తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కా ర్యదర్శులు(పార్లమెంట్) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, పూడి శ్రీహరి, పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు. పార్టీ పదవులను ఒక బాధ్యతగా భావించి చిత్తశుద్దితో పనిచేయాలని, ఉత్సాహంగా పనిచేసే వారిని గుర్తించి పార్టీ కమిటీలలో ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. `నకిలీ మద్యంపై చంద్రబాబు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదు, చంద్రబాబు పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా. చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డంగా బుకాయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొందాం` అని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా మీకు ఇచ్చిన పదవులు అంటే ఒక జవాబుదారీతనం, పరిధి ఉండాలని మన నాయకుడు జగన్ గారు ఆలోచించి మీకు ఈ బాధ్యతలు అప్పగించారు. మీరు పార్టీ కేంద్ర కార్యాలయం, రీజనల్‌కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పరిశీలకులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసే సపోర్ట్ సిస్టమ్‌లో మీరు కీలకంగా ఉంటారు. వైయస్ఆర్‌సీపీలో లక్షలాది మంది క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, పార్టీని అభిమానించే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఉవ్వెత్తున ఎగిసి పడి మనం పోరాటాలు చేస్తున్నాం. సమర్ధవంతంగా పనిచేసే వారిని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించి ముందుకెళుతున్నాం. చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దానిని ధీటుగా ఎదుర్కుందాం. మనం సంస్ధాగతంగా బలోపేతం అయినప్పుడే ఇవన్నీ ధీటుగా ఎదుర్కోగలుగుతాం. గ్రామాలు, వార్డులలో కమిటీల నియామకంపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టినప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి, ప్రతి అనుబంధ విభాగం క్రియాశీలకంగా పనిచేయాలి, మీరంతా కీలక బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి తగిన విధంగా పనిచేయాల్సి ఉంది. నియోజకవర్గంకు పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు కళ్ళు చెవులులా పనిచేయాలి. ఇందుకు అవసరమైన యాప్‌ను కూడా సిద్దం చేశాం. డేటా ప్రొఫైలింగ్ జరుగుతుంది. మీకు అప్పగించిన బాధ్యతలు పూర్తిస్ధాయిలో చిత్తశుద్దిగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేయాలి. పార్టీ సంస్ధాగత నిర్మాణంపై మనం దృష్టిపెట్టడం వల్ల పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. కమ్యూనికేషన్ అనేది విస్తృతంగా పెరగడం వల్ల దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తిస్ధాయిలో సిద్దంగా ఉందాం. పార్టీ కోసం ఉత్సాహంగా పనిచేసేవారికి కమిటీలలో తగిన ప్రాధాన్యతనిచ్చి వారి సేవలను వినియోగించుకుందాం, పార్టీ కమిటీలు, సంస్ధాగత నిర్మాణం విషయంలో పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలను మోడల్ గా తీసుకుని ముందుకెళ్ళాలి. నకిలీ మద్యంపై చంద్రబాబు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారు, సడెన్‌గా ఒకడు ఆఫ్రికానుంచి వస్తాడు, అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు, అతని వీడియో బయటికి వస్తుంది, జోగి రమేష్ పేరు చెబుతాడు, అతను చెప్పినందుకే చేశానంటాడు, వెంటనే ఈ రోజు కానీ రేపు అతని పేరు ఈ కేసులో చేర్చినా చేరుస్తారు. అడ్డంగా దొరికామనే భయంతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి మద్యం కల్తీనా లేక ఒరిజినల్ఆ తెలుసుకోవడానికి యాప్ పెట్టడమంటే దాని అర్ధం కల్తీ జరిగిందనే కదా, బెల్ట్ షాప్‌లు ఉన్నాయని ఒప్పుకున్నారు. కల్తీ మద్యం అసలు మద్యంలా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారతదేశంలో మొదటిసారి ఒక సీఎం ఇలా యాప్ పెట్టడం చూస్తున్నాం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాం, ఆ దుకాణాలకు వచ్చిన మద్యం ఏ డిస్టిలరీ నుంచి వచ్చిందనేది, దాని అమ్మకం జరిగితేనే డిస్టిలరీకి డబ్బులు వెళ్ళే విధంగా క్యూఆర్ కోడ్ పెట్టాం. పక్కాగా పకడ్భందీగా లిక్కర్ సేల్స్ జరిగాయి. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యం డోర్ డెలివరీ చేస్తుంది. 24 గంటలు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు పెట్టి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఉచితంగా చేస్తే ప్రజలకు నష్టమంటున్నాడు చంద్రబాబు, పీపీపీలో మెడికల్ కాలేజీలు మంచిదని చెబుతున్నాడు, తను చేస్తున్న తప్పును కూడా బలంగా చెబుతున్నాడు. వైయస్ జగన్ గారు ప్రజలకు చేసిన మంచి స్పష్టంగా కనిపిస్తుంది. మీరంతా మీ గళాన్ని బలంగా వినిపించాలి. మనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలి.