హోంమంత్రి అనిత పర్యటనను అడ్డుకుంటాం

వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల అల్టిమేటం

కూటమి ప్రభుత్వంలో దళితులు, గిరిజనులకు రక్షణ కరువు

సామూహిక లైంగిక దాడికి గురైన బాలికకు న్యాయం చేయాలి

బిడ్డకు జన్మనిచ్చిన బాలికను పరామర్శించేందుకు అనుమతివ్వరా?

హత్యకు గురైన గిరిజన విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలి

దళితులకు అన్యాయం జరిగినా పట్టించుకోని ఎమ్మెల్యేలు ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణి 

అనంతపురం సర్వజనాస్పత్రి ఎదుట వైయ‌స్‌ఆర్‌సీపీ నేతల ఆందోళన

అడ్డుకున్న పోలీసులు.. వైయ‌స్‌ఆర్‌సీపీ నేతల అరెస్ట్‌ 

అనంతపురం :  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఏడుగుర్రాలపల్లిలో సామూహిక లైంగిక దాడికి గురైన దళిత బాలికను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సోమవారం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర హోంమంత్రి అనితను అడ్డుకుంటామని హెచ్చరించారు. రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో సామూహిక లైంగిక దాడికి గురైన దళిత బాలిక మూడు రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, మహిళా విభాగం నేతలు అనంతపురం సర్వజనాస్పత్రిలో బాలికను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఆస్పత్రి ఎదుటే వారు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత దళితురాలై ఉన్నా తమ వర్గానికి న్యాయం జరగడం లేదని అన్నారు. ఇటీవల మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ జిల్లాకు వచ్చి వెళ్లినా దళిత బాలికకు న్యాయం జరగలేదన్నారు. ఇప్పుడు ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. తల్లీబిడ్డ సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్నారు. బాధిత బాలికను పరామర్శించేందుకు వెళ్తుంటే తమను అడ్డుకోవడం దారుణమన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అంటూ ధ్వజమెత్తారు. అలాగే అనంతపురంలో ఇంటర్‌ చదువుతున్న గిరిజన విద్యార్థిని తన్మయిని హత్య చేసినా ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలా లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణి ఎమ్మెల్యేలుగా గెలిచినా దళితుల సంక్షేమం గురించి ఆలోచించడం లేదన్నారు. దళిత సంఘాల ద్వారా రాజకీయంగా ఎదిగిన ఎంఎస్‌ రాజు అదే దళితులకు అన్యాయం జరిగుతుంటే నోరుమెదపట్లేదని మండిపడ్డారు. ఏడుగుర్రాలపల్లిలో దారుణ ఘటన జరిగితే బాధిత బాలికను పరామర్శించే ఓపిక హోం మంత్రి అనితకి లేదా? అని ప్రశ్నించారు. సోమవారం మడకశిర పర్యటనకు వస్తున్న హోంమంత్రిని అడ్డుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. బాధితుల తరఫున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కాగా ఆందోళన చేస్తున్న నాయకులను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో వైయ‌స్‌ఆర్‌సీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌బాబు నాయక్, ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు పసులూరి ఓబుళేసు, మహిళా విభాగం అనంతపురం నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ,  యువజన విభాగం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, యువజన విభాగం అనంతపురం నగర అధ్యక్షుడు శ్రీనివాస దత్త, నగర ఉపాధ్యక్షుడు ఉదయ్, నగర కార్యదర్శి మైను, శింగనమల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆంజనేయులు, నార్పల మండలం దుర్గం సర్పంచ్‌ సాకే రామాంజినేయులు, మాజీ పట్టణ అధ్యక్షుడు సాకే శివశంకర్, బుక్కరాయసముద్రం సర్పంచ్‌ పార్వతి, రాప్తాడు నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆలమూరు ఓబుళేసు, రాంబాబు, మారుతి, జయరాం, నాగేంద్ర, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top