హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్రలు చేశారు.

ఏడాది తరువాత పరిషత్‌ ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడింది

అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేశారు

ఎన్నికలు జరపకుండా చంద్రబాబు వాయిదా వేసుకుంటూ వచ్చారు

 ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబే

మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చాం

దిశ చట్టం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగింది

దిశ చట్టం ప్రతులను తగులబెట్టారంటే లోకేష్‌ మానసికస్థితి అర్థం చేసుకోవాలి

తాడేపల్లి:  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏడాది తరువాత ఈ రోజు గ్రహణం వీడిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబే అని విమర్శించారు.  అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వంతో చర్చించకుండా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారని చెప్పారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డదారులు తొక్కడమే చంద్రబాబు నైజమన్నారు. దిశ చట్టం ప్రతులను తగులబెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

 గ్రహణం వీడింది:
    వ్యవస్థలోని సాంకేతిక అంశాలు, లొసుగులను వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టడంలో బాగా అలవాటు పడిన తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి పైగా ప్రజలతీర్పును తొక్కి పెట్టి ఉంచిన పరిణామానికి ఇప్పుడు కోర్టు తీర్పుతో గ్రహణం వీడింది. దీన్ని ఎందుకు ఇంతగా చెబుతున్నామంటే ఏడాదికి పైగా జరిగిన పరిణామాలను చూస్తే, ఏ స్థాయిలో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజల తీర్పును కూడా గౌరవించకుండా చేసిన చర్యలు అర్ధమవుతాయి.
    అధికార పక్షంలో ఏమైనా లోపాలుంటే ప్రతిపక్షం ఎత్తి చూపాలి. చివరకు తీర్పు ఇచ్చేది ప్రజలే. అందుకే వారి మన్ననలు పొందాలి. వారికి సేవ చేయాలి. అది మన పవిత్రమైన ఎన్నికల ప్రక్రియ.

కేస్‌ స్టడీగా భావించాలి:
    70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇప్పుడు చూసుకుంటే, ఇలాంటి కుక్కమూతి పిందెలు.. అప్పుడెప్పుడో వీరబ్రహ్మం గారు చెప్పారు. వెంపటి చెట్లకు నిచ్చెనలు వేసే వారు వస్తారని. వారిని చూస్తే నిజం అనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో మరింతగా ప్రజల భాగస్వామ్యం, అన్ని వర్గాల ప్రజల ప్రమేయం పెరిగేలా చూడకుండా.. ఎన్నికల ప్రక్రియను, ప్రజల తీర్పును ఏడాదిపాటు ఆపగలిగారంటే, దీన్ని ఒక కేస్‌ స్టడీగా చూడాల్సి వస్తోంది. దీన్ని అన్ని వర్గాల వారు లోతుగా చూడాల్సిన అవసరం ఉంది.

నిమ్మగడ్డతో రాజకీయం:
    చంద్రబాబు ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా పెట్టుకున్నప్పటి నుంచి చూడాలి. 2014లో నిమ్మగడ్డను హడావిడిగా తీసుకొచ్చి పెట్టారు. 2018లో సర్పంచ్‌ ఎన్నికలు, 2019లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అవేవీ జరపలేదు.
    మా ప్రభుత్వం వచ్చాక ఆ ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టింది. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత, హఠాత్తుగా 2020 మార్చి 15న నాటి ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, కరోనా సాకు చూపి ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు. అది పూర్తిగా ఏకపక్ష నిర్ణయం.
    సరిగ్గా ఆరోజుకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇంకా ఆరు రోజుల్లో జరగాల్సి ఉంది. నిజానికి అప్పుడు కరోనా కేసులు కూడా లేవు. ఆ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కూడా జరిగాయి. అయినా కావాలనే ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడి, వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, ఆ పని చేయని నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదా వేశారు.
    మళ్లీ ఈరోజు వాటికి అంటే 2021, సెప్టెంబరు 16న గ్రహణం వీడింది. అంటే దాదాపు 19 నెలలు వారు ఎన్నికలను ఆపగలిగారు.

