పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

జ‌గ‌న‌న్న విద్యా దీవెన కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

 పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు

8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్లు ఆర్థిక సాయం

2023-24 జూలై-సెప్టెంబర్‌ జగనన్న విద్యాదీవెన నిధులు జమ

ఇప్పటివరకు విద్యా దీవెన పథకం ద్వారా రూ.11,900 కోట్లు

జగనన్న వసతి దీవెన కింద రూ.4,275 కోట్లు  ఇచ్చాం

 నాలుగున్నరేళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశాం: సీఎం జగన్‌
 
ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రుపురేఖల్ని మార్చాం

తరగతి గదులను డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లుగా మార్చాం

స్కూళ్లల్లో సబ్జెక్ట్‌ టీచర్లను తీసుకొచ్చాం

విద్యార్థుల భవిష్యత్‌ బాగుండాలన్నదే ప్రభుత్వ తాపత్రయం

ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చాం

బాబు హయాంలో ఎగొట్టిన రూ.1775 కోట్లను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది

జగనన్న విదేశీ విద్యాదీవెన కింద 400 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది

ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్శిటీల్లో మన విద్యార్థులు చదువుతున్నారు

ఇప్పటివరకు విద్యారంగంలో 73 వేల కోట్లు ఖర్చు చేశాం
 
దోచుకోవడం.. పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు: సీఎం జగన్‌
 
అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు, మోసాలు చెప్పడమే వారి రాజకీయం

పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టినవాడు పవన్‌ తప్ప ఎవరూ లేరు

చంద్రబాబు కోసమే పవన్‌ జీవితం

దత్తపుత్రుడు ఓ త్యాగాల తాగ్యరాజు

నాలుగేళ్లకోసారి భార్యలను మార్చాడు ఈ మ్యారేజ్‌స్టార్‌

ఇలాంటి వాళ్లను ఇన్సిపిరేషన్‌గా తీసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి?

వివాహ బంధాన్ని గౌరవించడు కానీ.. బాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలట

ఇలాంటి వాళ్లకి ఓటు వేయడం ధర్మమేనా?

మూడుసార్లు సీఎంగా ప‌ని చేసిన చంద్ర‌బాబు పేరు చెబితే ఒక్క ప‌థ‌క‌మైనా గుర్తుకు వ‌స్తుందా?

ఈ నాలున్న‌రేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క ప‌థ‌కం పేరు చెప్పినా గుర్తుకు వ‌చ్చేది వైయ‌స్ జ‌గ‌నే

భీమ‌వ‌రం రియ‌ల్ హీరో గ్రంధీ శ్రీ‌నివాస్‌:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

భీమ‌వ‌రం: మ‌న రాష్ట్రంలో  పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్ల నిధుల‌ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన‌ కార్యక్రమంలో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి  లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. 

 

*ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*

 

మీ అందరి చిక్కటి చిరునవ్వులు, చెరగని ప్రేమానురాగాలు మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని భీమవరం నుంచి ప్రారంభిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. పిల్లలకు అభినందనలు. 

 

*ప్రతి క్వార్టర్‌కూ ఫీజు- తల్లుల ఖాతల్లో జమ.*

ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజులు డబ్బును ఇవాళ మనందరి ప్రభుత్వం.. ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యాదీవెన కింద జమచేస్తున్నాం. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మూడు నెలలకొకసారి... క్వార్టర్‌ పూర్తయిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన మొత్తాన్ని తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.

 

ఇవాళ  8,09,039 మంది పిల్లలకు మంచి చేస్తూ కార్యక్రమంలో బటన్‌ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగష్టు, సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించిన రూ.583 కోట్లను జమ చేస్తున్నాం.

 

ఫైనల్‌ ఇయర్‌ విద్యార్ధులకు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో దాదాపు...2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్‌ స్టాల్‌ మెంట్‌గా చెల్లించాల్సిన ఫీజు కూడా ముందుగా వారి తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. 

 

 

*నాలుగున్నరేళ్ల ప్రయాణంలో..*

ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్టయితే.. కేవలం ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు.. పిల్లలు, వారి తల్లిదండ్రులు ఏమాత్రం ఇబ్బంది పడకూడదని.. వారికి ఒక మంచి మేనమామగా వారికి మంచి చేస్తూ... ఇచ్చిన మొత్తం రూ.11,900 కోట్లు. 

 

ఇదొక్కటే కాదు జగనన్న వసతి దీవెన.. నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లలు చదువులే కాదు, వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చులకు పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా, తోడుగా ఉంటూ దీని కోసం మరో రూ.4,275 కోట్లు ఇచ్చాం.

పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు ఉన్నతమైన చదువులు చదివాలి.. దానికోసం అప్పులపాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు.

ఈ రోజు వీళ్ల బతుకులు మారాలి. ఈ కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు పడ్డాయి. 

 

*మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు...* 2017–18కి సంబంధించిన ఫీజుల సైతం పెండింగ్‌లో ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు. దానికి సంబంధించిన రూ.1,777 కోట్లు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతో మనమే చెల్లించాం. 

 

*ఒక్కసారి తేడా గమనించండి...*

దేశ భవిష్యత్తును మార్చగలిగేది చదువు మాత్రమే..

గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగా ఖర్చు చేయని పరిస్థితులు.. ఈరోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు. తేడా గమనించాలని కోరుతున్నాను. 

చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఒక ఆస్థి. మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్‌ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది. 

 

దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టే ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్‌ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాం. వేయగలిగాం. గతానికి, ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నాను. 

 

*విద్యారంగంలో సమూల మార్పుల దిశగా..*

నాడు–నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించమని కోరుతున్నాను. ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న విద్యాకానుక కానీ, స్కూళ్లలో పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ... జగనన్న గోరుముద్ద మీద ఫోకస్‌ పెట్టాం. పిల్లలు బాగా చదవాలి, పిల్లలను బడులకు పంపించేందుకు తల్లులను మోటివేట్‌ చేస్తూ.. వారి కోసం వైఎస్సార్‌ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీపడాలని... ప్రభుత్వ బడులను  తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చి రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లలకు పక్కపక్కనే ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగుతో  బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ద్వారా పిల్లలకు మెరుగైన చదువులు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్‌ కంటెంట్‌ కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో రూ.15వేలు చెల్లిస్తే తప్ప అందుబాటులోకి రాదు. అలాంటి బైజూస్‌ కంటెంట్‌ను మన ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వతరగతి ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్‌రూంలోనూ ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ఫాంలను ఏర్పాటు చేసి.. డిజిటల్‌ క్లాస్‌రూములగా మార్చి డిజిటల్‌ బోధన తీసుకొస్తున్నాం.

ప్రభుత్వ బడులలో 8వతరగతి వచ్చేసరికి ఆ  పిల్లలకు ట్యాబులు ఇస్తున్నాం. ఇలా ప్రతి అడుగు విప్లవాత్మక అడుగే. తెలుగుమీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు సీబీఎస్‌ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం కావచ్చు, పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్‌ ను సబ్జెక్ట్‌ గా తీసుకొచ్చాం. 

 

క్లాస్‌ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్‌ టీచర్‌ ను ఏర్పాటు చేయడం వరకు...  పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్‌ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది.

 

*ఉన్నత విద్యలో సైతం మార్పులు..* 

నాడు నేడుతో బడులను ఒకవైపు రూపురేఖలు మారుస్తూ, మరోవైపున ఉన్నత విద్యపై ధ్యాస పెట్టాం. ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరిక్యులమ్‌లో మార్పులు చేశాం. 

కరిక్యులమ్‌లో పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉందని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్‌ మామ పరిపాలనలోనే జరుగుతోంది. 

 

తొలిసారిగా డిగ్రీలో కూడా ఆన్‌ లైన్‌ వర్టికల్స్‌ ను తీసుకురావడం జరిగింది. ఏకంగా  10 నెలలపాటు ఇంటర్న్‌ షిప్‌ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి.  జాబ్‌ ఓరియెంటెడ్‌గా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి. 

 

 

*అంతర్జాతీయ విద్యాసంస్ధలతోనూ ఒప్పందం.*

ఇదొక్కటే కాకుండా మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సీటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో కూడా చదువులు ఉండాలనేతపనతో, అంతర్జాతీయంగా ఆన్‌ లైన్‌ ఫ్లాట్‌ ఫాంలో ఎంఐటీ, హార్వర్డ్, ఎల్‌ బీఎస్, ఎల్‌ఎస్‌సీ లాంటి సర్టిఫికెట్లు.. ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి వచ్చేట్టుగా హెడెక్స్‌ అనే సంస్థతో టై అప్‌ అయ్యాం. తద్వారా  ఆన్‌ లైన్‌ లో  ఆ కోర్సులు తీసుకొస్తూ, ఏఐని అనుసంధానం చేస్తూ, డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. 

 

మన పేద విద్యార్ధులు, మన పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే వేగంగా ఎదగగలుగుతారు. 

ప్రపంచంలో ఎక్కడైనా పిలిచి ఆ పర్టిక్యులర్‌ సబ్జెక్టులో, ఆ పర్టిక్యులర్‌ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్ట్‌ సర్టిఫికెట్‌ మన డిగ్రీలతో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటాం. 

 

ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనామన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్‌ యూనివర్సిటీ నుంచి రాగలిగితే, మన రాష్ట్ర తలరాతలు కూడా మార్చగలుగుతారు.

 

*జగనన్న విదేశీ విద్యాదీవెన.*

అందుకోసం జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చాం. టాప్‌ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్‌లో దాదాపు  350 కాలేజీల్లో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీల్లో సీట్లు, వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయలు దాకా ఉన్నాయి. అయినా ఏ ఒక్కరూ అప్పులపాలు కావాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు. 

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా సీటు తెచ్చుకోండి, రూ. 1 కోటీ 25 లక్షల దాకా మీ జగన్‌ మామే భరిస్తాడని చెప్పాం. జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతుతున్నారు. వాళ్లు వాళ్ల బతుకులతో పాటు రాష్ట్రం రూపురేఖలు మార్చే లీడర్‌షిప్‌ స్థాయికి రాబోయే రోజుల్లో వస్తారు. 

 

వాల్లందరూ అటువంటి ప్రఖ్యాతయూనివర్సిటీల నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్లందరికీ పెద్ద, పెద్ద సంస్ధల నుంచి పెద్ద,పెద్ద వాల్లు వచ్చి మన పిల్లలను చేయిపట్టుకుని పైకితీసుకునిపోయే అవకాశాలు ఇస్తారు.

 

*విద్యారంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు.*

ఈ ఒక్క విద్యా రంగంలోనే ఉన్నత విద్యగానీ, స్కూళ్లు గానీ సంస్కరణ మీదే 55 నెలల కాలంలో ఖర్చు చేసింది  అక్షరాలా రూ. 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ.. ఇలా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నాను.

 

*గత ప్రభుత్వాలు ఈ ఆలోచనే లేదు..*

ఆలోచన చేయండి. ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటీ చేయడానికి ఏనాడూ గతంలో ఎప్పుడూ ఎవరూ ఆలోచన చేయలేదు. 

నాకన్నా ముందు గత ప్రభుత్వాన్ని చూశారు. అప్పుడు పరిపాలన చేసిన చంద్రబాబు పాలనను గుర్తు తెచ్చుకోండి. 

ఇన్ని మార్పులు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు జగన్‌ చేయగలుగుతున్నాడు. ఇలాంటి మార్పులు ఏనాడూ గతంలో ఎందుకు జరగలేదు ఆలోచన చేయాలి. 

 

మనసు రాని ఒకాయన పరిపాలనను మనం చూశాం. ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాలు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదు.  కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించాడు. వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్టచతుష్టయానికి బిస్కెట్ల వేసినట్లు వేశాడు. 

 

జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. వీళ్లకు తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్లందరూ కూడా అధికారంతో ఏం చేశారంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు గుర్తు పెట్టుకొనేటట్టుగా పాలన చేసిన చరిత్రా చేయలేదు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి. 

 

మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలల్లో ఎలా చేయగలిగాడు. ఎందుకు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేదని ఆలోచన చేయాలి. వాళ్లు చేసిన పరిపాలన వల్ల వాళ్లు ప్రజల మనసుల్లో లేరు. వారికి విలువలు లేవు. విశ్వసనీయత అంతకన్నా లేదు. 

వాళ్ల దృష్టిలో అధికారం అంటే కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు. వాళ్లు బాగుపడటం కోసమే. 

వాళ్లందరినీ కూడా అడగాలని మీ అందరినీ కోరుతున్నాను. 

