విజయవాడ: వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రదారులు, పాత్రదారులంతా కూటమి నేతలే అన్నారు. మంగళవారం జోగి రమేష్‌ను వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ..`కుట్రపూరితంగా కల్తీ మద్యం కేసును జోగి రమేష్‌పై బనాయించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో చిత్తూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు కల్తీ మద్యం ఏరులై పారుతుంది. కల్తీ మద్యాన్ని అరికట్టమని, కూటమి చేస్తున్న తప్పులను అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన బీసీ నాయకుడు జోగి రమేష్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. లేనిది ఉన్నటు చూపించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ రోజు కూటమి అధికారంలో ఉందని తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. కూటమి నేతల ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ తంబాలపల్లి లో టీడీపీ తరఫున పోటీ చేసిన జయ చంద్ర రెడ్డి తన అఫిడవిట్ లో డిస్టలరీలు ఉన్నట్లు పేర్కొన్నారు .అప్పుడు కూటమి నేతలకు కళ్ళు పోయాయా? 16 నెలలు పూర్తయిన తర్వాత ఈ విషయం బయటకి రావడంతో వైయస్ఆర్‌సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు` అని వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు.