వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సంబ‌రాలు

 తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన తిరుగులేని విజయాన్ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పూర్తి సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి క్లీన్ స్వీప్  ఫలితాలు తేటతెల్లమైన అనంతరం మధ్యాహ్నం నుంచి వైసీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఓవైపు కనకతప్పెట్లు మరోవైపు బాణాసంచా పేలుళ్ల నడుమ మిఠాయిలు పంచుకుంటూ నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు కట్టిన పట్టంగా ఈ విజయాన్ని అభివర్ణించారు. ఈ ఫలితాలను తాము ముందే ఊహించినట్లు చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందన్నారు. ఇకనైనా పిచ్చి మాటలు మానుకోవాలని సూచించారు. ఈ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహించి చంద్రబాబు కంపెనీ ఇప్పటి నుంచైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని లేళ్ళ అప్పిరెడ్డి హితవు పలికారు.

వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మెరుగు నాగార్జున మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. అందుకే ఈ ఎన్నికలు సరైన సమయంలో జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచినట్లు వివరించారు. కానీ గత ప్రభుత్వ హయాంలోనే గడువు ముగిసినా... గెలవలేమని చంద్రబాబు ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేసారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పెట్టాలని కృషి చేసినా... చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్ట శక్తులు అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. అర్దాంతరంగా వాయిదా వేయడం నుంచి ఎన్నికలు జరిగినా ఫలితాలను ప్రకటించకుండా చేశారని విమర్శించారు. అన్ని అవరోధాలు దాటుకుని ఈ రోజు మంచి ఫలితాలు వెల్లడయ్యాయని నాగార్జున తెలిపారు.

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈ ఎన్నికలను తాము బహిష్కరించాం అని మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలకు సిగ్గులేదన్నారు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా... ఫలితాల్లో మార్పేమీ లేదని గుర్తు చేశారు. కుప్పం కూడా కుప్పకూలి పోయిందనీ... చంద్రగిరి శంకరగిరి మాన్యాలు పట్టిందనీ... ఎద్దేవా చేసారు. ఇక టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉందన్న నిజం తెలుసుకోలేకపోతే చంద్రబాబు ఖర్మ అని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు టీడీపీ మొత్తం రాజీనామా చేసినా... ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసి వైసీపీ గెలవడం తధ్యమని అంబటి రాంబాబు తెలిపారు.

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ జనరంజక పాలనకు ఈ ఫలితాలు చక్కని నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఫలితం ఇలాగే పునరావృతం అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, ఈ విజయంతో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సీఎం పాలనకు సంపూర్ణంగా ప్రజామోదం లభించినట్లైందని తెలిపారు.

ఈ వేడుకల్లో చల్లా మధుసూధనరెడ్డి, పండుగాయల రత్నాకర్, జూపూడి ప్రభాకర్, నవరత్నాల నారాయణమూర్తి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top