గాంధీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఏపీ అభివృద్ధికి అడుగులు

అమరావతి: మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపూజీకి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి పదాలకు నిజమైన అర్థం బాపూజీ జీవితం అన్నారు. మహాత్ముడి ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఆ మహామహుడి 150వ జయంతి వేళ ఆయన స్వప్నమైన గ్రామ స్వరాజ్యం సాకారంలో భాగంగా గ్రామ సచివాలయాలను ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. గత నాలుగు నెలల్లోనే 43 వేల బెల్ట్‌ షాపులను మూసివేసి.. మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 3,500కు తగ్గించామన్నారు జగన్‌.

భారతీయ ఆత్మ పల్లేల్లోనే ఉందన్న బాపూజీ పలుకులే వేదాలుగా రైతులు, పేదల సంక్షేమానికి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గాను నవరత్నాలు అమలు చేస్తున్నామని తెలిపారు సీఎం జగన్‌. నా జీవితమే నేనిచ్చే సందేశం అని చాటిన ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఖండాలు, దేశాలు దాటి.. మామూలు జనాలతో పాటు మహానాయకులు కూడా స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి మీద బాపూజీ చెరగని ముద్ర వేశారన్నారు సీఎం జగన్‌.

Back to Top