తాడేపల్లి: మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చాక, తొలి సంతకం అని హడావిడి చేసినా, చివరకు 16 నెలల తర్వాత కేవలం 16 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తోందని వైయస్ఆర్‌సీపీఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికెగిరిపోయాయని, మరోవైపు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి చురకలంటించారు. ప్రెస్‌మీట్‌లో ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..: ● మెగా డీఎస్సీ కాదు. దగా డీఎస్సీ: అధికారంలోకి వస్తే 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ముందు చెప్పిన, ఆర్భాటంగా ప్రచారం చేసిన టీడీపీ కూటమి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో ప్రకటించిన 6 వేల పోస్టులతో కలుపుకుని కేవలం 16,341 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసినా, నోటిఫికేషన్ జారీ, షెడ్యూల్‌లో విపరీతంగా కాలయాపన చేశారు. ఇప్పుడు 16 నెలల తర్వాత 15,941 మందిని రిక్రూట్ చేస్తున్నారు. ● అత్యంత ఆర్భాటంగా కార్యక్రమం: కాగా, ఆ ఉద్యోగాలు అభ్యర్ధుల ప్రతిభ ఆధారంగా కాకుండా వీళ్ల దయ మీదే ఇచ్చినట్లు చూపించడానికి నానా తంటాలు పడుతున్నారు. అందుకోసం వెలగపూడిలోని సచివాలయం చేరువలో భారీ ఏర్పాట్లు చేసి, బహిరంగ సభ పెట్టి నియామకపత్రాలు అందజేశారు. డీఎస్సీలో ఎంపికైన వారితో పాటు, వారి తల్లిదండ్రులతో సహా దాదాపు 34 వేల మందిని ఆ కార్యక్రమానికి పిల్చారు. అందుకోసం జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపారు. పారీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కావాలని కోరారు. అత్యంత అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్సీ నియామక పత్రాలు అందించారు. ● నాడు ఏ అట్టహాసం లేకుండా..: డీఎస్సీ నియామకాలు పూర్తి చేయడానికి 16 నెలలు తీసుకుని దాన్ని వేగంగా చేసుకున్నామని చెప్పుకుంటున్నారు. ఇదా స్పీడ్ అంటే ? వైయస్.జగన్ హయాంలో 1.37 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ కేవలం 4 నెలల్లో పూర్తి చేసిన వారు విధుల్లో చేరే విధంగా అత్యంత వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ మీలా ఉద్యోగులను పిలిపించుకుని ఇంతలా ప్రచార ఆర్భాటం చేయలేదు. ఉద్యోగాల నియామక ప్రక్రియలోనూ, బదిలీల్లోనూ అన్నింటిలోనూ రాజకీయ జోక్యమే. నాలుగు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ●డీఎస్సీలో అవకతవకలు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వరలక్ష్మి అనే మహిళకు ఉద్యోగం వచ్చిందని పిల్చి, మరలా నీకు ఉద్యోగం రాలేదని డీఈఓ చెప్పడం చూస్తుంటే, కనీసం మెరిట్ లిస్టు కూడా సక్రమంగా తయారు చేయలేదని స్పష్టమవుతోంది. ఇదంతా చూస్తుంటే నియామక ప్రక్రియపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మెరిట్ ఉండి కూడా తమకు అన్యాయం జరిగిందనే భావనలో చాలా మంది అభ్యర్ధులు ఉన్నారు. ● జగన్ గారి హయాంలో 6.48 లక్షల ఉద్యోగాలు: మరోవైపు వైయస్.జగన్ ప్రభుత్వంలో 1.37 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను నియమించడంతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇంకా దాదాపు 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో మరో 7 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిల్చిపోయింది. ఇప్పుడు మీరు దాని ఊసే ఎత్తడం లేదు. శ్రీ వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 2.31 లక్షల శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. వీటికి తోడు 44 వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా 3.73 లక్షల ఉద్యోగాలు కలుపుకుని మొత్తంగా ప్రభుత్వ రంగంలో 6.48 లక్షల ఉద్యోగాలు కల్పించారు. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా, ఎంఎస్‌ఎంఈల ద్వారా ప్రైవేటు రంగంలో మరో 50 లక్షల మందికి ఉద్యోగాల కల్పించారు. వైద్య రంగంలో 54 వేల ఉద్యోగాలు కల్పించారు. ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. కేవలం 16వేల ఉద్యోగాలిచ్చి కూటమి ప్రభుత్వం మాదిరిగా డబ్బు కొట్టుకోలేదు. ● ఉద్యోగులకు ప్రభుత్వం మెండిచేయి: మరోవైపు ఉద్యోగులకు అనేక హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ప్రతి కేబినెట్ సమావేశం ముందు ఉద్యోగులు తమకు రావాల్సిన డీఏ, ఐఆర్, పీఆర్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దసరా పోయి మళ్లీ వస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమకు రావాల్సిన నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. ఇక పీఆర్సీకి సంబంధించి 25 నెలల కాలం దాటింది. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్‌ను నియమిస్తే ఆయనతో రిజైన్ చేయించిన కూటమి ప్రభుత్వం కొత్త వ్యక్తిని నియమించలేదు. దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. 12వ పీఆర్సీ 2023, జూలై 1 నుంచి డ్యూ ఉంది. పీఆర్సీ కమిషనర్‌ను నియమించి రిపోర్టు తెప్పించుకుని దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 30 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి (ఐఆర్)ని దసరా సందర్బంగా ప్రకటించాలని కోరుతున్నాం. రూ.30 వేల కోట్లకు పైగా ఉద్యోగులకు బకాయి ఉన్న పీఆర్సీ, డీఏ అరియర్స్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్ వంటి వాటిపై ఎన్నికల ముందు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ తక్షణమే చెల్లించాలి. దసరా పండగలోగా ఇవన్నీ చేయకపోతే, ఉద్యోగల పక్షాన ఆందోళన చేస్తాం. ● సచివాలయాల ఉద్యోగులపై కక్ష సాధింపు: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అసలు ఉద్యోగులుగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేయడం లేదు. వైయస్ జగన్ హాయంలో నియామకాలు జరిగాయన్న దురుద్దేశంతో వాళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. వాలంటీర్లను రద్దు చేశారు. వాళ్ల పని కూడా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారు. ఇంకా అసెంబ్లీ సాక్షిగా కార్మికల పని గంటలకు సంబంధించి బిల్లు పెట్టి.. దుకాణాలలో పని చేసే వాళ్లకు 8 గంటల నుంచి 10 గంటలు పొడిగిస్తూ, పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు 9 గంటల నుంచి 10 గంటల పాటు పొడిగిస్తూ కార్మికుల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇది కార్మికుల సంక్షేమంపై కనీసం మనసు లేని ప్రభుత్వమని ఎన్.చంద్రశేఖర్ రెడ్డి దుయ్యబట్టారు.