విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు అండగా ఉంటాం

ప్లాంట్‌ను కాపాడుకోవడమే వైయస్సార్‌సీపీ లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు అండగా ఉంటామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్‌ జగన్ హామీ ఇచ్చారు. నర్సీపట్నం పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రోడ్డు మార్గంలో వెళ్తుండగా, మాజీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు క‌లిసి త‌మ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి, ఆ తర్వాత తమను మోసం చేస్తోందని వారు తెలిపారు. ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల విజ్ఞప్తిపై  వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ తమ వైఖరి ఒక్కటేనని, అది విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడమే అని ఆయన స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు తోడుగా ఉంటుందని, ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకూడదన్నదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆ దిశలో కృషి చేస్తామని స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు  వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ప్రధానంగా మూడు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు.
– స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేకంగా గనులు కేటాయించాలి.
– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి. సంస్థలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
 ఈ డిమాండ్లతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు.

Back to Top