రాక్షగా ఉచిత వైద్యం 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రైవేటీకరణను రద్దు చేస్తాం

ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు నుంచి వెనక్కి తీసుకుంటాం

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సాకె శైలజానాథ్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ తన వర్గ ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ  సమన్వయకర్త సాకె శైలజానాథ్‌ ఆక్షేపించారు. ఒక వైపు కేంద్రం మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని తపన పడుతుంటే, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, అందుకు భిన్నంగా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణను రద్దు చేసి మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వమే టేకోవర్‌ చేస్తుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకె శైలజానాథ్‌ కోరారు.
ప్రెస్‌మీట్‌లో సాకె శైలజానాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

●చంద్రబాబు ఎప్పుడొచ్చినా ప్రైవేటు జపమే:

    యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ ప్రోగ్రాం కింద ఫేజ్‌–3లో రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన కేంద్రం, అందులో రూ.5 వేల కోట్లు రాష్ట్రాలు భరిస్తే చాలని వెల్లడించింది. ప్రతి మెడికల్‌ సీటుపై కోటిన్నర ఖర్చు చేసి మన దేశాన్ని వైద్య రంగంలో మరింత ముందుకు తీసుకుపోవడంతో పాటు, నాణ్యమైన అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కేంద్రం ప్రకటించింది. అలా కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజా వైద్య రంగం బలోపేతం మీద దృష్టి పెడుతుంటే, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. గతంలోనూ 2014–19 మధ్య ఫేజ్‌–1లోనూ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుడితే ఒక్క కాలేజీ కట్టడానికి కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడూ అదే విధంగా వ్యవహరిస్తోంది. 
    గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్‌ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయాలని ఉవ్విళ్లూరుతుండటం బాధాకరం. ప్రతి జిల్లాకి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని 17 కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా మాజీ సీఎం వైయస్‌ జగన్‌ ముందుకు తీసుకెళితే, వాటిని ప్రైవేటుపరం చేసి వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.

● దోపిడికి మరో పేరు పీపీపీ:

    ఎక్కడ సంపద ఉంటే అక్కడ చంద్రబాబు కన్నేస్తాడు. రకరకాల పేర్లు పెట్టి దోచుకునే ప్రణాళికలు వేస్తాడు. అందులో భాగంగానే మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నాడు. పులివెందుల మెడికల్‌ కళాశాలకు సీట్లు వద్దని ఎన్‌ఎంసీకి లేఖ రాయడం సిగ్గు చేటు. విద్యార్థులు, మేధావులు, విద్యారంగ నిపుణులు, ప్రజాసంఘాలు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నా చంద్రబాబు వెనక్కి తగ్గడం లేదు. ఇది ఏ మాత్రం మంచి సంప్రదాయం కాదు. 
    ప్రజాభీష్టానికి భిన్నంగా మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే భవిష్యత్తులో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని టెండర్లను రద్దు చేసి మెడికల్‌ కాలేజీలను వెనక్కి తీసుకుంటుందని మా నాయకుడు జగన్‌గారు చెప్పిన మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 

● ప్రైవేటీకరణపై వైద్య ఆరోగ్య మంత్రి అసత్యాలు:
    
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్‌ విద్యను ప్రమోట్‌ చేస్తుంటే, రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను నిర్వహిస్తున్న బీజేపీ మంత్రి సత్యకుమార్‌ మాత్రం దానికి తూట్లు పొడిచే విధంగా ప్రైవేటీకరణను ప్రమోట్‌ చేయడం సిగ్గుచేటు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సమర్థించుకునేలా ఆయన చెబుతున్న అబద్ధాలు చూస్తుంటే ఆయన్ను అసత్యకుమార్‌ అనాల్సి వస్తుంది. టీడీపీ సపోర్టుతో కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు సాధించాల్సింది పోయి ఉన్నవాటినే పణంగా పెట్టడం విజనరీ చేసే పనేనా అని చంద్రబాబు ఆలోచించుకోవాలి.
    కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వస్త సురక్ష యోజన కింద అనంతపురంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్‌ను చంద్రబాబు మంగళగిరికి మార్చేశాడు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగనివ్వం. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంది. 

● అప్పులపై అన్నీ అబద్ధాలేనని తేలిపోయింది:

    రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై కూటమి నాయకులు బురద జల్లడమే పనిగా వ్యవహరించారు. రూ.14 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు, రూ.10 లక్షల కోట్ల అప్పులని నోటికొచ్చినట్టు ప్రచారం చేశారు. తీరా గత ప్రభుత్వం ఆ ఐదేళ్లలో చేసిన అప్పులు కేవలం రూ.3.70 లక్షల కోట్లేనని ఆర్థిక మంత్రి సమాధానంతో ప్రపంచానికి తెలిసొచ్చింది. అప్పులపై చెప్పిన అబద్ధాలు, చేసిన దుష్ప్రచారం గుర్తొచ్చి ఈ ప్రభుత్వానికి ప్రజలు చీవాట్లు పెడుతున్నారు. 
    సంపద సృష్టించి సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు, ఒక్క హామీ నెరవేర్చకుండానే 16 నెలల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. అయినా, చివరకు రైతులకు కనీసం బస్తా యూరియా కూడా అందించలేని దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి సాకె శైలజానాథ్‌ గుర్తు చేశారు.

Back to Top