2028 కల్లా రాజధాని పూర్తయితే తీర్మానం ఎందుకు?

రాజధాని తీర్మానం పేరుతో కూట‌మి ప్రభుత్వం కొత్త డ్రామా 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఫైర్‌

గుంటూరు న‌గ‌రంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం  

గుంటూరు: రాజధాని అమరావతిని 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే, ఇంకా అసెంబ్లీలో తీర్మానం తీసుకురావాల్సిన అవసరం ఏమిటని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు నగరంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని తీర్మానం పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని పేర్కొంటూ, అసలు అభివృద్ధి పనులు చేపట్టకుండా తీర్మానాల ద్వారా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. అమరావతి పేరుతో ఇప్పటికే పెద్దఎత్తున భూములు సేకరించినప్పటికీ, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.

రాజధాని అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చూపిస్తూ, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా లక్షల కోట్ల ప్రణాళికలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, తీర్మానాల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తోందని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. 

 పార్టీ బలోపేతంతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి హింసించిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ఎంతటి ఒత్తిడులు తీసుకొచ్చినా తమ కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా నిలిచారని, వారందరికీ అభినందనలు తెలిపారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరిపారని పేర్కొన్నారు. కూటమి నాయకుల బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేసిందో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది రైతుల పరిస్థితి దారుణంగా మారినా ప్రభుత్వం ఒక్కరిని కూడా ఆదుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు.  ఇకపై పార్టీ కార్యకర్తలు ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని, తమకు అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరగవచ్చని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.
 

Back to Top