 

*వెన్నుపోటు రాజకీయం గురించి నాలుగు మాటలు...*

అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో నాలుగు మాటల్లో చెబుతాను. 

 

దుష్ట చతుష్టయానికి చెందిన ఈ ముఠాలో ఇదే భీమవరంలో ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలుపెడతాను. వీరి చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయో చెబుతాను.

ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఉంటాడు. నాన్‌లోకల్‌ ఈయన. పక్కరాష్ట్రం ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్‌ మన రాష్ట్రంలో ఉండదు. నాన్‌ లోకల్‌. 

పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండడు. 

 

ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో  కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదని చెబుతాడు.

తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని ఈయనను తప్ప బహుశా ఎవరినీ చూసి ఉండం. 

 

*ప్యాకేజీ కోసం త్యాగాల రాయుడు.*

ఈ దత్తపుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే,  ఏ సీటూ ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభూ అనే త్యాగాల త్యాగరాజును మాత్రం ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. 

 

ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ, ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగం చేసే ఈ త్యాగాల త్యాగరాజునే చూస్తున్నాం. 

మరో విచిత్రం కూడా చెప్పాలంటే...  రియల్‌ లైఫ్‌ లో ఈ పెద్దమనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా మూడు నాలుగు సంవత్సరాలైనా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజీ స్టార్‌. 

 

ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంట గలుపుతూ నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులిచ్చేయడం. 

ఏకంగా కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అంటే ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

 

నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మనకు చెల్లెళ్లు ఉన్నారు. మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. మనమంతా ఆలోచన చేయాలి.  ఇలాంటి వారు నాయకులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, ఇలాంటి వారిని ఇన్‌స్పిరేషన్‌ గా తీసుకొని ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడూ చేయడం మొదలు పెడితే మన ఆడ బిడ్డల పరిస్థితి ఏమిటి? మన చెల్లెళ్ల పరిస్థితి ఏమిటి? 

ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే వారిని సమాజంలో, రాజకీయాల్లో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా? 

 

 

*మంది పెరిగితే మంచి పెరుగుతుందా ?* 

ఇలాంటి ఆయన ఏ భార్యతోనూ మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేడు. పొలిటికల్‌ లైఫ్‌ లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10–15 సంవత్సరాలైనా ఉండాల్సిందేనని ఏకంగా తన క్యాడర్‌ కు చెబుతున్నాడు. 

నేను అడుగుతున్నా. ఆలోచన చేయమని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా? 

నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు గానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా? ఒకరేమో పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తూ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్‌ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్నిమోసం చేస్తారు. 

ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తున్న చంద్రబాబు, ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడుతున్న ఈ దత్తపుత్రుడు. వీరిద్దరి కుటిల నీతి వల్ల ఏ ఒక్క పేద కుటుంబం అయినా, పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా? ఎదగగలుగుతుందా? 

ఇటువంటి క్యారెక్టర్‌ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా? 

 

*వీరి చరిత్ర మరికొంత వివరంగా చెబుతాను.* 

చంద్రబాబు ఈ మనిషి వయసు 75 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 3 సార్లు సీఎం అయ్యాడు. మరి కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీ కొడుతున్నాడు.  ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి? 

తాను ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల కాలంలో గుర్తుపెట్టుకోదగిన మంచి ఏదైనా, ఎవరికైనా,ఎప్పుడైనా ఈ పెద్దమనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ఓటు వేయాలని అడగాలి. 

లేదా... మీ బిడ్డ హయాంలో అమలు అవుతున్న ..మన అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం తాను అమలు చేసి ఉంటే చేశాను అని ఓటు అడగాలి. 

 

లేదా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం మన ప్రభుత్వంలో అమలవుతున్న వైయస్సార్‌ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్‌ కార్యక్రమం తాను చేసి ఉంటే ఆ పథకాలను అమలు చేశానని ఓటు అడగాలి. 

మీ బిడ్డ హయాంలో వైయస్సార్‌ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్‌ తాను అమలు చేసి ఉంటే అవి చేశానని ఓటు అడగాలి. 

 

ఏకంగా31 లక్షల ఇంటి స్థలాలు నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చాం. అందులో మరో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం.  ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేశాను, ఇంతకన్నా మెరుగైన కార్యకక్రమం చేశాను అని ఓట్లు అడగాలి. 