ఎజెండాకు భిన్నంగా:
    ఇక ఆ తర్వాత ఎజెండాలో లేకపోయినా ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్‌ ఎన్నికలను ముందుకు తీసుకువచ్చారు. మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కాకుండా, సర్పంచ్‌ ఎన్నికలు జరిపారు. నిజం చెప్పాలంటే ఎజెండా ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలి. కానీ నిమ్మగడ్డ ఆ పని చేయకుండా సర్పంచ్‌ ఎన్నికలు జరిపించి, టీడీపీపై కృతజ్ఞత చూపి పదవీ విరమణ చేసి వెళ్లిపోయాడు.

షార్ట్‌కట్‌ రాజకీయాలు:
    ఇలా చేయడం అన్నది ప్రత్యక్ష పోరు కాదు. ప్రజల్లోకి పోయి తేల్చుకోవడం కాదు. అయితే చంద్రబాబుకు తొలి నుంచి అదే అలవాటు. 1995లో మామకు వెన్నుపోటు పొడిచి పదవి పొందినప్పటి నుంచి ప్రతి దాంట్లో షార్ట్‌ కట్‌ పద్ధతులే.
    ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ఇస్తుంటే, అవి కూడా రావొద్దని అభ్యంతరం చెప్పారు. ఒకప్పుడు ఏకగ్రీవాలే కావాలన్నారు. ఆ తర్వాత అవి అసలే వద్దన్నారు.

మళ్లీ అడ్డుకునే యత్నం:
    నిమ్మగడ్డ తన హయాం పూర్తి చేసుకోగానే, కొత్తగా వచ్చిన ఎస్‌ఈసీ గత ఏడాది నిల్చిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టగా, టీడీపీ నుంచి వర్లరామయ్య, జనసేన కార్యదర్శి కోర్టును ఆశ్రయించారు. ఆ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ, కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ విధంగా కూడా మరోసారి ఆ ఎన్నికలను ఆపే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నాలుగు వారాలు ఉండాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు దోషి:
    ఈ ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాలన్నింటికీ దోషి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ. పవిత్రమైన ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను హత్య చేయడానికి ప్రయత్నించిన వారు దోషులుగా ప్రజల ముందు నిలబడ్డారు. లేకపోతే ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూరై్త మండల పరిషత్, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది.

6 నెలలు అడ్డుకున్నారు:
    వ్యవస్థలలోని సాంకేతిక లొసుగులను అడ్డం పెట్టుకుని, బరి తెగించి తన వాళ్లతో పిటిషన్లు వేయించడం వల్ల 2021 ఏప్రిల్‌లో పూర్తి కావాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటిదాకా కొనసాగింది. దాదాపు 6 నెలల పాటు కౌంటింగ్‌ జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఇన్ని రోజులు ఆ బ్యాలెట్‌ పెట్టెలను ప్రజల సొమ్ముతో భద్రపర్చాల్సి వచ్చింది. అంటే పోలింగ్‌ జరిగి, ప్రజల నిర్ణయాలు బ్యాలెట్‌ బాక్సులలో నిక్షిప్తమై ఆరు నెలల పాటు అలా ఉండిపోయాయి.

అందరూ ఆలోచించాలి:
    విజ్ఞులు, సామాజికవేత్తలు, మేధావులు దీని గురించి యోచించాలి.  ఎన్నికల ప్రక్రియను ఏళ్ల తరబడి ఆపగలగడాన్ని అంగీకరించాలా... అన్నది అందరూ ఆలోచించాలి.
    చంద్రబాబు రాజకీయాలు ఎప్పుడూ అంతే. 1995 నుంచి అదే ధోరణి. ఆయన ఓడిపోతే ఈవీఎంలు పని చేయనట్లు ప్రచారం, హడావిడి. 2009లో, ఆ తర్వాత 2019లోనూ అదే ప్రచారం చేశారు.
ఆ తర్వాత ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ నియామకం. ఆయనను అడ్డం పెట్టుకుని చేసిన రాజకీయాలు. ఏకగ్రీవాలను కూడా ప్రశ్నించడం. ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయించడం. కోవిడ్‌ లేకపోయినా ఆ సాకుతో ఎన్నికలు వాయిదా. ఆ విధంగా అచ్చం టీడీపీ ఏజెంట్‌గా నిమ్మగడ్డ పని చేశారు.

