తాడేపల్లి: వరద బాధితుల పరామర్శ పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ యాత్ర చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి జిందాబాద్‌లు కొట్టించుకుంటున్నారని తప్పుపట్టారు. వరద బాధితుల గురించి మాట్లాడటం మరిచిపోయి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం వైయస్ జగన్‌ను ఎదుర్కొనే శక్తిలేకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభానికి గల కారణలను సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..: అంతులేని విష ప్రచారం: కరోనా రెండేళ్లపాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, ఎక్కడా ఏ ఒక్క పథకం ఆపకుండా సీఎం శ్రీ వైయస్ జగన్ అన్నీ అమలు చేశారు. దీంతో ఆయన పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగింది. అందుకే ప్రతి ఎన్నికల్లో ఆయన పార్టీకి ప్రజలు అపూర్వ విజయాలు అందిస్తున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చరిత్రహీనుడిగా మిగిలిన చంద్రబాబు, ఆయన పక్కవాయిద్యాలు వాయించే బృందం (దుష్ట చతుష్టయం), ఇంకా ఆ పక్కనున్న తైనాతీలు, కోరస్.. అందరూ ఏకోన్ముఖంగా ఒక దాడి. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది అనేది ప్రజల మనసుల్లో ఎక్కడానికి ఎంతటి విష ప్రచారానికి తెగిస్తున్నారు అనేది ప్రతిరోజూ చూస్తున్నాం. చివరకు పార్లమెంటులో ఒక ప్రశ్న వేసి, మూతి పగలగొట్టించుకున్నారు. 2014–19 మధ్య ఏకంగా రూ.1.62 లక్షల కోట్లకు లెక్కలు లేవని, కాగ్ అడిగితే రూ.51 వేల కోట్లకు మాత్రమే లెక్క చెప్పారని, స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానం చెప్పారు. దీంతో వారు తమ గోతిలో తామే పడ్డారు. ప్రజలను నమ్మించే ప్రయత్నం: తొలుత ఎన్టీ రామారావు అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత చంద్రబాబుకు సీఎం పదవి దక్కడానికి తానే కారణమని అనుకునే, రాజకీయంగా శాసించగలను అనుకుంటున్న ఈనాడు రామోజీరావు, ఈరోజుకూ అదే ఉందని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి రోజూ రాసిందే రాస్తున్నారు. దాన్ని తీసుకుని చంద్రబాబు, ఆయన పక్కవాద్యాలు మాట్లాడుతుంటే, ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు లక్ష్యాలుగా చిత్తశుద్ధితో పని చేస్తున్న జగన్‌గారిని దెబ్బ కొట్టే కుట్ర చేస్తున్నారు. అందుకే రోజువారీగా దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏదో వృథా జరుగుతోందని, కష్టకాలంలో అప్పులు పుట్టకూడదని, ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నాళ్లుగా అవే వార్తలు రాస్తూ, ఇవాళ ఏకంగా బ్యానర్ చేశారు. పరామర్శ పేరుతో రోడ్‌షో: ఇవాళ చంద్రబాబు వరదపీడిత ప్రాంతాల్లో పరామర్శ పేరుతో యాత్ర చేస్తున్నారు. రోడ్‌షో చేస్తున్నారు. చంద్రబాబు జిందాబాద్ అన్న నినాదాలు. ఎక్కడా చంద్రబాబు వరదల గురించి కూడా మాట్లాడడం లేదు. ఆయన ఒక మాట అన్నారు. ‘నేను అధికారంలో ఉంటే తుపాన్ కంటే నేనే ముందు వచ్చే వాడినని’.. నిజం చెప్పాలంటే ఆయనే ఒక తుపాన్. అంత వయసు వచ్చింది. ఎక్కడికి