ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్- ఏ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ తనూజా రాణి నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్‌హెచ్ఆర్‌సీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని వారు కమిషన్ చైర్మన్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు అనంతరం వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం మీడియాకు వెల్లడించింది. ఎంపీ తనూజ రాణి ఆధ్వర్యంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుభద్ర, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఉలాల భారతీ దివ్య, మన్యం-పార్వతీపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు మానవ హక్కుల సంఘం చైర్మన్‌ని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందంగా వెళ్ళి కలిశారు. . అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని, ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా ప్రభుత్వంలో కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏమన్నారంటే... ఎన్‌హెచ్ఆర్‌సీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయాలి : అరకు ఎంపీ తనూజారాణి తాగునీరు కలుషితమై కురుపాం- పార్వతీపురం గురుకుల పాఠశాలలో చదివే 170 మంది గిరిజన విద్యార్థులు హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నారు. అందులో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని పాఠశాలల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇద్దరు గిరిజన విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా ఉండటం లేదు. చనిపోయిన ఇద్దరు పిల్లలకు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. ఈరోజుకీ ఆ గురుకుల పాఠశాలలో మాత్రమే కాకుండా పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు కూడా ఇన్ఫెక్షన్ సోకినా ప్రభుత్వంలో చలనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీపీ ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల సంఘం నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని వారిని కోరాం. దీంతోపాటు మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ ఘటనపై మాజీ సీఎం వైయస్ జగన్ స్పందించి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరిగింది. గిరిజన కుటుంబాలకు ఏం నష్టం జరిగినా వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని మరోసారి స్పష్టంగా చెబుతున్నాం. ఈ ఘటనపై మానవహక్కుల కమిషన్ చైర్మన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మా విజ్ఞప్తికి స్పందించిన వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు విద్యార్థుల మృతి : మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. కురుపాం గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కల్పన, అంజలి అనే ఇద్దరు విద్యార్థినులు చనిపోయారు. విద్యార్థులకు ఆరోగ్యం బాలేదని తెలిసినా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించకుండా ఇంటికి పంపించి స్కూల్ యాజమాన్యం చేతులు దులిపేసుకుంది. యాజమాన్యం పట్టించుకోకుండా ఇంటికి పంపించడంతో ఇంటికెళ్లిన ఐదు రోజుల్లోనే అంజలి అనే విద్యార్థిని మరణించింది. జ్వరం వచ్చినప్పుడే స్కూల్ సరిగ్గా వ్యవహరించి వైద్యం చేయించి ఉంటే ఆ బాలిక బతికేది. మరో మృతురాలు కల్పన పరిస్థితి మరీ దారుణం. జ్వరంతో బాధపడుతున్న కల్పనను ఆమె తల్లి గత నెల 22న కురుపాం సీహెచ్‌సీ తీసుకెళ్లింది. అక్కడ నయం కాకపోవడంతో రెండు రోజుల తర్వాత పార్వతీపురంకి, అక్కడి నుంచి విజయనగరం మహారాజా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా ఆరోగ్యం నయం కాకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. దాదాపు పది రోజులపాటు నాలుగు ఆస్పత్రులు తిరిగి సరైన వైద్యం అందక గిరిజన బాలిక కల్పన అక్టోబర్ 1న చనిపోయింది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలిక సరైన వైద్యం అందక మృతిచెందింది. స్కూల్లో ఉన్నప్పుడే ఐదు రోజులుగా తన కుమార్తెకు పచ్చకామెర్లు సోకినా స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం వహించిందని కల్పన తల్లి చెబుతోంది. అభంశుభం తెలియని ఇద్దరు గిరిజన బిడ్డలను ఈ ప్రభుత్వం తన నిర్లక్ష్యంతో పొట్టనపెట్టుకుంది. రెండు నెలలుగా ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని తెలిసినా రిపేర్ చేయించకపోవడం వల్లే ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికీ విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించే ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దీనిపై విచారణ జరిపించాలని జాతీయ మనవహక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. కలుషితమైన తాగునీటి కారణంగా 170 మంది విద్యార్థులకు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ సోకిన విషయాన్ని కమిషన్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లాం. గిరిజన బిడ్డలు పరామర్శకు కూడా నోచుకోవడం లేదు గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. ఘటన జరిగిన ఐదు రోజుల వరకు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఎమ్మెల్యే వెళ్లలేదు. జిల్లా మంత్రికి ఇప్పటికీ తీరికలేదు. ఆమె కనీసం ఘటన జరిగిన స్కూల్ ని కానీ, బాధిత కుటుంబాలను కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కానీ ఇంతవరకు పరామర్శించకపోవడం దారుణం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఆటో డ్రైవర్ల సేవలో.. కార్యక్రమం కోసం వచ్చి పక్కనే వంద మీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌లో విద్యార్థుల ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని తెలిసినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు ఈ ఘటనపై రివ్యూ కూడా చేయలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం పరిశీలిస్తానని ఒక నోట్ రిలీజ్ చేసి మమ అనిపించారు. గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఈ ఘటనతో నిరూపితం అయింది. కష్టాలొస్తే గిరిజనలు కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. వైజాగ్ లో క్రికెట్ చూడటానికి వచ్చిన మంత్రి లోకేష్.. గిరిజన బిడ్డల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడటాన్ని గిరిజనుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వ తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు వారిపైనే నెపం నెట్టాలని చూడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేసి వెళ్లారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇకపై ఏ గిరిజన బిడ్డకు ఇలాంటి కష్టమొచ్చినా వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి. కురుపాం గిరిజన పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య స్కూల్ విద్యార్థులందరికీ వెంటనే స్ర్కీనింగ్ చేయాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి అండగా నిలబడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు.