వైయ‌స్ఆర్ జ్ఞాప‌కార్థం రాష్ట్ర‌స్థాయి వృష‌భ‌రాజ‌ముల బండ‌లాగుడు పోటీలు

పోటీల‌ను ప్రారంభించిన  కోట్ల హర్షవర్ధన్ రెడ్డి,  డాక్టర్ ఆదిమూలపు సతీష్

 

 కోడుమూరు : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోడుమూరు నియోజకవర్గ కేంద్రంలో వళ్లేలాంభదేవి తిరుణాల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్రస్థాయి వృషభరాజుల బండలాగుడు పోటీలు అట్ట‌హాసంగా ప్రారంభమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీ సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారితో కలిసి ఈ పోటీలను ప్రారంభించారు. ముందుగా కోడుమూరు పాత బస్టాండ్‌లోని కోట్ల సర్కిల్ నుంచి వళ్లేలాంభదేవి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.

అనంతరం ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయి పోటీలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చి పోటీలను తిలకించారు. హోరాహోరీగా సాగుతున్న ఈ పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. పల్లె సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా ఈ పోటీలు నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగానికి అపార ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. రైతుల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అదే బాటలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రైతులకు అండగా నిలిచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు.

డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయాలను కాపాడుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. రైతు కుటుంబాలకు ఉత్సాహం నింపే ఈ తరహా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. మళ్లీ జగనన్న పాలన రావాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Back to Top