 

మీ బిడ్డ హయాంలో నేడు అమలవుతూ... నేరుగా డీబీటీ ద్వారా 2.45 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమచేశాం.  ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. 

 

ఇలా తాను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉంటూ ఎన్ని బటన్లు నొక్కి ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి చెప్పగలడా? 

 

ప్రజల బ్యాంకు స్టేట్‌ మెంట్లు చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ 2014–2019 మధ్య తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి ఓటు అడగగలడా? 

కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్‌ స్వీకరించి ఓటు అడగగలడా? 

 

*ఏ మంచి చేయని చంద్రబాబు ఓట్లు అడగలేడు*

చంద్రబాబు అడగలేడు. ఎవరికీ తాను 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేనే లేదు.  ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభ అట. మీరందరూ చూసే ఉంటారు. చంద్రబాబు మాట్లాడాడు. 

 

 

*ప్రతి పథకంలోనూ.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు...*

నేను ఒకటే అడుగుతున్నా. చంద్రబాబును అడుగుతున్నా. మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం. ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఆ గ్రామంలో, గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

 

పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామస్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో సచివాలయాలు, పౌర సేవలు ఎవరు తీసుకొచ్చారంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

ఏ గ్రామమైనా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ వ్యవస్థతో పింఛన్‌ పెంచి మరీ ఒకటో తారీఖునే ఇంటికి వచ్చి, సెలవుదినమైనా, ఆదివారమైనా చిక్కటి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ పింఛన్‌ చేతిలో పెడుతున్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

ఒక్క రూపాయి కూడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా బటన్‌ నొక్కి ఇంటింటికీ అక్కచెల్లెమ్మలు, పేదల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

 

గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ప్రివెంటివ్‌ కేర్‌ లో  ఎప్పుడూలేని విధంగా  విప్లవాత్మక మార్పులు తెస్తూ విలేజ్‌ క్లినిక్‌ లు పెట్టింది ఎవరంటే మీ జగన్‌. 

గ్రామ గ్రామాన మహిళా పోలీసులు, ప్రతి అక్క చెల్లెమ్మ సెల్‌ ఫోన్‌ లో దిశ యాప్, చూసినా గుర్తుకొచ్చేది మీ జగన్‌.

ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.

104, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌.. ఇలా అనేక పథకాలు తీసుకొచ్చింది దివంగత మహానేత వైయస్సార్‌ అయితే, వాటిని మరో నాలుగు అడుగులుముందుకు వేసి అమలు చేస్తున్నది ఎవరంటే గుర్తుకొచ్చేదిమీ జగన్‌.

 

రైతన్నలకు వైయస్సార్‌ రైతు భరోసా, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మళ్లీ జీవం పోసింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. అక్కచెల్లెమ్మలు, రైతన్నలకు సున్నా వడ్డీ ఇస్తున్నది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.

అమ్మ ఒడి చూసినా, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత చూసినా గుర్తుకొచ్చేది మీ జగన్‌. అసైన్డ్‌ భూముల మీద 22ఏ భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది... గుర్తుకొచ్చేది ఎవరంటే అది మీ జగన్‌.

గ్రామాల్లో గవర్నమెంట్‌ బడి అయినా సరే, ప్రభుత్వా ఆస్పత్రి అయినా సరే మారడానికి నాడు–నేడు చేస్తున్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

 

గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. గవర్నమెంట్‌ బడుల్లో డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌ పీలు, పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్‌. 

బాబుకంటే మూడు రెట్లు పింఛన్‌ పెంచింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.  శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.

 

2.45 లక్షల కోట్లు బటన్‌ నొక్కి ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబాలకు పంపింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీజగన్‌.  ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరిందంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.

 

మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు అన్నా గుర్తుకు వచ్చేది మీ జగన్‌. స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో 11 గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలున్నాయి. మీ బిడ్డ హయాంలో 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం.

గతంలో రాష్ట్రంలో 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే మీ బిడ్డ హయాంలో మరో నాలుగు పోర్టులు కడుతున్నాం. వీటితో పాటు మరో 10 ఫిషింగ్‌ హార్బర్లు కడుతున్నాం. ఇదంతా కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మాత్రమే జరిగింది. 

