నెల్లూరు: ప్రతిపాదిత హెలిప్యాడ్ ప్రాంతం అనువైనది కాకపోవడంతో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందని వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే... వాటిని పోలీసులు, అధికారులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు సూచించిన హెలిప్యాడ్ స్థలాన్ని వైయస్ఆర్‌సీపీ జిల్లా పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె పూజిత తదితరులు మంగళవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో.. కాకాణి గోవర్థన్‌రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ములాఖత్ కోసం వైఎస్ జగన్ పర్యటనను ఖరారు చేస్తే పది రోజుల నుంచి కూటమి ప్రభుత్వం, పోలీసులు అంగీకరించడం లేదని తెలిపారు. చివరగా సెంట్రల్ జైలు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ విద్యుత్తు వైర్లు ఉన్న ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. అక్కడ రోడ్లు వేయాలన్నా, రెండు, మూడు రోజులు పడుతుందని, హెలికాప్టర్‌కు తిరిగి ఇంధనం నింపాలన్నా రేణిగుంట వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వేలాదిగా తరలివచ్చే వైయస్ జగన్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రత కల్పించడం లేదని తెలిపారు. ప్రాంతం, సాంకేతికంగా సమస్యలు ఉన్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశామని చెప్పారు. దీంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. వైయస్ జగన్ నెల్లూరు పర్యటన తేదీని మళ్లీ నిర్ణయిస్తామని తెలిపారు.