వైయస్ఆర్ కడప జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం దుస్థితికి అద్దం పడుతున్న అరటి రైతుల కడగండ్లను మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్ఆర్ కడప జిల్లాలో స్వయంగా చూశారు. పులివెందుల నుంచి బ్రాహ్మణపల్లి చేరుకున్న ఆయన, అక్కడ అరటి రైతులను కలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. కిలో అరటికి చివరకు 50 పైసలు కూడా రాకపోవడంతో, దాన్ని అలాగే వదిలేస్తున్నామని, లేదా పశువులకు వేస్తున్నామన్న రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని చెప్పారు. వారి బాధలన్నీ విన్న శ్రీ వైయస్ జగన్, ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల పట్ల, ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నించిన ఆయన, ఇకనైనా సీఎం చంద్రబాబు మారకపోతే, రాబోయే రోజుల్లో అందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..: తిరోగమనంలో రైతుల బ్రతుకులు: రైతు ఏ పరిస్థితుల్లోనూ కష్టపడకూడదు. వారికి అగచాట్లు రాకూడదు అని చెప్పి, తపన పడిన ప్రభుత్వం మాది. అదే చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనమే. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు.. అతివృష్టి, అనావృష్టితో రైతులు చాలా నష్టపోయారు. వారికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, వారికి చంద్రబాబు ఇచ్చింది బోడి సున్నా. మొన్నటి మొంథా తుపాన్ నష్టాన్ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. దాదాపు రూ.1100 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతూ, రైతులకు హక్కు అయిన, ఉచిత పంటల బీమా ఇవ్వకుండా, వారి హక్కులు కాలరాశారు. ఈ–క్రాప్ కూడా చేయడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమా ఊసే లేదు: మా ప్రభుత్వ హయాంలో 80 లక్షల రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించాం. ఆ విధంగా దాదాపు రూ.7400 కోట్లు అందించాం. ఈరోజు రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే, కేవలం 18 లక్షల మంది రైతులకు పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాథుడే లేడు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. హక్కు అయిన ఉచిత పంటల బీమా లేదు. చంద్రబాబుగారు వచ్చాక, ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి. మరోవైపు పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. వారికి పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. నాడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా ఇచ్చాం. పంట వేసే సమయాల్లో మూడు విడతల్లో ఆ మొత్తం ఇచ్చాం. ఏ ఏడాది కూడా దాని ఎగ్గొట్టలేదు. ఈ పెద్దమనిషి చంద్రబాబుగారు, రైతు భరోసా ఎగ్గొట్టి, అన్నదాతా సుఖీభవ అన్నాడు. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు ఇచ్చి, మిగిలింది ఎగ్గొట్టాడు. అలా రైతులకు పెట్టుబడి సాయం తగినట్లు లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమా లేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు: మరోవైపు పంటలకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లేదు. దళారీలతో చంద్రబాబు కుమ్మక్కై, రైతుల బతుకులు అగమ్యగోచరంగా మార్చాడు. చంద్రబాబుగారి హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. గత ఏడాది ఏ పంట చూసినా.. ధాన్యం, కందులు, మినుములు, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కొక్కో, చీనీ, మామిడి.. దేనీకి గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది ధాన్యంతో సహా, ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసేవాళ్లం. ఆర్బీకేల్లో ఆ వివరాలు ప్రదర్శించే వాళ్లం. సీఎం–యాప్ ఉండేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, వెంటనే జేసీ అప్రమత్తమై, జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవారు. అలా రూ.7,746 కోట్లతో పంటల కొనుగోలు చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. అందుకే ఈరోజు పరిస్థితిని గమనించమని కోరుతున్నాను. నాడు రూ.32 వేలు. నేడు రూ.2 వేలు: మా ప్రభుత్వ హయాంలో అరటి టన్ను సగటు ధర రూ.25 వేలు కాగా, గరిష్టంగా రూ.32 వేల వరకు పోయింది. అదే ఈరోజు