పోతున్నాం అనే కనీస స్పృహ కూడా లేకుండా వరదపీడిత ప్రాంతాల్లో విక్టరీ చేయి ఊపుతూ రోడ్‌షో చేస్తున్నాడు. బొకేలు తీసుకుంటున్నాడు. ఇంకా అక్కడా ఇదే మాట. రాష్ట్రం శ్రీలంక మాదిరిగా మారుతోందని. బడుల విలీనం పేరుతో పిల్లలను విద్యకు దూరం చేస్తున్నారని. నిన్న కూడా శ్రీలంక అన్నాడు. యథావిథిగా ఇవాళ ఈనాడులో పెద్ద ఐటెం వచ్చింది. బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట: చూస్తే భయపడే విధంగా ఈనాడులో వార్త రాశారు. రాష్ట్రానికి దాదాపు రూ.8.5 లక్షల కోట్ల అప్పు ఉందని రాశారు. ఇంకా నయం ఏ రూ.20 లక్షల కోట్ల అప్పు ఉందని రాయలేదు. బాధ్యతా రాహిత్యానికి ఇది పరాకాష్ట అని చెప్పాలి. ఎంతసేపూ చంద్రబాబును ఎలాగైనా అధికారంలో కూర్చోబెట్టాలి అన్నదే తపన. ఎందుకంటే ఆయన అధికారంలో ఉంటే, వారి దోపిడికి అవకాశం ఉంటుంది. వారికి మనుగడ. అందుకే ఈ కుట్రలు. నిత్యం సీఎంగారిపై అంతులేని విమర్శలు. అదే పనిగా ప్రభుత్వంపై దుష్ప్రచారం. అనంతరం శ్రీ దువ్వూరి కృష్ణ మాట్లాడుతూ..: రాష్ట్రాన్ని ఒక దేశంతో పోల్చొద్దు: ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక దేశాన్ని, ఒక రాష్ట్రంలో పోల్చకూడదు. ఎందుకంటే ఒక దేశానికి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎగుమతి, దిగుమతులు ఉంటాయి. విదేశీ మారకద్రవ్య నిధులు ఉంటాయి. అవి సరిపోకపోతే ద్రవ్యలోటు పెరుగుతుంది. తద్వారా దేశం అప్పులు పెరుగుతాయి. కానీ ఇవేవీ ఒక రాష్ట్రంలో ఉండవు. ఇక శ్రీలంకలో అసలు ఏం జరిగిందన్నది క్లుప్తంగా చూస్తే.. వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. పన్నుల తగ్గింపు. సేంద్రీయ సాగుకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, వ్యవసాయ ఉత్పత్తులు పడిపోవడంతో ఆహారానికి కొరత ఏర్పడింది. దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో దాదాపు 29 శాతానికి చేరడంతో పాటు, జీడీపీ 3.3 శాతానికి పడిపోయింది. శ్రీలంకలో విదేశీ అప్పు జీడీపీతో (ఎక్స్‌టర్నల్ డెబిట్ టు జీడీపీ) చూస్తే ఏకంగా 56 శాతానికి చేరింది. ఇంకా చెప్పాలంటే ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సిన అప్పులు చూస్తే.. జీడీపీలో కానీ, విదేశీ మారకద్రవ్యంలో చూస్తే అది 467 శాతం. అంటే ఆరోజు వారి దగ్గర విదేశీ మారకద్రవ్య నిధులు 1.93 బిలియన్ డాలర్లు ఉంటే, వారు వెంటనే తిరిగి చెల్లించాల్సిన రుణం 4 బిలియన్ డాలర్ల వరకు ఉండడంతో, వారు రుణం చెల్లించడంలో విఫలమయ్యారు. అయితే ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. అందుకే దేశం వేరు. ఒక రాష్ట్రం వేరు. డెట్ టు జీడీపీ: 2013–14లో కేంద్రం అప్పు జీడీపీలో (డెట్ టు జీడీపీ) 50 శాతం ఉండగా, అది 2020–21 నాటికి 61 శాతానికి చేరింది. ఆ తర్వాత కేంద్రం తీసుకున్న కొన్ని జాగ్రత్తల వల్ల అది కాస్త తగ్గి, 57.42 శాతానికి చేరింది. రాష్ట్రంలో కూడా కేంద్రం తరహాలో చర్యలు తీసుకోవడం వల్ల, ఇక్కడ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అత్యంత తక్కువగా 2.1 శాతం నమోదైంది. రాష్ట్ర