తల్లికి వందనంలో ఆర్‌టీఈ విద్యార్థులకు అన్యాయం 

విద్యార్థుల సమస్యలని పరిష్కరించాలని క‌లెక్ట‌ర్‌కు వైయ‌స్ఆర్ స్టూడెంట్స్ యూనియ‌న్ నాయ‌కులు విన‌తి

అనంతపురం: విద్యా హక్కు చట్టం (RTE) 2009 లోని సెక్షన్ 12(1)C కింద విద్యా సంవత్సరం 2024-25 లో ఉచిత సీటును జిల్లాలో ఉండే ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నిరాకరించాయ‌ని, ప్ర‌భుత్వం త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం వ‌ర్తించ‌కుండా అన్యాయం చేసింద‌ని వైయ‌స్ఆర్ విద్యార్థి విభాగం నాయ‌కుడు మండిప‌డ్డారు. విద్యార్థుల సమస్యలని పరిష్కరించాలని కోరుతూ అనంత‌పురం జిల్లా ఇన్‌చార్జ్‌ క‌లెక్ట‌ర్‌కు వైయ‌స్ఆర్ స్టూడెంట్స్ యూనియ‌న్ నాయ‌కులు సోమ‌వారం విన‌తిప‌త్రం అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని మండి పడ్డారు. మంత్రి నారా లోకేష్ త‌న‌కు సంబంధించిన శాఖలో పట్టు కోల్పోయి సక‌ల శాఖలకి షాడో సీయం లా  వ్యవహరిస్తున్నారని  మండిప‌డ్డారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యవస్థని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్య కుంటు పడిందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రైవేట్,  కార్పొరేట్ విద్యాసంస్థల  బస్సుల్లో సంఖ్యకి మించి విద్యార్థులతో ప్రయాణం చేయిస్తున్నారన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అనుభవం కలిగిన వారిని మాత్రమే డ్రైవర్లు గా నియమించుకునేలా చర్యలు తీసుకోవాలని ఇన్ చార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మను కోరారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ విద్యార్ధి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, నగర అధ్యక్షులు కైలాష్ నగర కార్యదర్శి ఫయాజ్, వంశీ నాయుడు, చంద్ర మౌళి, రాహుల్ రెడ్డి, రఫీ, పులి కార్తికేయ, శేఖర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు

Back to Top