తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయన గురించి నోటి కొచ్చినట్టు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు హెచ్చరించారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇకనైనా తన బావమరిది బాలకృష్ణకు సంస్కారం నేర్పాలని సూచించారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడే సందర్భంగా ఊగుతూ తూగుతూ కనిపించడం చూస్తుంటే ఆయన మానసిక స్థితి గురించి అనుమానం వస్తోందని అన్నారు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తితో స్పీకర్ ఎలా మాట్లాడించారని ప్రశ్నించారు. వైయస్ జగన్ గారిని సైకో అన్న బాలకృష్ణ నిజానికి తానే ఒక సైకో అని, ఎక్కడైనా ఆయన వ్యవహారశైలి అదే చూపుతుందని జూపూడి ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఇటు శాసనసభలో కానీ, అటు బయట కానీ, తన అభిమానుల వద్ద కానీ బాలకృష్ణ ప్రవర్తించే తీరు చూస్తే, ఎవరైనా ఆయన సైకో అని చెబుతారని జూపూడి చురకలంటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..: అసెంబ్లీలో తూలుతూ మాట్లాడడం ఏమిటి!: అసెంబ్లీ అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమ వేదిక. కానీ కూటమి సభ్యుల వ్యవహారశైలి చూస్తే చట్టసభలను ప్రజా సమస్యలపై చర్చించడానికి కాకుండా తమకు గిట్టని వారిపై బురద జల్లడానికి వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. చట్టసభల్లో ఎలా మాట్లాడాలన్న కనీస జ్ఞానం లేకుండా ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రెండు చేతులూ జేబులో పెట్టుకుని ఊగుతూ.. తూగుతూ మాట్లాడటాన్ని టీవీల్లో చూసిన మాకే ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన రియల్ కండిషన్ ఏంటో సభను నడిపిస్తున్న స్పీకర్ ఛైర్‌లో కూర్చున్న రఘురామకృష్ణంరాజు చెబితే ఇంకా బాగుంటుంది. అసెంబ్లీ సాక్షిగా అలా మాట్లాడొచ్చా?: బాలకృష్ణకు మనసులో ఏవైనా బాధలు, అసంతృప్తి ఉండొచ్చు. సినిమాలు సక్సెస్ కావడం లేదనో, మంత్రి పదవి రాలేదనో, తనకిష్టం లేని హీరోకి చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడనే అసహనం కావొచ్చు.. ఇలాంటివి ఏవైనా ఉంటే చంద్రబాబు, బాలకృష్ణ కూర్చుని తేల్చుకోవాలే తప్ప ఇలా అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఉద్దేశించి సైకో అని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనలా మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ సహా సభలో ఉన్న సభ్యులెవరూ అడ్డుకోకపోవడం వారి దిగజారుడుతనానికి అద్దం పడుతోంది. సభను నడిపించే తీరు ఇదేనా అని స్పీకర్ ఛైర్‌లో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీరుపై ప్రజలందరిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ● వైయస్ జగన్ రియల్ హీరో: ఒక కల్పిత కథను సృష్టించుకుని, దానికి పాటలు, ఫైట్లు జోడించి సినిమాలు తీసి, ఆ సినిమాలను జనం తమ చిల్లర డబ్బులతో రెండు గంటలపాటు చూస్తే.. అదే ఈ ప్రపంచానికి సేవ చేసినట్టుగా బాలకృష్ణ భావిస్తున్నారేమో!. ఆయన సినిమా హీరో అయితే కావొచ్చు. ఆ ఇమేజ్‌తో నాలుగు ఓట్లు వచ్చి ఎమ్మెల్యే కావొచ్చు. అంత మాత్రాన మా నాయకుడి గురించి ఇష్టానుసారం మాట్లాడతానంటే మాత్రం కుదరదు. బాలకృష్ణ సినిమాల్లో మాత్రమే హీరో. కానీ మా నేత జగన్‌గారు ఒక రియల్ హీరో. సొంతంగా పార్టీని పెట్టి అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఐదేళ్ల పాలనతో రాష్ట్ర చరిత్రలో చెరిగిపోని సంక్షేమ పథకాలు అమలు చేసి కోట్లాది మంది హృదయాలు గెల్చుకున్నారు. ఆయన గురించి బాలకృష్ణ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ● అభిమానుల ముందే ఉన్మాదిలా మారిపోతాడు: అధికారం కోసం చిరంజీవి తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ని చంద్రబాబు చేరదీస్తే ఆ కోపాన్ని మా నాయకుడిపై ప్రదర్శిస్తే ఏం ఫలితం ఉంటుందో బాలకృష్ణ ఆలోచించుకోవాలి. జగన్‌గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా సినీ పరిశ్రమ వారిని చాలా గౌరవించారు. తనను కలవడానికి వచ్చిన వారితో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. సినీ పరిశ్రమ విశాఖకు తరలి రావాలని, అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇంకా హీరో చిరంజీవిగారు తన సతీమణితో కలిసి ఇంటికి వస్తే, వారిని శ్రీ వైయస్ జగన్ దంపతులు చాలా సాదరంగా ఆహ్వానించారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు. భారతిగారు స్వయంగా వడ్డించారు. ఆ విషయాన్ని ఆ తర్వాత చిరంజీవిగారు స్వయంగా చెప్పారు. తనను జగన్‌గారి దంపతులు కారు వరకు వచ్చి సాగనంపారని తెలిపారు. సీఎం స్థానంలో ఉండి కూడా అలాంటి గౌరవ మర్యాదలతో వ్యవహరించిన వైయస్ జగన్‌ని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అని మాట్లాడటం చూస్తుంటే ఆయన మానసికస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన ఈ చేష్టలన్నీ చూస్తే సైకో ఎవరో చెప్పాల్సిన పని లేదు. దండలేయడానికి ఫ్యాన్స్ దగ్గరకొస్తేనే సహించలేక ఉన్మాదిలా మారి బాలకృష్ణ వారి చెంపలు పగలకొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ● ఇంట్లో కాల్పులు జరిపింది ఎవరో తెలియదా?: గతంలో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన కూడా ఆయన ఎలాంటి వాడో చెబుతుంది. ఈ ఘటనలో బాలకృష్ణ స్వయంగా తన రివాల్వర్‌తో షూట్ చేస్తే సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, సొంత జ్యోతిష్యు్కడు సత్యనారాయణ తీవ్రంగా గాయపడి చాలాకాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. సెక్యూరిటీ గార్డు మాత్రం మరణించాడు. ఆ సమయంలో దివంగత వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉంటే తన తమ్ముడిని కాపాడమని పురంధరీశ్వరి సహా మొత్తం నందమూరి కుటుంబమే ఆయన్ను కాళ్లావేళ్లా పడి వేడుకుంది. ఒక మెంటల్ సర్టిఫికెట్ తీసుకుని ఆ కేసు నుంచి బాలకృష్ణ బయట పడ్డాడు. ఈ విషయాలను గుర్తుంచుకుని, ఇకపై జగన్‌గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని జూపూడి ప్రభాకర్‌రావు హెచ్చరించారు.