పార్టీ కష్ట, నష్టాల్లో తోడున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

పార్టీ  శ్రేణులందరికీ వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

మహానేత వైయస్‌ఆర్‌ ఆశయ సాధనే ధ్యేయంగా పార్టీ అడుగులు

పదేళ్ల ప్రస్థానం.. మరిన్ని దశాబ్దాలు ముందుకు సాగుతోంది

విలువలు, విశ్వసనీయతే మన పార్టీ, మన నాయకుడి ఊపిరి

ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన 

తాడేపల్లి: ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా.. విలువలు, విశ్వసనీయత ఊపిరిగా సాగించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానం.. మరిన్ని దశాబ్దాలు ముందుకు సాగుతూనే ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పదేళ్లు పూర్తి చేసుకున్న వైయస్‌ఆర్‌ సీపీ ప్రస్థానంలో తొలి అడుగు నుంచి అనేక కష్టాలు, నష్టాలను ఓర్చుకుంటూ.. జననేత వైయస్‌ జగన్‌ వెంటే నడుస్తూ.. పోరాటం సాగించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు, పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కడితో మొదలైన పార్టీ.. నేడు కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ఈ ప్రయాణంలో తొలి అడుగు నుంచి భాగమై.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల ప్రస్థానం ముగించుకుంది. మరిన్ని దశాబ్దాలు ఇలాగే ప్రజా సేవలో మమేకమై ఉంటుంది. వైయస్‌ఆర్‌ కుటుంబంపై ఉన్న ప్రేమతో, అభిమానంతో ఈ ప్రయాణంలో వైయస్‌ జగన్‌ పడిన కష్టాలను తమ కష్టాలు అనుకుంటూ పోరాటం చేసిన నాయకులు, పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు. 

ఈ ప్రయాణం ఒకడిగా మొదలుపెట్టినా.. వైయస్‌ జగన్‌ అంటే లక్షలాది మంది అభిమానులు, వేలాది మంది నాయకులు అనే విషయం మర్చిపోకూడదు. పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అందరికీ పేరుపేరునా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైయస్‌ జగన్‌ ప్రజల్లో కల్పించిన విశ్వాసం..  ఐదు కోట్ల మంది ప్రజానీకం మా నాయకుడు అని అనుకునే రకంగా పార్టీని అడుగులు వేయించి.. అందరి ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్లారు. ప్రతి పల్లెలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం పండుగలా సాగుతోంది. 

రాజకీయ పార్టీ ఎలా ఉండాలనే కొత్త నిర్వచనం తీసుకువచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. ప్రజాసమస్యల పరిష్కారమే మేనిఫెస్టోగా, అందరికీ మార్గదర్శకంగా ఉండే నాయకుడిగా ఆయన మొదలుపెట్టిన పార్టీ పదేళ్లు పూర్తిచేసుకుంది. అందుకే ఏ ఎన్నికలు చూసినా వైయస్‌ఆర్‌ సీపీని ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారు. ప్రజావిజయం సాధ్యం చేసిన ఘనుడు సీఎం వైయస్‌ జగన్‌. పాదయాత్రలో గమనించిన సమస్యలను 20 నెలల పాలనలోనే పరిష్కరించే దిశగా పరిపాలన చేస్తున్నారు. 

మా నాయకుడి విశ్వసనీయత, విలువలు ప్రజలకు భరోసాగా నిలిచాయి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయినా 80 శాతం పైగా వైయస్‌ఆర్‌ సీపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్వీప్‌ చేసుకోబోతున్నాం.  ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా.. మా నాయకులను ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఆఖరకు ప్రతిపక్ష పార్టీ అధినేత ఎన్ని సంధి ప్రేలాపణలు పెట్టినా ప్రజలు ఏమీ పట్టించుకోలేదు. 

సీఎం వైయస్‌ జగన్‌.. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడమే కాకుండా తమ వెంబడి నడిచే వారికి అదే లక్షణాలు వచ్చేలా చేసి.. పార్టీని క్రమశిక్షణ కలిగిన పార్టీగా తీర్చిదిద్దారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా సీఎం సాగించిన ప్రస్థానం.. దశాబ్దాలుగా ముందుకు సాగుతూనే ఉంటుంది. జగనన్న దగ్గర నుంచి.. జగన్‌ మామ, జగన్‌ తాతగా కూడా ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 
 

Back to Top