తాడేపల్లి: రాష్ట్రంలో రోజురోజుకీ శాంతి భద్రతలు దిగజారిపోతుంటే కూటమి ప్రభుత్వానికి పట్టింపు లేకపోగా, 5 నెలల్లో 100 మందికి పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మంచి, చెడు పట్టించుకోక పోవడమే కాకుండా, ఎన్నికల హామీలు కూడా అమలు చేయకుండా, డైవర్షన్ పాలిటిక్స్ ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులను బనాయించి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. వీటన్నింటి నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించినట్లు పేర్ని నాని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని (వెంకట్రామయ్య), అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందన్న మాజీ మంత్రి, రెండేళ్ల క్రితం 41–ఏ నోటీసులు అందుకున్న కేసులను 307 సెక్షన్ కిందకు మార్చి, అక్రమంగా జైళ్లకు పంపి దారుణంగా వేధిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారిందని, కిరాతకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కూటమి నాయకుల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా పోలీసులకు లేకుండా పోయిందని చెప్పారు. పోస్టింగ్‌ల కోసం చట్టాలను అతిక్రమించి, వైయస్ఆర్‌సీపీ జెండా పట్టినా, ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నించినా.. అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆక్షేపించారు. ఈ పరిస్థితులన్నీ చూశాక, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతుందన్న నమ్మకం సన్నగిల్లిందని, పోటీ చేసే అభ్యర్థులకు ఓట్లడిగే స్వేచ్ఛను కాలరాసేలా భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని.. చివరకు గెలుపును కూడా ఓటమిగా మార్చే దౌర్జన్య విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికలు బహిష్కరించాలని వైయస్ఆర్‌సీపీ నిర్ణయించిందని పేర్ని నాని వెల్లడించారు.