కనీనం రూ.2 వేలకు కూడా కొనడం లేదు. దీంతో పంట మొత్తం చెట్ల మీదే కుళ్లిపోతోంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతి కోసం అనంతపురం నుంచి ఢిల్లీకి రైళ్లు నడిపాం. అరటితో పాటు, ఉద్యాన పంటలు వాటిలో ఎగుమతి చేశాం. చివరకు బనగానపల్లి నుంచి గువాహటి వరకు రైళ్లు నడిచాయి. మా ప్రభుత్వం రాక ముందు అరటి ఎగుమతి 25 వేల టన్నులు మాత్రమే ఉంటే మా ప్రభుత్వ హయాంలో 3 లక్షల టన్నుల వరకు ఎగుమతి చేశాం. కేంద్రం నుంచి అవార్డులు కూడా పొందాం. అరటి సాగు. ఎగుమతికి సంబంధించి అవార్డులు పొందాం. ఐసీఏఆర్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా, అసోసియేషన్ ఆఫ్ బనానా ఎక్స్‌పోర్టర్స్ అవార్డు పొందాం. అవన్నీ నాడు ప్రభుత్వాన్ని గొప్పగా చూశాయి. కానీ, ఇప్పుడు ఇలాంటి దారుణ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఒట్టి మాటలు. డైవర్షన్ పాలిటిక్స్: ఇలాంటివి జరిగినప్పుడు డ్రామా చేయడం చంద్రబాబుగారికి అలవాటు. వెంటనే ఏకంగా 10 వేల మంది రైతులతో ఫోన్‌లో మాట్లాడానంటాడు. అన్నీ చేసేస్తాం అంటాడు. కానీ, ఏదీ చేయడు. ఇంకా క్వింటా ఉల్లి రూ.1200కు కొంటామన్నారు. ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు ఇస్తామన్నారు. అదీ లేదు. ఇదీ లేదు, ఏదీ లేదు. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్షన్. ఏదో ఒక అంశం తెరపైకి తెస్తారు. ఎల్లో మీడియాలో ఊదరగొడతారు. అలా వాటి నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాకపోయినా, ఎల్లో మీడియా రాయదు. వారంతా ఒక దొంగలముఠా. అంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తూ దోచుకుంటున్నారు. అందుకే చంద్రబాబుగారు ఏ మేలు చేయకపోయినా, అన్నీ చేసినట్లు, అంతా బాగున్నట్లు ఢంకా భజాయించి ప్రచారం చేస్తారు. పిల్లలకూ తప్పని కష్టాలు: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పిల్లలతో పోరాడుతున్నాం. డిసెంబరు వస్తే 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి. ఒక్కో క్వార్టర్‌కు దాదాపు రూ.700 కోట్లు. అంటే ఏకంగా రూ.5,600 కోట్లు బకాయిలు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయిలు. మరో రూ.2200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ఏటా ఏప్రిల్‌లో రూ.1100 కోట్ల చొప్పున ఇవ్వాల్సింది. అదీ ఇవ్వడం లేదు. దీంతో రెండూ కలిపి రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు. ఇక రైతుల పరిస్థితి చూస్తే ఇంత దారుణంగా ఉంది. అవన్నీ గాలికెగిరిపోయాయి: ఇక సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నాడు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.36 వేల బాకీ. ఇంకా నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నాడు. రూ.2 వేలు కట్ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, 5 లక్షలు కట్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈరోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇటు దోపిడి. అటు ఆస్తుల అమ్మకాలు: మరోవైపు ప్రభుత్వ ఆస్తుల అమ్మకం. కొత్త మెడికల్ కాలేజీలను శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తున్నారు. ఇంకా సిలికా, క్వార్ట్›్జ.. దేన్నీ వదలకుండా అన్ని వనరులు, గనులు దోచేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తూ, అక్కడా యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం: చంద్రబాబుగారు, మీకు ఒకే విషయం చెబుతున్నాం. ఇంకా మీరు రైతులను పట్టించుకోకపోతే, వారితో కలిసి ఉద్యమం చేస్తాం. మీరు ఇకనైనా మారకపోతే, రాబోయే రోజుల్లో వీళ్లందరి తరపున తీవ్రమైన ఉద్యమాలు జరుగుతాయి. ఇంకా చంద్రబాబునాయుడుగారిని గద్దె దింపే కాలం త్వరలోనే వస్తుంది. దేవుడు కూడా మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు కూడా ఆయన్ను దింపే రోజులు త్వరలోనే వస్తాయని శ్రీ వైయస్ జగన్ అన్నారు. అనంతరం, ఒక రైతు మాట్లాడుతూ.. ‘అయ్యా, చంద్రబాబుగారు మీరు వ్యవసాయం దండగ అంటున్నారు కదా.. మీరు ఏం తిని బ్రతుకుతున్నారు. ఇనుప ముక్కలు తిని బతుకుతున్నారా?. రైతులు ఒక్కసారి పంటలు వేయకపోతే.. ప్రజలు ఏం తింటారు? వారికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది?’ అని సూటిగా ప్రశ్నించారు.