తాడేపల్లి: రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రజలు అధికారం ఇచ్చారనే తీరుతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉందని ఆయన తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే.. ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం చంద్రబాబు కనీసం పరిస్థితిని సమీక్షించడం లేదని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్న మాజీ ఎమ్మెల్యే.. అరాచకాలను సీఎం చంద్రబాబు అదుపు చేయడం లేదని, మహిళలపై దాడులను అస్సలు పట్టించుకోవడం లేదని, ఇప్పుడు దిశ యాప్ ఉండి ఉంటే, ఇన్ని ఘటనలు జరిగేవి కావని స్పష్టం చేశారు. రాజకీయంగా కక్ష సాధింపునకు, తప్పుడు కేసుల నమోదుకు పోలీసులను వాడుకుంటున్నారని, తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి, వాటితో వైయస్ఆర్‌సీపీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. ప్రతీకారేచ్ఛతో వైయస్ఆర్‌సీపీ దళిత నాయకులపైనా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. హోం మంత్రికి సెల్ఫీల మీద ఉన్న శ్రద్ధ మహిళా రక్షణ మీద లేదన్న సుధాకర్‌బాబు, తాజాగా బద్వేలు ఘటనలో బాలిక చేతిలో దిశ యాప్ ఉండుంటే ఆమె ప్రాణాలు పోయేవి కావని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ నాలుగు నెలల్లో మహిళలు, బాలికలపై జరిగిన అనేక దాడులు, అత్యాచార ఘటనలకు దిశ యాప్ వంటి నియంత్రించే వ్యవస్థ లేకపోవడమే కారణమని స్పష్టం చేశారు. ఈ నాలుగు నెలల్లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు సంబంధించి 74 ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆయన, కనీసం ఒక్క కేసులో అయినా శిక్ష పడి ఉంటే, ఇన్ని ఘటనలు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు.వైయస్ఆర్‌సీపీకి అండగా ఉన్నారన్న కారణంతో దళిత నాయకులను వేధిస్తున్నారని, భయపెడుతున్నారని.. ఆ దిశలోనే మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడిపై కేసులు బనాయించి వేధిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాలుగు నెలల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క మంచి సంఘటన అయినా ఉందా? అని ప్రశ్నించిన సుధాకర్‌బాబు.. లిక్కర్, శాండ్ కుంభకోణాలపై పెట్టిన శ్రద్ధలో ఒక్క శాతమైనా మహిళల రక్షణపై పెట్టాలని సూచించారు. మంత్రి లోకేశ్ తన స్థాయి మర్చి, వైయస్ జగన్‌గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్ మాటలు, చేతలు చూసి ఆయన్నే, పిల్ల రాక్షసుడు అంటున్నారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు.