గుంటూరు: గుంటూరులో పది రోజులుగా డయేరియా విజృంభిస్తున్నా.. నివారణ చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైయస్ఆర్‌సీపీ నేతలతో కలిసి డయేరియా వార్డులో బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియా మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రైవేటీకరణ మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యం మీద లేదని మండిపడ్డారు. ఇంత విస్తృతంగా డయారియా, కలరా వ్యాపిస్తున్నా కనీసం వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు. జిల్లాలో ఇంత మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నా... ప్రజల ఆరోగ్యం పట్ల కనీస స్పందన లేకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 17న డయేరియా కేసులు బయటపడ్డాయి. వరుసగా ఇవాల్టికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకులు, మంత్రులు ఉన్నా డయేరియా నివారణలో చిత్తశుద్ది లేకుండా పోయింది. ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప... ఎలాంటి చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా కూటమి నేతలందరికీ వైద్య, ఆరోగ్యశాఖ అత్యంత నిర్లక్ష్యానికి గురైంది. ప్రజలు ఎలా పోయినా పట్టించుకున్న పరిస్థితి లేదు. 200 పైగా డయేరియా బాధితులు ఉన్నా... నివారణ చర్యలు శూన్యం. ఒక్క జీజీహెచ్ లోనే 184 మంది బాధితులు చేరారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 60 మందికి డయారియా వస్తే.. నిరంతరం పరిస్థితిని సమీక్షించి, అన్ని రకాల చర్యలు తీసుకుని మూడు రోజుల్లో అదుపులోకి వచ్చేటట్టు చేశాం. ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. గుంటూరుతో పాటు చుట్టుపక్కల వ్యాధి బారిన పడితే.. ప్రభుత్వం నిద్రపోతుంది. డోర్ టు డోర్ సర్వే చేపట్టలేదు. నీరు, ఆహారం కూడా పరీక్షించలేదు. నీటిసరఫరాలో పైపు లీకేజీ, సక్రమంగా క్లోరినేషన్ లేకపోవడం వంటి లోటుపాట్లును అధ్యయనం చేయాల్సి ఉంది. ఇలా ఏ రకమైన జాగ్రత్తులు తీసుకున్నట్లు కనిపించడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా నిద్రపోతుంది. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యం. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు 11 కలరా కేసులు ఉన్నాయి. కొంతమంది చనిపోయినట్లు సమాచారం ఉంది. ఇటీవల తురకపాలెంలో 40 మంది చనిపోయారు. దానికి కారణాలు కూడా ఇంతవరకు తేల్చలేదు. ప్రైవేటీకరణ మీద ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి దేనిమీదా లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సరైన సౌకర్యాలు లేవు, ఒకే మంచం మీద ఇద్దరి రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కొంతమంది ఇండ్ల వద్దే రోగులు ఉన్నారు. వారికి కూడా మందులు అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తక్షణమే డయేరియా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ పేరుతో థర్డ్ పార్టీకి అప్పగించే పనిలో కూటమి ప్రభుత్వం బిజీగా ఉంది. అందుకే ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. చివరకి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు కూడా బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టింది. ఫలితంగా వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.. మిమ్నల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఎక్కుడున్నారో?, ఏ చేస్తున్నారో ? సమాధానం చెప్పాలని విడదల రజిని డిమాండ్ చేశారు. ● నూరి ఫాతిమా - గూంటూరు తూర్పు నియోజకవర్గం. ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. ప్రగతినగర్ లో కమిషనర్, కలెక్టర్, ఎమ్మెల్యేలు బాధితులకు శానిటైజర్, మాస్కులు ఇస్తున్నామని చెబుతున్నారే తప్ప... డయేరియా అతిసారాకు కారణం ఏంటన్నది చెప్పడం లేదు. పబ్లిక్ కుళాయి నిలిపివేసి ట్యాంకుల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారే తప్ప... శానిటేషన్ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. 2017లో ఇదే విధంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో డయేరియాతో ఆనందపేటలో 32 మంది చనిపోయారు. ఇవాళ గుంటూరు పట్టణంలో చాలా ప్రాంతాలకు డయేరియా వ్యాపించింది. ప్రభుత్వం కనీస నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఈ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదు. తక్షణమే డయేరియా నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.