ఖర్చుల కోసం చేసే అప్పు ద్రవ్యలోటు. అయితే దానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఒక పరిమితి ఉంటుంది. అలాగే కేంద్రం అనుమతించే పరిమితి కూడా ఉంటుంది. టీడీపీ హయాంలో ద్రవ్యలోటు: 2014 నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో జీడీపీలో 3 శాతం వరకు మాత్రమే అప్పులు చేసే అనుమతి ఉండగా, కానీ ఏ ఒక్క ఏడాది కూడా వారు ఆ పరిమితికి లోబడి అప్పులు చేయలేదు. దీంతో అప్పుడు ద్రవ్యలోటు చూస్తే 2014–15లో 3.95 శాతం, 2015–16లో 3.65 శాతం, 2016–17లో 4.52 శాతం, 2017–18లో 4.12 శాతం, 2018–19లో 4.06 శాతంగా ఉంది. ఇక ఈ ప్రభుత్వం వచ్చాక 2020–21లో ద్రవ్యలోటు 5.44 శాతంగా ఉంది. అందుకు ప్రధాన కారణం. కోవిడ్ వల్ల రాష్ట్రం ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. నిజం చెప్పాలంటే అన్ని రాష్ట్రాలతో పాటు, కేంద్రం కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2021–22లో ప్రభుత్వం చేసిన అప్పు జీడీపీలో కేవలం 2.1 శాతం మాత్రమే. ఇది నిజంగా అభినందనీయం. ఆనాడు దారుణంగా పెరిగిన అప్పులు: గతంలో ఏనాడూ జీడీపీలో 3 శాతం లోపు మాత్రమే అప్పులు తీసుకోవాలన్న నిబంధన ఉన్నా, ఏనాడూ ఆ పరిమితిలోపు రుణం తీసుకోలేదు. ఇక ఆ ప్రభుత్వం అప్పులు చూస్తే.. ఉమ్మడి రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు తీసుకున్న అప్పుల మొత్తం రూ.1,34,584 కోట్లు కాగా, 2019, మే నెల నాటికి ఆ అప్పులు రూ.3,27,372 కోట్లకు పెరిగాయి. అంటే ఏటా దాదాపు 19.46 శాతం అప్పులు పెరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చాక..: అదే ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న అప్పులు, ద్రవ్యలోటు తగ్గించిన తర్వాత తర్వాత పరిస్థితి చూస్తే.. 2019 మే నాటికి ఉన్న రూ.3,27,372 కోట్ల అప్పులు ఈ మూడేళ్లలో ఏటా కేవలం 15.77 శాతం చొప్పున మాత్రమే పెరిగాయి. విద్యుత్ రంగం: ఇక విద్యుత్ రంగంలో ఉన్న అప్పులు, విభజన నాటికి 2014లో రూ.29,703 కోట్లు ఉంటే, 2019 నాటికి ఆ అప్పులు ఏకంగా రూ.68,500 కోట్లకు పెరిగాయి. అప్పులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిలు చూస్తే.. 2014లో రూ.2,893 కోట్లు ఉంటే, టీడీపీ హయాంలో ఆ బకాయిలు ఏకంగా రూ.21,540 కోట్లకు పెరిగాయి. ఇంకా ప్రభుత్వం విడిచిపెట్టి పోయిన ఇతర బకాయిలు దాదాపు రూ.39 వేల కోట్లు. డిస్కమ్‌ల బకాయిలు కాకుండా. ఒక ఏడాది ఆర్థిక వ్యవస్థ మందగించింది. పన్నుల్లో వాటా తగ్గింది: నిజానికి కేంద్రంలో స్థూల పన్నుల ఆదాయం కూడా 2019–20లో మైనస్ 3 (–3 «శాతం) శాతం మాత్రమే. ఇది 21వ శతాబ్ధంలో తొలిసారి. ఆ తర్వాత కోవిడ్ వచ్చి, పరిస్థితులను అస్తవ్యస్తం చేసింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కూడా తగ్గింది. 