అట్టడుగువర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

కార్పొరేషన్‌ డైరెక్టర్ల నియామకంలో అన్ని వర్గాలకు పెద్దపీట

విజయవాడ: అట్టడుగువర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారని, బలహీనవర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్లలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియమించామన్నారు. కార్పొరేషన్‌ డైరెక్టర్ల నియామకంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేశామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు, ఓసీలకు 42 శాతం పదవులిచ్చామన్నారు. ఇందులో మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. 

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల వివరాలను సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో జరుగుతుందని, ఎవరిని భ్రమలో పెట్టో, మాటవరసకు చెప్పి తప్పించుకోవడం కాకుండా.. నిజాయితీతో, నిబద్ధతతో అట్టడుగువర్గాల అభ్యున్నతికి సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారన్నారు. సమీప భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా మరింత ముందడుగు వేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.  

‘రాష్ట్రంలో రాజకీయంగా ఇంతకాలం వెనకడుగులో ఉన్న వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేశాం. డైరెక్టర్ల నియామకాల్లో అధ్యయనం చేసి.. కొన్ని కులాల్లోని వ్యక్తులను వెతికి కూడా తీసుకువచ్చి పదవులు ఇస్తున్నాం. గత ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేసి ఉంటే అట్టడుగు వర్గాల నుంచి నాయకులు ఇప్పటికే వచ్చుండేవారు. కానీ, అలాంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే.. ప్రప్రధమంగా జరుగుతుంది. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిన వారిని ముందుకు తీసుకురావాలని ఎన్నికలకు ముందే వైయస్‌ జగన్‌ ప్రకటించారు. బీసీలకు సంబంధించి డిక్లరేషన్‌ చేశారు. కేబినెట్‌ కూర్పుతోనే సామాజిక సమతూల్యత మొదలైంది. 60 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. శాసనసభ స్పీకర్‌ బీసీ, శాసనమండలి స్పీకర్‌ కూడా రాబోయే రోజుల్లో ఇదే వర్గాల నుంచే కచ్చితంగా ఉంటారు. 

2014–19 మధ్య టీడీపీ హయాంలో బీసీల పట్ల మొసలికన్నీరు కారుస్తూ ఓటు బ్యాంక్‌గా చూసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీటు ఒక్క బీసీకి కూడా ఇవ్వలేదు. ఎస్సీ వర్గానికి సంబంధించిన ఒక నాయకుడికి సీటు ఇచ్చినట్టే చెప్పి నమ్మించి వెనక్కులాగేసుకుంది. ఓటర్లను భ్రమలో పెడితే ఓట్లు పడతాయనే అతినమ్మకం, అత్యాశ టీడీపీలో పెరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నిర్లక్ష్యం చేసింది. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పటి వరకు శాసనమండలికి 15 మందికి అవకాశం కల్పిస్తే.. అందులో 11 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించాం. నామినేటెడ్‌ పదవుల్లో కూడా 50 శాతం పదవులు ఇవ్వాలనే చట్టాన్ని తెచ్చాం.. ఆ చట్టాన్ని దాటి పదవులు కేటాయించాం. సచివాలయాల్లో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల నుంచే ఎంపికయ్యారు. ఈ 26 నెలల్లోనే 6 లక్షల మందికి ఉద్యోగాలిస్తే.. ఇందులో 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే వచ్చాయి. ఇవి సగర్వంగా ప్రకటించుకోగలిగినవి. 

చిత్తశుద్ధితో, నిజాయితీతో వెనకబడిన వర్గాలన్నింటినీ ముందుకు తీసుకువచ్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారు. బీసీలకు ప్రత్యేకించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్లలో సగభాగానికి పైగా 137లో 79 పదువుల అంటే 58 శాతం వారికే ఇచ్చాం. నామినేటెడ్‌ పదవుల్లో 57 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే అందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇవ్వడం జరిగింది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. 
 

Back to Top