తాడేపల్లి: 2023 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా నిధులను నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ త్రైమాసికంలో అర్హులైన 18,883 జంటలకు గానూ రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి వధువుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. పేద తల్లిదండ్రులు పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యతకు అండగా నిలుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ‘వైయస్ఆర్ కళ్యాణమస్తు’, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు ‘వైయస్ఆర్ షాదీ తోఫా’ ద్వారా ఆర్థిక సాయాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది. నేడు విడుదల చేస్తున్న సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా కింద 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 267.20 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. దూదేకుల, నూర్ బాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా వైయస్ఆర్ షాదీ తోఫాతో సమానంగా లబ్ధిని రూ.1,00,000కు పెంచి అందిస్తోంది. ఈ వర్గాలకు చెందిన అర్హులైన గత లబ్ధిదారులకు కూడా పెరిగిన సాయాన్ని పథకం ప్రారంభం నుంచి బ్యాక్ డేట్‌తో వర్తింపజేస్తారు. వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫాకు అర్హత సాధించాలంటే వధూవరులిద్దరూ పదో తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. తల్లిదండ్రులు పిల్లలను చదివించడానికి ఈ నిబంధన దోహదం చేస్తుంది. పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన బాల్య వివాహాల నివారణకు ఉపకరిస్తుంది.