2015–16 నుంచి 2019–20 వరకు ఏ ఏడాది కూడా అది 1.5 శాతం కంటే ఎక్కువే వచ్చింది. కానీ ఆ తర్వాత మనకు వచ్చిన వాటా 2020–21లో కేవలం 1.21 శాతం మాత్రమే. కేంద్రం కూడా అత్యధికంగా సెస్‌లు, సర్‌ఛార్జీల మీదే ఆధారపడడం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా తగ్గింది. ఇక కేంద్రం చేసిన అప్పులు చూస్తే..: 2019 నాటికి కేంద్రం అప్పులు రూ.90.83 లక్షల కోట్లు ఉండగా, అది ఈ మూడేళ్లలో ఏకంగా రూ.135 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఏటా 14.37 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. అదే మన రాష్ట్ర అప్పులు చూస్తే.. రూ.2.62 లక్షల కోట్ల నుంచి రూ.3.75 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే ఏటా 12.75 శాతం చొప్పున మాత్రమే అప్పులు పెరిగాయి. అదే కేంద్రంలో ఆ పెరుగుదల 14.37 శాతం. అంటే కేంద్రంలో పెరిగిన అప్పుల కంటే, మనకు పెరిగిన అప్పులు చాలా తక్కువ. ఇక అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన కేంద్రం అప్పులు చూస్తే.. రూ.56 లక్షల కోట్ల నుంచి రూ.90 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే ఏటా 9.89 శాతం పెరుగుతూ వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఆ అప్పులు ఏకంగా ఏటా 17 శాతం చొప్పున పెరిగాయి. తప్పుడు సమాచారం. అసత్యాలు: పబ్లిక్ డొమెయిన్‌లో అన్ని వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చూస్తే..రూ.3.81 లక్షల కోట్లు కూడా లేవు. కానీ పేపర్లు మాత్రం రూ.4.13 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు రాస్తున్నాయి. అదే విధంగా ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు చేసిన వాస్తవ అప్పులు కేవలం రూ.1.17 లక్షల కోట్లు కాగా, అవి రూ.1.38 లక్షల కోట్లు అని రాస్తున్నారు. ఈ విధంగా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల, అసత్యాలు ప్రచారం చేయడం వల్ల రాష్ట్రానికే చెడ్డ పేరు వస్తుంది. వ్యవస్థల్లో విషవృక్షాలు నాటాడు: గతంలో కూడా ఇలాగే వాస్తవాలు చెప్పాల్సి వచ్చింది. నిజంగా నిద్ర పోయే వాణ్ని లేపొచ్చు. కానీ నిద్ర నటించే వాణ్ని లేపడం కష్టం. వాస్తవాలు రాస్తే, చెప్పొచు. కానీ ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రికలు, ఛానళ్లు చేస్తున్న ప్రచారాలు, అవాస్తవాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తోంది. అందుకే ఈ గణాంకాలు ఇస్తున్నాం. వాస్తవాలు మీరూ చూడండి. అయితే దీని వెనక కూడా ఒక ఫిలాసఫీ ఉంది. టీడీపీని ఆరోజు ఎన్టీఆర్ ఉన్నతాశయాలతో పెట్టారు. దాంట్లో నాగుపాములా దూరిన చంద్రబాబు ఏనాడూ ప్రజల్లో విశ్వాసం చూరగొనలేదు. వారి మన్ననలు పొందలేదు. అందుకే ఆయన చేసిన పని ఏమిటంటే.. 1995 తర్వాత అన్ని వ్యవస్థలలో తనకు చెందిన ఒక విషవృక్షాలు నాటాడు. అవి ఊడలు పెరిగి, మళ్లీ ఊడలు కూడా వచ్చాయి. అవి చంద్రబాబు డిక్షనరీలో లేవు: వ్యవస్థలను మేనేజ్ చేయడం కాదు. వాటిని నడపడం. అందులో నుంచే తన పెత్తందారీతనాన్ని రాష్ట్రం మీద రుద్దడం అలవాటు అయింది. నిజమైన సంక్షేమం. ప్రజల ఆకాంక్షలు తీర్చడం. వారి కోసం పని చేయడం. చంద్రబాబు డిక్షనరీలో లేదు. వాటి అర్ధాలు కూడా ఆయనకు తెలియవు. అందుకే అవి చేసే వారు ఎవరు వచ్చినా ఆయన తట్టుకోలేరు. ఎందుకంటే ఈ పెత్తందారీతనం ద్వారా దోచుకోవడం. దాన్ని వీరు, వారి కోటరీ, వారికి వంత పాడే నాలుగు శక్తులు పంచుకోవడం అలవాటైంది. అంతే తప్ప ప్రజలకు జవాబుదారీతనం, బాధ్యత వహించే లక్షణం ఆలోచన, స్పృహ లేదు. ప్రజల సంక్షేమం అనేది చంద్రబాబుకు నిజంగా విషం వంటివి. ఎందుకంటే ఆయన తత్వం వేరు కాబట్టి. కాబట్టి అలాంచి ఆలోచన ఉన్న వారు వస్తే, ఆయన అస్సలు సహించలేరు. అభివృద్ది. సుస్థిర పురోగతి: ఇప్పుడు అత్యున్నత ప్రతిరూపంగా జగన్‌గారు వచ్చారు. ఆయన పాలన నడుస్తోంది. సంక్షేమం. అభివృద్ధి. సుస్థిర పురోగతి. వాటికి ఒక ప్రత్యేక రూపం ఇచ్చే ప్రయత్నం ఈ మూడేళ్లుగా జరుగుతోంది. అందుకే ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు పుట్టకుండా చేస్తున్నారు. వారికి అదే ఆలోచన. ప్రజలు అర్ధం చేసుకోవాలి. ప్రజలు అర్ధం చేసుకోవాలి: కాబట్టి చంద్రబాబు మళ్లీ వస్తే.. ఆయన, ఆ గ్రూప్ పూర్తిగా పేదలకు వ్యతిరేకం. వారికి ప్రజల సంక్షేమం అంటే అస్సలు పడదు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది కాబట్టి, రోజూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. రోజూ దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రజలు అర్ధం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీని కానీ, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబును కానీ, ఆయన తైనాతీలను కానీ, ఆ గ్రూప్‌ను కానీ, వారి మాటలు నమ్మితే రాష్ట్రానికి నష్టం కలుగుతుంది. పేదలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా వాస్తవాలు గమనించాలని కోరుతున్నాం. ఆ పోలిక సరికాదు: కేంద్రం ఒక ప్రకటన చేసే మందు ఆలోచించాలి. శ్రీలంక గురించి వివరించే ముందు, తాము ఇక్కడ ఎలా, ఏం చేశామన్నది చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆ పని చేయలేదు. అది పొలిటికల్ మిస్‌చీఫ్ అనొచ్చు. ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చవచ్చు. అంతేకానీ ఒక దేశంతో ఎలా పోలుస్తారు? కేంద్రం ఏమైనా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే అప్పుడు చేస్తోందా? చేసిన అప్పులన్నింటినీ కోవిడ్ కోసమే ఖర్చు చేస్తున్నారా? మేము చేస్తున్న అప్పులకు లెక్క ఉంది. ప్రజలకు డీబీటీ ద్వారా ఈ మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు చేరింది. దేని కోసం ఎంత ఖర్చు చేసిందన్నది కూడా చెబుతున్నాం. ప్రతిదీ పారదర్శకంగా..: మేము ఇప్పుడు చూపుతున్న లెక్కలు తప్పు అనుకుంటే, టీడీపీ చెప్పాలి. అప్పుడు వారు చేసిన అప్పుల గురించి కూడా చెబుతున్నాం. అది క్లియర్‌గా చూపుతున్నాం. ఈ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కూడా చెబుతున్నాం. చూపుతున్నాం. అవి వాస్తవాలు కాదంటే, చెప్పండి. సమాధానం చెబుతాం.కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఒక్క పథకాన్ని కూడా ఆపలేదు. ప్రజలకు పథకాల్లో నేరుగా నగదు బదిలీ చేశాం. ఆ వివరాలు క్లియర్‌గా చెబుతున్నాం. వరదపైనా ఏదేదో రాస్తున్నారు: లంక భూముల్లో సాగు చేసినప్పుడు వరదలు వచ్చినప్పుడు అవి సహజంగానే నీట మునుగుతాయి. దాన్ని కూడా పెద్దగా చూపుతూ వ్యవసాయం పనై పోయిందని, ఉద్యాన పంటల సాగు జరగదంటూ హెడ్డింగ్ పెట్టి వార్త రాశారు. మేము ఒకటే చెబుతున్నాం. గతంలో 13 జిల్లాలు ఉంటే, ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చాయి. ఆ విధంగా ప్రభుత్వం యంత్రాంగం చాలా పెరిగింది. గ్రామస్థాయి వరకు ప్రభుత్వ పాలన, ఇంటి గడప వద్దనే అందుతోంది. వరదల సమయంలో వారంతా వేగంగా సేవలందిస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అర్ధరాత్రి వరకు టెలి కాన్ఫరెన్స్ పెడితే, అధికారులంతా అక్కడే ఉండి, సహాయ కార్యక్రమాల్లో పొల్గొనలేక పోయేవారు. తమకు సాయం అందడం లేదని ఎవరైనా అంటు, బుల్డోజర్‌తో తొక్కిస్తానని హెచ్చరించాడు కూడా. చివరకు ఇవాళ కూడా చంద్రబాబు పరామర్శ పేరుతో పర్యటిస్తూ, పొలిటికల్ షో చేస్తున్నాడు. కాదంటారా? ఒకవేళ నిజంగా ప్రజలకు సహాయం అందకుండా ఉంటే, 2014–19 మధ్య ఇలా జరిగింది. ఇప్పుడు ఇలా ఉందని మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపండి. రాజకీయ దురుద్దేశంతో కాకుండా, వాస్తవాలు చెప్పాలి. స్కూల్‌పై ఆంధ్రజ్యోతి అసత్య కథనం: ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. ఒకేరూమ్‌లో మూడు క్లాస్‌లు అని పెద్ద వార్త రాశారు. నేను దీనిపై వివరాలు తెప్పించాను. స్టడీ అవర్‌లో అలా కూర్చోబెట్టారని తెలిసింది. అయినా పూర్తి వివరాలు తెప్పించాను. అక్కడ నిజానికి 35 తరగతి గదులు ఉండగా, 14 గదులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. మొత్తం 754 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ స్టడీ అవర్స్‌లో ఒకే దగ్గర కూర్చోబెట్టారు. అందుకే ఈ వివరాలన్నీ తెప్పించాము. ఎందుకంటే దీనిపై చట్టపరంగా చర్యలు చేపట్టబోతున్నాం. మొన్న రోడ్లపై ఇలాగే రాశారు. ఆనాడు నిజంగా చంద్రబాబు రోడ్లు బాగు చేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ దాన్ని మాత్రం రాయరు. అదే మా పొలిటికల్ ఎజెండా: మేము అప్పు చేయడం లేదని చెప్పడం లేదు. దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో చూడండి. ఆ వివరాలు కూడా మేము చెబుతున్నాం. అవన్నీ గమనించండి. ప్రజా సంక్షేమం, పేదల అభివృద్ధి మా పొలిటికల్ ఎజెండా. దాని కోసమే మేము పని చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండూ కొనసాగాలి. అ దిశలోనే మా ప్రభుత్వం పని చేస్తోంది. అందుకే అమ్మ ఒడి పథకం మొదలు.. ఇంగ్లిష్ మీడియమ్, విదేశీ విద్య వరకు పథకాలు అమలు చేస్తున్నాం. ఎక్కడైనా లోపాలు ఉంటే చూపండి. వాటిలో వాస్తవం ఉంటే స్వాగతిస్తాం. సరి చేసుకుంటాం. పోలవరంపైనా అసత్యాలు: తాజాగా పోలవరం గురించి కూడా రాశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అప్రోచ్ ఛానల్ కట్టలేదు. మా ప్రభుత్వం వచ్చాక ఆ పని చేసింది. స్పిల్‌వే లేకుండా, కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయకుండా, డయాఫ్రమ్ వాల్ కట్టారు. దాన్ని ఆరోజు జగన్‌గారు ప్రస్తావించారు కూడా. అయితే ఆ వాస్తవాలను ప్రస్తావించకుండా, ఈ మూడేళ్లలోనే అన్ని అనర్ధాలు జరిగినట్లు రాస్తున్నారు.