ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను నడిరోడ్డుమీద నిలబెడతారా ?  

ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది?

చంద్రబాబు మోసాలపై వైయ‌స్‌ జగన్‌ ఫైర్ 

తాడేపల్లి: ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయటంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ట్వీట్ చేశారు. చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపి తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా?. నడిరోడ్డుమీద నిలబెడతారా ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది?’’ అంటూ నిలదీశారు. 

‘‘మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్‌ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలమీద, ఉద్యోగస్తుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. మీరుపెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డుమీదకు వస్తున్నారు. చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా?’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నించారు.

 అధికారంలోకి వచ్చిన వెంటనే IR అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతి ఏమైంది?. మేం అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ఉద్యోగులకు IR ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేం PRC వేసి, దానికి ఛైర్మన్‌నుకూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, IR ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా PRC ఛైర్మన్‌ని వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు.

న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్‌ పేమెంట్స్‌ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడంలేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్‌. దసరా పండుగకు డీఏలు క్లియర్‌ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కాని, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు. CPS/GPSలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కాని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీనిమీద రివ్యూచేశారా?

మా ప్రభుత్వ హయాంలో CPSకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకోసం GPS తీసుకు వచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు.. OPSను తీసుకువస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కాని ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు.

ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్‌ డీఏలు, GPF, APGLI, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, సరెండర్‌ లీవ్స్‌ లేదా ఎన్‌క్యాష్ మెంట్‌ లీవులు… వీటి కింద దాదాపు రూ.31వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సినవాటికోసం ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నా ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో, వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు.

ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతినెలా జీతాలకోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆరోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీదాన్ని అమలు చేయడంలేదు.

మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, కుట్రపన్ని, వారి పొట్టకొట్టి, ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తాం అని, వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్‌ క్లినిక్కులూ, పీహెచ్‌సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు.

..మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్‌ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో  3,400 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్‌ను తీసుకు వచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్ష మందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా వారి జీతాలను, క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటోతారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్‌ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకువస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకూ, వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చిన తర్వాత దాన్ని రూ.3వేల కోట్లకు పెంచాం.  

ఉద్యోగులకు EHS కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్‌ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?. చంద్రబాబుగారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా దుయ్యబట్టారు.

A document with Telugu text in red and black, listing employee-related promises and a table of figures. The text includes headings like "తెలుగు మణిపుష్పం ఉద్యోగులు ఇచ్చిన హామీలు" and details about allowances and payments. The table shows categories, figures for 2019 and 2023, and totals.

A document with Telugu text in red and black, listing employee-related promises and a table of figures. The text includes headings like "తెలుగు మణిపుష్పం ఉద్యోగులు ఇచ్చిన హామీలు" and details about allowances and payments. The table shows categories, figures for 2019 and 2023, and totals.

Back to Top