నకిలీ మద్యం స్కామ్ లో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, 

సిట్ కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అన్నీ చంద్రబాబే

నకిలీ మద్యంపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు

లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం, చంద్రబాబు, లోకేష్ సిద్దమా  ?

సవాల్ విసిరిన మాజీ మంత్రి జోగి రమేష్

ఇబ్రహీంపట్నం లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేశ్.

నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రబాబు చిల్లర రాజకీయాలు

లై డిటేక్టర్ పరీక్షకు నేను సిద్దం

చంద్రబాబు, లోకేష్ సిద్దమా?

కనకదుర్గమ్మ తల్లి, తిరుమల వెంకన్నపై నా కుటుంబంతో కలిసి ప్రమాణానికి సిద్దం

చంద్రబాబు, లోకేష్‌లు తమ కుటుంబాలతో ప్రమాణానికి సిద్దంగా ఉన్నారా?

సూటిగా ప్రశ్నించిన జోగి రమేష్

అసలు సీబీఐ దర్యాప్తును అడిగిందే మేము

దానికి చంద్రబాబు భయపడ్డాడు

తన జేబు సంస్థ అయిన సిట్‌ను పెట్టుకున్నాడు 

కష్టడీలో ఉన్న జనార్థన్ ఏ రకంగా వీడియో రిలీజ్ చేయగలుగుతాడు?

జనార్థన్ తొలి వీడియోలో నా పేరు లేదు కదా?

కనీసం రిమాండ్ రిపోర్ట్‌లోనూ నా ప్రస్తావన లేదు

ఇప్పటికిప్పుడు నా పేరును చెప్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు

సిగ్గు వదిలేస్తేనే ఇలాంటి రాజకీయాలు చేయగలరు.

మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్

ఇబ్రహీం పట్నం: నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఇబ్రహీం పట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో నిందితుడు జనార్ధన్ తో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసలు ఈ కేసులో  కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబేనని స్పష్టం చేశారు. తన మీద వచ్చి ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమన్న జోగి రమేష్... అందుకు చంద్రబాబు, లోకేష్ లు సిద్ధమా అని సవాల్ చేశారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే...

గత వారం రోజులుగా కల్తీ మద్యం  కేసులో సీబీఐ విచారణ చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ విచారణకు ఆదేశించారు. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అయ్యే విచారణ కాదు... మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేశాం. దీంతో చంద్రబాబు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నా పేరు తీసుకొచ్చారు. ఈ కేసులో నా పాత్ర ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. 

● దైవ సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమా ?

నకిలీ లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను నా భార్యా బిడ్డలతో వస్తాను. చంద్రబాబు, లోకేష్  లకు దమ్ముంటే... శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి.. ప్రమాణం చేయగలరా? విజయవాడ దుర్గమ్మ సన్నిధిలోనైనా ప్రమాణం చేస్తారా?  ఈ ఛాలెంజ్ కి మీరు సిద్ధమా ? కల్తీ మద్యం కేసుతో నాకు ఏ రకమైన సంబంధం లేదు. నారా వారి సారా రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారు. ప్రతి మద్యం షాపులోనూ, బెల్టుషాపుల్లోనూ చివరకి ఇంటింటికీ రేషన్ పంపిణీలా కల్తీ మద్యాన్ని పంపిస్తున్నాడని మా పార్టీ తరపున ఆందోళన చేశాం. అందుకే మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. 

● డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా...

కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రిమాండ్ లో ఉన్న జనార్ధన్ తో వీడియో విడుదల చేయించారు. 
వాస్తవానికి రిమాండ్ రిపోర్టులో కానీ నా పేరు ఎక్కడా లేదు. కానీ జనార్ధన్ ను బెదిరించి, ఆయన కుటుంబ సభ్యులను హింసించి నా పేరు చెప్పించడం ద్వారా అత్యంత దిగజారుడు రాజకీయాలకు దిగారు. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తితో బలవంతంగా నా పేరు చెప్పించారు. రిమాండ్ రిపోర్టులో లేని పేరు కస్టడీలో ఎలా వచ్చింది?.  మీరు చేస్తున్న దుర్మార్గాలను ఎండగడుతున్నానన్న అక్కసుతో నా మీద బురద జల్లి ఈ కేసులో ఇరికించాలని చేస్తున్న నీ దుష్ట ప్రయత్నాని రాష్ట్ర ప్రజలు కచ్చితంగా తెలుసుకుంటారు.  ఎల్లకాలం అధికారంలో  ఉంటామని భ్రమల్లో ఉండొద్దు లోకేష్. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్లడంతో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ నన్ను ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు.

● ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు...

మీరు ఎన్ని కేసులు పెట్టినా మీ అక్రమాలను, మీరు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించడం ఆపేది లేదు. నెల రెండు నెలలో మీరు జైల్లో పెట్టి మీ క్షణికానందం తీర్చుకున్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరన్న విషయం చంద్రబాబు గుర్తించుకోవాలి. మీ తప్పుడు కేసులను భయపడేది లేదు. నేను పుట్టిన గడ్డ కృష్ణా జిల్లాలోనే ఉంటాను. ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కుటీర పరిశ్రమల్లా కల్తీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి  అక్రమ మద్యం వరదలా పారిస్తుంటే.. దానిపై  మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే...  దానికి సమాధానం చెప్పలేక మాపై తిరిగి బురదజల్లుతున్నారు. ప్రజలు పరిపాలన చేయమని మీకు అధికారం ఇస్తే.. అడ్డగోలుగా వారిని దోచుకుంటున్నారు. మీరు సీటు ఇచ్చి తంబళ్లపల్లెలో పోటీ చేసిన జయచంద్రారెడ్డే కల్తీ మద్యానికి ఆద్యుడు. ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన మీరు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నాపై బురద జల్లుతున్నారు. ఒక తప్పుడు వీడియోను సృష్టించి... నన్ను జైల్లో పెడితే మూడు, నాలుగు జైల్లో పెట్టగలరు. తద్వారా మీ రాక్షసానందం తీరవచ్చు కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తు పెట్టుకొండి. దమ్ముంటే ధైర్యంగా నేరుగా ఎదుర్కొండి.  వైయస్సార్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా.. స్పష్టం చేస్తున్నాను. మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. మీ దుర్మార్గాలను ఎండగడుతూనే ఉంటాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. 

నాపై వచ్చిన ఆరోపణలు మీద సత్యశోధన పరీక్షలు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు నా ఛాలెంజ్ కి సమాధానం చెప్పాలి. 45 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు అత్యంత చిల్లర రాజకీయాలను పాల్పడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో అరెస్టులు చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మీ రెడ్ బుక్ కు ఫైర్ పుట్టించడం ఖాయం. దమ్ముంటే  నా మాటలకు స్పందించాలి.  

 కల్తీ లిక్కర్ స్కామ్ లో అక్రమ మద్యం నిల్వలను స్వయంగా నేను మీడియాకు ఇదే నారా వారి సారా అని చూపిస్తే...  కేసులో నిందితుడైన జనార్ధన్ ను , ఆయన కుటుంబ సభ్యులను హింసించి నా పేరు మీద వీడియో విడుదల చేయించారు. జనార్ధన్ తో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవనిఇది చంద్రబాబు సృష్టించిన కట్టు కథ అని జోగి రమేష్ తేల్చి చెప్పారు.  రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనించాలని  విజ్ఞప్తి చేశారు.

Back to Top