అసెంబ్లీ: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగుతోందని, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన విధంగా, అదే ప్రామాణికంగా వైయస్ జగన్ ప్రభుత్వమూ కొనసాగుతోందని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో సంక్షేమానికి, అభివృద్ధికి కేటాయింపులు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. సభాపతి తనకిచ్చిన సమయాన్ని వినియోగించుకోనీకుండా టీడీపీ సభ్యులు అడ్డుపడటాన్ని ఆయన తప్పు పట్టారు. పదే పదే తన ప్రసంగానికి అడ్డుపడుతున్న టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఈ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి కోసం స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళుతోందన్నారు కోన రఘుపతి. ఈ ప్రభుత్వంలో రాష్ట్ర క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ 31,000 కోట్లని, కానీ, గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసి, ఏ ఆస్తులు తయారు చేసిందో చెప్పగలదా? అని సవాల్ విసిరారు. కేపిటల్ ఎక్స్ పెండిచర్ కింద 31వేల కోట్లు ఖర్చు చేయడం వైయస్ జగన్ ప్రభుత్వంలోనే జరుగుతోందని, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం, ఆర్బీకే, వెల్ నెస్ సెంటర్, బల్క్ మిల్క్ సెంటర్ వంటి అసెర్ట్స్ ని నిర్మిస్తున్నామని తెలిపారు. మన బడి నాడు నేడు ద్వారా పాఠశాలలను తీర్చిదిద్దుతూ, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే టీడీపీ మాత్రం ఏమీ జరగడం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
వివిధ రంగాల్లో గత ఏడాది కంటే ఎక్కువగానే బడ్జెట్ కేటాయింపులు జరిగాయని తెలిపారు.
- ''బీసీ వెల్ఫేర్ కు జరిగిన కేటాయింపుల్లో 32.5% పెరుగుదల ఉంది. గత ఏడాది 29,143 కోట్లు బీసీ వెల్ఫేర్ కు ఖర్చు చేస్తే ఈ ఏడాది 38,620 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
- మున్సిపల్ ఎడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కోసం గత ఏడాది 8,796 కోట్లు వెచ్చిస్తే ఈ ఏడాది 6.6% పెరుగుదలతో 9,381 కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైంది.
- రోడ్లు మరియు భవనాలకు బడ్జెట్ కేటాయింపుల్లో 6.2% పెరుగుదల...గత ఏడాది బడ్జెట్ లో 8,581 కోట్లు వెచ్చిస్తే, ఈ బడ్జెట్ లో 9,118 కోట్లు ప్రతిపాదన చేసారు.
- DBT వెల్ఫేర్ స్కీమ్స్ కేటాయింపుల్లోనూ 10% పెరుగుదల
- ఎన్నో దేశాల ఎకానమీ దెబ్బతిని, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సందర్భంలో ఆర్థికవేత్తలు సూచించిన గొప్ప ప్రతిపాదనే DBT. అదే విధానాన్ని సీఎం జగన్ అనుసరిస్తూన్నారు.
- అనేక పథకాల ద్వారా పేదవాడు నిలదొక్కుకునేలా చేయూత ఇస్తున్నారు.
- గత ఏడాది కంటే అధికంగా వివిధ రంగాలకు బడ్జెట్ ప్రతిపాదనలు -
- హెల్త్ సెక్టార్ 3.2%, అగ్రికల్చర్ సెక్టార్ 3%, ఎడ్యుకేషన్ సెక్టార్ 7%
అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతిశీలంగా ముందుకు వెళుతుంటే ప్రతిపక్షాలకు ఈ వాస్తవాలు కళ్లకు కనిపించడంలేదన్నారు కోన రఘుపతి.