లోకేష్‌కు చిత్తశుద్ధి ఉందా:
    ఇప్పుడు చంద్రబాబు సుపుత్రుడు గత వారం, పది రోజుల నుంచి దిశ గురించి మాట్లాడుతూ.. ఒక క్యాంపెయిన్‌ చేస్తున్నాడు. ఆడపిల్లలు, మహిళల రక్షణ కోసం సీఎంగారు ఆ చట్టాన్ని రూపొందించారు. కానీ ఆ చట్టం కేంద్రంలో ఆగిపోవడం వల్ల ఇంకా అమలులోకి రాలేదు. ఒకవేళ ఆ చట్టంలో ఏమైనా లోపాలు కనిపిస్తే చెప్పాలి. మార్పులు సూచించాలి.
దిశ చట్టం అమలులోకి రాకపోయినా, ఆ స్ఫూర్తితో పోలీసులు పని చేస్తున్నారు. నిర్ణీత వ్యవధిలో కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
    దిశ చట్టం ప్రతులను లోకేష్‌ తగలబెట్టారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి. నిజానికి దిశ యాప్‌ను 53 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆ విధంగా ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అయితే దిశ చట్టం ప్రతులను తగలబెట్టిన లోకేష్‌కు మహిళల రక్షణ మీద చిత్తశుద్ది ఉందా. ఆయనకు అసలు మైండ్‌ సక్రమంగా ఉందా లేక సందిగ్ధతలో ఉందా అన్నది అర్ధం కావడం లేదు.
    మహిళలను గౌరవంగా చూడాల్సిన అవసరం లేదనుకుంటున్నారా. వారి అల్పబుద్ధి. చౌకబారు ఆలోచనలు. చిల్లర వేషాలతో ప్రచారం పొందే ధోరణి కనిపిస్తోంది. వాస్తవానికి మీ హయాంలో మహిళల భద్రతను పట్టించుకోలేదు. చాలా చోట్ల ఫిర్యాదులు కూడా తీసుకోలేదు. ఒక మహిళా అధికారి మీద ప్రజా ప్రతినిధి చేయి చేసుకున్నా చర్యలు లేవు.
ఇలాంటి నేతల వైఖరిని మహిళలు గుర్తించాలి.దాన్నీ తప్పుబడుతున్నారు:
    సోలార్‌ పవర్‌. దీన్ని సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీ ఆఫ్‌ ఇండియా) ఇస్తామని చెబితే, దాన్ని కూడా తప్పు బడుతున్నారు. మీరు యూనిట్‌ విద్యుత్‌ను రూ.5కు పైగా కొనుగోలు చేస్తే, వాటికి మళ్లీ టెండర్లు పిలిస్తే యూనిట్‌ విద్యుత్‌ను రూ.2.49కే ఇస్తామని ముందుకు వస్తే, అంత స్పష్టంగా ప్రజాధనం ఆదా అవుతుంటే ఆహ్వానించకుండా, విమర్శిస్తున్నారు. దాంట్లోనూ సీఎంగారు కమిషన్లు పొందుతున్నారని ఆరోపించడం అంటే, వారి ధోరణికి చేతులెత్తి మొక్కాలి. 
    విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రివ్యూ చేస్తే నానా యాగీ చేశారు. కానీ యూపీలో, గుజరాత్‌లో కూడా అదే జరిగింది. చంద్రబాబు అధికారంలో ఉండాలన్నది ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా వైఖరి. అందుకే దేన్నీ వదలకుండా బురద చల్లడమే వారి పని.. అంటూ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌ ముగించారు.

తాజా వీడియోలు

Back to Top