తాడేపల్లి: చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన అంతా మోసమేనని మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదంటూ విమర్శించారు వైయస్ జగన్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయన్నారు. గోరు ముద్దు గాలికి ఎగిరిపోయిందని, ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని వైయస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకూ వసతి దీవెన, విద్యా దీవెను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడరని వైయస్ జగన్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చంద్రబాబు 100 రోజుల పాలనను తూర్పారబట్టారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ.. రాజకీయాల కోసం దేవుడ్ని కూడా వాడుకునే నైజం బాబుది అంటూ వైయస్ జగన్ దుయ్యబట్టారు. ప్రెస్‌మీట్‌లో వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. స్టిక్కర్లు అతికించాలా!: చంద్రబాబు 100 రోజుల పాలనను మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ అబద్ధాల మూటగా అభివర్ణించారు. వంద రోజుల తర్వాత ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేని దోషిగా ఇవాళ చంద్రబాబు ప్రజల ముందు నిలబడుతున్నాడని ఆయన వెల్లడించారు. అయినా తనది మంచి ప్రభుత్వమని సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్లు అతికించాలన్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోసం తప్ప మరేం లేదు: ఎన్నికల ముందు చంద్రబాబు, వాళ్ల పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి.. చిన్న చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15వేలు అని, ఆ పిల్లల తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్ల వయసు పైబడిన వాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు బయటకు వస్తే నీకు ఏటా రూ.36 వేలు అని, కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు ప్రతి ఏటా రూ.20 వేలు అంటూ ప్రచారం చేసి ప్రజల ఆశలతో, జీవితాలతో చెలగాటమాడారని శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచి సీఎం స్థానంలో కూర్చున్న తర్వాత వంద రోజుల్లో చంద్రబాబు చేసిందంతా మోసం తప్ప మరేం లేదని తేల్చి చెప్పారు. అన్నింటా తిరోగమనం: గత ప్రభుత్వం హయాంలో పిల్లలకు ప్రతి మూడు నెలలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేదని.. కానీ ఇవాళ మూడు క్వార్టర్లు పూర్తైనా విద్యాదీవెన, వసతి దీవెన ఊసేలేదన్నారు. ఫీజు కట్టుకోలేని పిల్లలపై కాలేజీల యాజమాన్యం సర్టిఫికెట్ల కోసం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో గోరుముద్ద గాలికి ఎగిరిపోగా.. టోఫెల్, సీబీఎస్‌ఈ కూడా తీసే కార్యక్రమం చేస్తూ.. పూర్తిగా బడులన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని గుర్తు చేశారు. ఇక ఆరోగ్య రంగం తీసుకున్నా అదే పరిస్థితి కనిపిస్తోందని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.2 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టారని, దీంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రజలకు సేవలందించే కార్యక్రమంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు. అత్యవసర సర్వీసుల్లో 108, 104 సిబ్బందికి చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి జీతాలు రావడం లేదని పేర్కొన్న ఆయన, ఆరోగ్య ఆసరా గురించి అయితే పట్టించుకునే నాధుడు లేడని చెప్పారు. వ్యవసాయ రంగం దారుణం: ఇక రైతులైతే చంద్రబాబు హయాంలో పూర్తిగా రోడ్డున పడ్డారని.. పెట్టుబడి సాయం కింద రైతులకు అందాల్సిన రూ.20 వేలు కూడా ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. గతంలో వైయస్సార్సీపీ హయాంలో ఇస్తున్న రైతు భరోసా ఎగ్గొట్టడంతో పాటు, రైతులకు ఇ–క్రాపింగ్ లేకుండా చేసి..ఆర్బీకే వ్యవస్ధను నిర్వీర్యం చేశారన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతుల క్యూలు కనిపిస్తున్నాయని చెప్పారు. రెడ్‌బుక్ పాలన: డోర్ డెలివరీ పెన్షన్, డోర్ డెలివరీ రేషన్ లేదని.. ప్రభుత్వంలో పారదర్శకత అంతకన్నా లేదని శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు. ప్రతి పనికీ జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని, ఎవరైనా వెళ్లకపోతే వారికి పథకాలు రద్దు చేస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. రెడ్‌బుక్ పాలనతో న్యాయానికి పాతరేసి, ధర్మానికి రక్షణ లేకుండా ఆస్తులు ధ్వంసం చేస్తూ.. దొంగ కేసుల్లో ఇరికిస్తున్నారని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్: అన్ని రకాలుగా విఫలమైన ఈ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగిన అరాచక, ఆటవిక పాలన మీద ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తే.. దాన్ని డైవర్ట్ చేసేందుకు మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయని హెలికాప్టర్ పంపించిన విషయం గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గోరుముద్ద కార్యక్రమంలోనూ, గురుకుల పాఠశాలల్లోనూ, ట్రిపుల్ ఐఐటీల్లోనూ ఫుడ్ పాయిజన్ జరిగి.. పిల్లలు ఇబ్బంది పడుతుంటే.. చంద్రబాబు తొలిసారి సీఎం అయి, 30 ఏళ్లు గడిచాయంటూ.. సెలబ్రేషన్ చేశారని తెలిపారు. స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేశారని.. తనకు బాగా దగ్గర, బంధుత్వం ఉన్న ఈనాడు గ్రూప్‌లో మార్గదర్శి నేరాలను బయటపెట్టారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వేధింపులకు చంద్రబాబు తెర తీశారన్నారు. ఆ వేధింపులపైనా విమర్శలు రావడంతో దాన్నుంచి డైవర్ట్ చేయడానికి ముంబై సినీ నటిని తీసుకొచ్చి కథ నడిపిస్తున్నారని తెలిపారు. విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని ముందే అలర్ట్ వచ్చినా సీఎం అధికారులతో కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదన్న ఆయన, ఆ వరదల్లో 60 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తేల్చి చెప్పారు. ఇవేవీ చేయకుండా విజయవాడ, ఏలేరులో మ్యాన్‌మేడ్ ఫ్లడ్స్ క్రియేట్ చేసి, వరదలు ముంచెత్తడంతో, దాన్నుంచి డైవర్షన్ కోసం బోట్లతో ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర చేశామంటూ ఆరోపణలు, విమర్శలు చేశారని గుర్తు చేశారు. నిజానికి ప్రభుత్వం చేస్తున్న ఇసుక మాఫియాలో భాగంగా అక్కడ పెట్టుకున్న బోట్లు కొట్టుకుని వస్తే.. దాన్ని రాజకీయం చేస్తూ.. ఆరోపణలు చేశారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నం స్కామ్‌లపై ఆందోళన జరుగుతుంటే.. వాటి నుంచి డైవర్షన్ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారని అన్నారు. మరో దారుణ డైవర్షన్: కోట్లాది భక్తుల మనోభావాలతో ఆట: చివరికి చంద్రబాబు వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి చంద్రబాబు మరో డైవర్షన్‌కు తెర లేపారని శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు. ప్రజల మనస్సుని డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు చేస్తున్న అతి దుర్మార్గమైన ఆలోచనే ఈ కట్టుకథ అని చెప్పారు. ఇంత దుర్మార్గమైన పనికి పాల్పడడం ధర్మమేనా అని నిలదీశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని మాట్లాడ్డం దారుణమన్నారు. సూపర్‌సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారన్న