 

చందారబాబు 14 ఏళ్లు సీఎంగా పని చేసిన పాలనను చూశారు. మీ బిడ్డ నాలుగున్నర సంవత్సరాల పాలన చూశారు. 

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా, మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

 

*బాబుని సమర్ధించేవారు ఆలోచన చేయండి..*

దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో నిజాయితీగా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల మీదగానీ విప్లవాత్మక అడుగులు పడుతున్నాయి.   ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి.. ఇది ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్‌. 

ఇవన్నీ చూస్తే ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్‌ మాత్రలు ఇస్తే కడుపుమంట తగ్గుతుంది.  అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద గీతను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకే ఈ దిక్కుమాలిన రాతలు. దిక్కుమాలిన కథనాలు. ఉద్యోగులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు. రకరకాల వ్యక్తుల రంగప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ జరుగుతున్నాయి. 

ఈరోజు తోడేళ్లు అందరూ ఏకమై మీ బిడ్డమీద యుద్ధం చేస్తున్నారు. 

ఈ రోజు చంద్రబాబుకు కానీ, దత్తపుత్రుడికి కానీ ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్లద్దరిలో ఎవరికీ లేదు. కారణం ప్రజలకు మంచి చేసే చరిత్ర లేదు కాబట్టి.. అన్నిచోట్లా పోటీ చేసే సత్తా లేదు. అందుకే వీళ్లందరూ వంచనను మోసాన్నే నమ్ముకుంటున్నారు. అమలు చేసిన మంచి స్కీంలేవీ లేవు కాబట్టి... ఏకంగా రంగురంగుల వలలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారు. 

 

కొత్తగా మరిన్ని వాగ్దానాలతో వస్తున్నాడు. ఆరు గ్యారెంటీలన్నాడు. జగన్‌ ను ఢీకొట్టలేమని డిసైడ్‌ చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజల్ని మోసం చేయాలని బయల్దేరారు. 

ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తారట. 

ఇలాంటి వారిని నమ్మవచ్చా? అని ఆలోచన చేయాలి. 

 

ఇలాంటి వారిబుద్ధిని చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపేగానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా? విశ్వదాభిరామ, వినురవేమ అని వేమన స్వామి మాట్లాడారు. 

వీరి బుద్ధి ఎలాంటిదో గమనించాలని అడుగుతున్నాను. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. 

 

మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.

 

*చివరిగా..*

ఇవాళ ముగించే ముందు నా సోదరుడు శ్రీను గురించి ఒకే ఒక్క విషయం చెబుతాను. సినిమాలలో ఇంతకముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి , మరలా వస్తాను అని చెబుతున్న సినిమా హీరోని, అతని కేరెక్టర్‌ని చూశారు. కానీ మీ ముందు నేను రియల్‌ లైఫ్‌ హీరోని నిలబెడుతున్నాను. మంచి చేయడం కోసం అప్పట్లో నా దగ్గరకు వచ్చి నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. భీమవరాన్ని జిల్లా హెడ్‌క్వార్టర్‌ చేస్తే చాలు అన్నాడు. రియల్‌ లైఫ్‌ హీరో అంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం హౌసింగ్‌ కాలనీ రూ.39 కోట్ల ఖర్చయ్యే లెవెలింగ్‌ వర్కు మంజూరు చేయాలన్నారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. అదే విధంగా రోడ్డు పనులు కోసం భీమవరం మున్సిపాలిటీ, రూరల్, వీరవాసరం మండలంలో రూ.5.50 కోట్ల అడిగాడు. అది మంజూరు చేస్తున్నాను. భీమవరం టౌన్‌లో రూ.5.80 కోట్లతో బ్రిడ్జ్‌ కావాలన్నారు. మంజూరు చేస్తున్నాను. గొంతేరు డ్యామ్‌ వద్ద మేజర్‌ బ్రిడ్జ్‌ కోసం రూ.12 ఖర్చవుతుందన్నాడు. దీన్ని కూడా మంజూరు చేస్తున్నాను. భీమవరం– నర్సాపురం బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం అడిగాడు. అది కూడా మంజూరు చేస్తు.. మీరు మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటూ  సెలవు తీసుకుంటున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.

 

Back to Top