భయంతో, దుర్మార్గమైన కుట్రకు పాల్పడుతున్నారన్న శ్రీ వైయస్ జగన్, రాజకీయాల కోసం చివరకు దేవుణ్ని కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచన చేసే దుర్మార్గమైన మనస్తత్వం కేవలం చంద్రబాబుకి మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. తిరుపతి లడ్డూ తయారీలో నాసి రకం నెయ్యి, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారంటూ... చంద్రబాబు ఎంతో దారుణ విమర్శ చేస్తున్నారన్న ఆయన, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్దాలు ఆడడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు. నెయ్యి, సరుకుల సేకరణలో పక్కా వ్యవస్థ: నిజానికి నెయ్యి సేకరణ ఎలా జరుగుతుంది? దాని విధివిధానాలు ఏమిటి? అందరూ తెలుసుకోవాలన్నారు. తిరుమలలో నెయ్యి సేకరణ రెగ్యులర్‌గా జరుగుతుందని.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిస్తే.. కంపెనీలు కోట్ చేస్తాయని.. వాటిలో ఎల్–1గా ఎవరు ఉంటే, బోర్డు దాన్ని ఆమోదిస్తుందని తెలిపారు. ఇది రొటీన్‌గా జరిగే కార్యక్రమం అని గుర్తు చేసిన శ్రీ వైయస్ జగన్, కొత్తగా నియమాలు ఎవరూ మార్చలేదని స్పష్టం చేశారు. ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూకి ఎంత ప్రాశస్త్యం ఉందో అందరికీ తెలుసన్న శ్రీ వైయస్ జగన్, దాని కోసం సరుకుల సేకరణ కూడా ఎప్పుడూ రొటీన్‌గా, పక్కా పద్ధతిలో జరుగుతుందని తెలిపారు. లడ్డూ తయారీకి మెటేరియల్ ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు, వారు ఎన్‌ఏబీఎల్ (నేషనల్‌అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్) సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అలా దాంతో వచ్చిన ట్యాంకర్ నుంచి మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారని.. అవన్నీ పాస్ అయితేనే, ఆ ఇంగ్రేడియంట్స్‌ను కానీ, నెయ్యిని కానీ అనుమతించి, టీటీడీ ప్రసాదంలో వాడతారని చెప్పారు. లేకపోతే వాటన్నింటినీ వెనక్కు పంపిస్తారని తెలిపారు. మరి అలాంటప్పుడు కల్తీ నెయ్యి వాడారని, అవి నాసి రకం అని చెప్పడం అబద్ధం కాదా? అది ధర్మమేనా? న్యాయమేనా? అని శ్రీ వైయస్ జగన్ ప్రశ్నించారు. చాలాసార్లు వెనక్కు పంపారు: ఈ విధానం కూడా కొత్తగా వచ్చిన నియమం కాదని, దశాబ్దాలుగా ఉన్న నిబంధనలే అని పేర్కొన్న శ్రీ వైయస్ జగన్, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు ఇలా నెయ్యి, ఇతర సరుకులను వెనక్కి పంపించగా.. ఆ తర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా 2019–24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్టులో మంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లను వెనక్కు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే తిరుమలలో ఇలా ఒక గొప్ప వ్యవస్థ, పద్ధతి, సంప్రదాయం ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, చంద్రబాబు అబద్దానికి రెక్కులు కట్టి, జరగనిది జరిగినట్టు చెప్పడం అత్యంత దారుణమన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి వాడారని, లడ్డూలు తయారు చేశారని, లడ్డూలు ప్రజలు తిన్నారని చెప్పడం అంత దారుణంగా మాట్లాడడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ఈ రిపోర్టులు ఎవరి హయాంలోనివి?: ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకో విషయం చెప్పాలంటే.. ఇప్పుడు రిపోర్టు వచ్చిన శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో చూడాలన్నారు. చంద్రబాబు సీఎంగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేస్తే.. అదే రోజు టీటీడీకి ఒక ట్యాంకర్ వస్తే.. జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారని.. మూడు టెస్టుల తర్వాత, రిపోర్టులు బాగా రాలేదు కాబట్టి, ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు)కి పంపిస్తే.. వారు జూలై 23న నివేదిక ఇచ్చారని తెలిపారు. ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?: మరి 2 నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్, చంద్రబాబు 100 రోజుల పాలన తర్వాత, సూపర్‌సిక్స్ గురించి ప్రజలు నిలదీస్తారన్న భయంతో, వారి దృష్టి మరల్చేందుకు, రెండు నెలల తర్వాత, ఆ రిపోర్టులోని అంశాలు ప్రస్తావించి.. దాన్ని వక్రభాష్యం చేస్తూ.. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని, ఇది ధర్మమేనా? అని నిలదీశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..: ఈ రిపోర్టు చూస్తే.. అందులో స్టాండర్డ్ (ఎస్) వాల్యూ ఉండాలి కానీ, డీవియేషన్ ఉందని.. అలా ఉంటే శాంపిల్స్ రిపోర్ట్ ప్రకారం అందులో ఏమేం ఉండే వీలుందన్న అవకాశాలతో ఉన్న నివేదికను ఆయన చదివి వినిపించారు. ఏదైనా కానీ, ఒక రొబొస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉన్నందుకు గర్వపడాలన్న శ్రీ వైయస్ జగన్, టీటీడీలో స్వామి వారి దగ్గర ప్రసాదం తయారు కావడం గొప్ప పరిణామమని, అక్కడి ప్రాక్టీసెస్ ఎంత గొప్పవో అందరికీ వివరించాలన్నారు. కానీ, మనం ఏం చేస్తున్నామని చంద్రబాబును ప్రశ్నించారు. అక్కడ పక్కాగా ఒక వ్యవస్థ ఉన్నా.. ఇలా పచ్చిగా అబద్ధానికి రెక్కలు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారిని అభాసు పాల్జేస్తున్నారు: నెయ్యిలో నాణ్యత ఉంటేనే ట్యాంకర్‌ను అనుమతించే ఒక పక్కా వ్యవస్థ ఉన్నా.. అబద్ధాలకు రెక్కలు కడుతూ టెస్టుల్లో ఫెయిలైనా.. కల్తీ నెయ్యి వాడారని, లడ్డూలు తయారు చేసి భక్తులకు ఇస్తే, వాటిని భక్తులు తిన్నారని ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి టీటీడీని, శ్రీ వెంకటేశ్వరస్వామి గుడిని అపవిత్రం జేస్తూ.. అక్కడ ప్రసాదం తయారు చేసే ప్రక్రియను అభాసు పాల్జేస్తున్నారని ఆవేదన చెందారు. అంటే మన గుడిని, మన వెంకటేశ్వరస్వామిని మనం తగ్గించుకుంటున్నామని.. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతాయా అని సూటిగా ప్రశ్నించారు. మరి వారెందుకు ఇవ్వలేదు?: వారు మరో దుష్ప్రచారం చేస్తూ.. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కెఎంఎఫ్)కు చెందిన నందిని బ్రాండ్‌కు ఉద్దేశపూర్వకంగానే నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపించండపై శ్రీ వైయస్ జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరైనా టెండర్ వేయొచ్చన్న ఆయన, ఎల్–1కే కాంట్రాక్ట్ ఇస్తారని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ బ్రాండ్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, తమ హయాంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు అదే కెఎంఎఫ్‌కు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు. టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్ చేస్తారు?: ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... జూలై 23న ఎన్డీడీబీ రిపోర్టు.. అంటే రెండు నెలల క్రితం వస్తే.. ఏ అధికారి వివరణ ఇవ్వకుండా.. టీడీపీ ఆఫీస్‌లో ఆ రిపోర్టును ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. అది కూడా చంద్రబాబు 100 రోజుల పాలన మంచి అంటూ ప్రకటనలు ఇచ్చిన రోజున ఎలా విడుదల చేస్తారన్నారు. ఈ పద్ధతి ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. టీటీడీ బోర్డులో ప్రసిద్ధులు..: వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో చాలా మార్పులు తీసుకొచ్చామని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. టీటీడీలో ఉన్న ల్యాబ్‌ను సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) సహకారంతో ఆధునీకరించామని.. అక్కడి నుంచి నిపుణులను కూడా తీసుకొచ్చామని చెప్పారు. టీటీడీ బోర్డు కూర్పు కంటే మంత్రివర్గం కూర్పు చాలా ఈజీ అని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. టీటీడీ బోర్డులో పదవి కోసం కేంద్ర మంత్రులు మొదలు, పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా సిఫార్సు చేస్తారని, అంత కష్టమైన కార్యక్రమమని చెప్పారు. ఆ స్థాయిలో ప్రసిద్ధులను బోర్డులో నియమిస్తామని, అలాంటి వ్యక్తులతో కూడిన బోర్డు ఈ కాంట్రాక్ట్లను ఆమోదిస్తారని.. అంత మంచి విధానం, వ్యవస్థ, దేవుడికి సేవ చేయాలన్న తపన ఉన్న వాళ్లు బోర్డులో ఉంటారని తెలిపారు. బోర్డు ఛైర్మన్‌గా పని చేసిన వారి గురించి చెప్పాలంటే.. వైవీ సుబ్బారెడ్డిగారు ఏకంగా 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్నారని.. ఆయన అంత భక్తుడని తెలిపారు. అదే విధంగా కరుణాకర్‌రెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా విలువలు ఉన్న వారన్నారు. తప్పుడు సంకేతాలు: తిరుమల, తిరుపతిలో అంత మంచి వ్యవస్థ ఉంటే.. మనంతట మనమే మన సంస్ధలను తగ్గించుకుంటూ.. వక్రభాష్యం తీస్తూ... మన దేవుడ్ని తగ్గించుకుంటూ బయట ప్రపంచానికి తప్పుడు సంకేతాలు ఇస్తు్తన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప విధానాలున్నా.. వాటిని చెప్పుకోలేక అక్కడా బురద చల్లుతూ దేవుణ్ని కూడా రాజకీయం చేయడం కేవలం చంద్రబాబుకే సాధ్యమని మండిపడ్డారు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో టీటీడీలో..: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో అనేక మంచి కార్యక్రమాలు, పనులు జరిగాయని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టామని, సొంతంగా స్వచ్ఛమైన వెన్న, నెయ్యి తయారీ కోసం కొండ మీద గోశాల ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీవారి ఆలయంలో అర్చకులు జీతాలు రెట్టింపు చేయడంతో పాటు, ప్రసాదాలు తయారు చేసే పోటులో కార్మికుల సర్వీస్ క్రమబద్ధీకరించి, వారి జీతాలు పెంచామని చెప్పారు. చంద్రబాబు దేవాలయాలను కూల్చివేస్తే.. అనేకచోట్ల జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించామన్నారు. వైజాగ్, అమరాతిలో కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు కట్టామన్నారు. భువనేశ్వర్, హైదరాబాద్, జమ్మూకశ్మీర్, చెన్నైతో సహా దేశంలోని పలు చోట్ల, చివరకు అమెరికాలో కూడా వెంకటేశ్వరస్వామి ఆలయాలు కట్టింది వైయస్సార్సీపీ ప్రభుత్వమేనని చెప్పారు. టీటీడీలో 9 వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వమే ఇచ్చిందని.. చంద్రబాబు తన పాలనలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. మఠాధిపతులతో మూడు విద్వత్ సదస్సులు కూడా నిర్వహించింది కూడా తమ హయాంలోనే అని చెప్పిన ఆయన, రెండుసార్లు వైయస్సార్‌గారి హయాంలో జరిగితే, ఒకసారి తమ హయాంలో నిర్వహించామన్నారు. టీడీడీలో ఏదైనా మంచి జరిగింది అంటే.. ఆనాడు వైయస్సార్‌గారి హయాంలోనూ, ఆ తర్వాత తమ ప్రభుత్వ హయాంలోనే అని ఇది వాస్తవమని స్పష్టం చేశారు. ప్రధానికి, సీజేఐకి లేఖలు రాస్తాం: ఏ తప్పూ జరగకపోయినా జరిగినట్టు చూపించి మన రాష్ట్ర పరువును, శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయ పరువును బజారు కీడుస్తున్న చంద్రబాబు వైఖరిని అందరూ గుర్తించాలని స్పష్టం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం, దురుద్దేశంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం ధర్మమేనా? అన్న ఆయన, దీనిపై చంద్రబాబుకు అక్షింతలు వేయాలని చెప్పి.. ప్రధానమంత్రితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కూడా లేఖలు రాస్తామని వెల్లడించారు. నిజమా? కాదా? బేరీజు వేసుకొండి: ఎవరైనా మంచి చేసి ప్రజల మన్ననలు పొందాలని.. కానీ ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్దాన్ని అమ్మడం. ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద చల్లడం? ఎంత వరకు న్యాయమని జగన్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను చెప్పినవి నిజమా? అబద్ధమా? అని మీరే (విలేకరులు) వెరిఫై చేసుకోవాలని సూచించారు. తాను చెప్పే ప్రతి మాట నిజమని, ప్రతిదీ లాజిక్‌గా చెబుతున్నానన్నారు. ఇవన్నీ తాను చెప్పక ముందు, వారు చేసిన దుష్ప్రచారం, చెప్పిన అబద్ధాలు.. అన్నీ బేరీజు వేసుకొని తేడా గమనించాలని కోరారు. రాజకీయాల కోసం ఇంతగా దిగజారడం ధర్మమేనా? న్యాయమేనా? అని ప్రశ్నించిన జగన్ రాజకీయాలు చేయాలంటే నేరుగా చేయాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం: మెడికల్ కాలేజీలపై మాట్లాడుతూ... ఇప్పటికే రూ.2400 కోట్లకు పైగా ఖర్చు పెట్టామని.. 5 కాలేజీలు ప్రారంభం కాగా.. మరో 5 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభమై ఉండేవని.. ప్రభుత్వం కట్టిన బిల్డింగ్‌లు వారికి చూపెడితే సరిపోయేదన్నారు. అన్ని పనులు జరిగిన కాలేజీలను ఏకంగా ప్రై వేటుపరం చేయాలనుకోవడం ఎంత వరకు సబబు?. ఎంతవరకు ధర్మమని?. ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక మెడికల్ కాలేజీ వస్తే, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా వచ్చి దాని వల్ల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయని చెప్పారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ సేవలు అందుబాటులోకి వస్తే, పోటీ తత్వం ఏర్పడి, ప్రై వేటు ఆస్పత్రులు కూడా రేట్లు తగ్గిస్తాయన్నారు. దీంతో పాటు ప్రతి ప్రభుత్వ వైద్య కాలేజీలో 150 సీట్లు అదనంగా పెరిగి... పిల్లలు ఇచ్చే ఫీజు, అక్కడే ఖర్చు చేస్తారన్నారు. దీనివల్ల ప్రజలకు, పిల్లలకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాంటి కాలేజీలను స్కామ్ కోసం ప్రైవేటు వారికి అమ్మాలనుకోవడం ధర్మం కాదన్నారు. బీజేపీ కూడా గుర్తించాలి: ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీద.. బీజేపీకి పూర్తి సమాచారం ఉండకపోవచ్చన్న శ్రీ వైయస్ జగన్, చంద్రబాబు పూర్తిగా పచ్చి అబద్ధాలు, మోసాల వ్యక్తి అని.. తాను చెబుతున్నవి వాస్తవాలో కాదో.. టీటీడీ బోర్డులో ఉన్న బీజేపీకి చెందిన వారు కూడా ఈ ప్రొసీజర్ గ్గురించి తెలుసుకోవాలన్నారు. అప్పుడు వారు చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టాలన్నారు. బీజేపీ నేతల్లో సిన్సియారిటీ ఉంటే, చంద్రబాబుకు అక్షింతలు వేయాలని, ఇది ధర్మమేనా? అని అడగాలని సూచించారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు: టీటీడీలో జరిగిన విషయం తెలియని వారికి భావోద్వేగాలు పెరుగుతాయని.. అలా భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంతవరకు ధర్మమని నిలదీశారు. చంద్రబాబు అనే వ్యక్తికి దేవుడి మీద ఎప్పుడూ భక్తి ఉండదని, దేవుణ్ని కూడా రాజకీయాల కోసం వినియోగించుకునే అత్యంత హేయమైన మనసున్న వ్యక్తి అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు ఎప్పుడూ భక్తి ఉండదని.. టీటీడీకి ఎక్కడైనా చెడు జరిగితే, కేవలం చంద్రబాబు హయాంలోనే జరుగుతుందని.. ఎందుకంటే ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేదని వైయస్ జగన్ తేల్చి చెప్పారు.