సత్తెనపల్లిలో కేఎస్టీ ట్యాక్స్‌

స‌త్తెన‌ప‌ల్లి స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

స్పీకర్‌ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వ్యక్తి కోడెల 

 అప్పుల ఊబిలో సత్తెనపల్లిలో పత్తి, సుబాబుల్, మిర్చి రైతులు

ఈ ప్ర‌భుత్వాన్ని సాగ‌నంపండి..

బాబు వారంలో దిగిపోతారనే ఆనందం అక్కచెల్లెల ముఖాల్లో కనిపిస్తుంది

 

గుంటూరు:  దేశ‌మంతా జీఎస్టీ ఉంటే..స‌త్తెన‌ప‌ల్లిలో కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నార‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. స్పీక‌ర్ వ్య‌వ‌స్థ‌కు కోడెల మ‌చ్చ తెచ్చార‌ని మండిప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంలో విచ్చ‌ల‌విడిగా అవినీతి, అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని విమ‌ర్శించారు. బుధ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గుంటూరు జిల్లా  స‌త్తెన‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. 

ఏ ఒక్క పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేదు..
ఇదే నియోజకవర్గం గుండా నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్ర నేను చేయగలిగాను అంటే అది ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే. ఆ పాదయాత్రలో మీరు పడిన కష్టాలు నేను చూశా. మీరు పడిన మీ బాధలు విన్నా.. మీరు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. ఐదేళ్లలో చంద్రబాబు ఏమిచ్చారన్న మాట. పక్కనే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కనిపిస్తుంది. కానీ నీరు రాక సత్తెనపల్లి అంతా సంక్షోభంలోనే ఉందని చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీరు రాకపోవడంతో ఆరు తడి పంటలకే పరిమితమై. వాటికి కూడా మద్దతు ధరలు లేక అలమటిస్తున్న పరిస్థితుల్లో ఆ రైతన్న చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. పత్తికి కనీస మద్దతు ధర రూ. 5,450 అన్నా.. కనీసం రైతుకు రూ. 5 వేలు కూడా దక్కడం లేదన్న మాట ఇవాల్టికి కూడా గుర్తుంది. మిర్చిపంటకు కనీసం రూ. 10 వేలు వస్తేనే ఖర్చు అయినా వస్తాయి. కనీసం రూ. 6 వేలు కూడా రావడం లేదన్న మాటలు నాకు ఇవాల్టికి కూడా గుర్తున్నాయి. సుబాబుల్‌ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ. 4,400 పలికిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఈ రోజు రూ. 2 వేలు కూడా దక్కని పరిస్థితి ఉందన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. 

శ్మశానవాటికలు, మరుగుదొడ్లు వదిలిపెట్టడం లేదు
ఇదే నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగినప్పుడు మీరన్న ప్రతి మాట కరువు కన్నా పీడిస్తున్న మరో అంశం కూడా ఉందన్నా.. అది కోడెల గారి అవినీతి అని చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. దేశ వ్యాప్తంగా జీఎస్టీ అనే ట్యాక్స్‌ ఉందన్నా.. కానీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కేఎస్టీ అని కోడెల సర్వీస్‌ ట్యాక్స్‌ ఉందన్నా.. అన్న మాటలు గుర్తున్నాయి. ఐదేళ్లలో భయంకరమైన అవినీతి, ఎక్కడపడితే అక్కడ వసూళ్లు, ఈ నియోజకవర్గంలో తాళలేకపోతున్నామన్నా ప్రజల గోడు ఇంకా గుర్తున్నాయి. అపార్టుమెంట్లు కట్టాలంటే కప్పం కట్టాల్సిందే.. వ్యాపారం చేసుకోవాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందేనన్న పరిస్థితి దారుణంగా ఉన్నాయన్న మాటలు నాకు గుర్తున్నాయి. కోడెలకు సంబంధించిన సేఫ్‌ ఫార్మా కంపెనీలో నాసీరకమైన ఉత్పత్తులు తయారు చేస్తూ కానీ, ప్రభుత్వం మాత్రం అవి నాసీరకం అని తెలిసినా కూడా ఆర్డర్లు విడుదల చేస్తున్నారు. మెడికల్‌ స్టోర్స్‌లో కూడా ఇవే కొనుగోలు చేయాలని ఒత్తిళ్లు చేస్తూ.. తలొగ్గకపోతే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను పంపించి దాడులు చేస్తున్న పరిస్థితులు నాకు గుర్తున్నాయి. వివాదాస్పద భూముల్లో దౌర్జన్యంగా అక్రమాలు చేయడం, శ్మశానవాటికలు, మరుగుదొడ్లు వదిలిపెట్టకుండా విచ్చలవిడిగా అవినీతి చేయడం వంటి మీరు చెప్పిన అంశాలన్నీ గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై స్పీకర్‌గా ఎన్నికై ఆ పదవిని భ్రష్టుపట్టించిన నాయకుడు కోడెల శివప్రసాద్‌. 

ఈ ప్రభుత్వాన్ని దించబోతున్నామంటున్నారు
ఐదేళ్ల చంద్రబాబు పాలనను ఒక్కసారి గమనించాలని అడుగుతున్నా.. ఐదేళ్ల పాలనలో మోసం.. మోసం.. మోసం తప్ప మరొకటి చూడలేదు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలు, అవినీతి, దౌర్జన్యాలను చూశాం. ఇంతటి అన్యాయమైన మోసాలు, అబద్ధాలు, దుర్మార్గం, అవినీతి మధ్య చంద్రబాబు అంటున్న మాటలు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల మొహంలో చిరునవ్వు కనిపించిందంట. నిజమే చంద్రబాబు గారూ.. ఇక వారంలో మీరు దిగిపోతున్నారన్న ఆనందం అక్కచెల్లెమ్మల ముఖాల్లో కనిపించింది. ఐదు సంవత్సరాల చంద్రబాబు మోసాలకు, దుష్టపాలనను ప్రతి క్షణం గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని దించబోతున్నాం అని రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, చిన్న చిన్న వ్యాపారుల ముఖంలో ఆనందం కనిపిస్తుంది. కానీ కొందరి ముఖాల్లో భయం కనిపిస్తుంది. 

వారం రోజులు ఓపిక పట్టు అక్కా..
రాష్ట్ర రాజకీయాల గురించి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఎల్లో మీడియా, చంద్రబాబు కుట్రలు ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్ది విపరీతంగా పెరిగిపోతాయి. ఎన్నికల తేదీ వచ్చే సరికి ప్రతి గ్రామానికి మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఎన్నికల నాటికి వచ్చే సరికి రూ. 3 వేలు ప్రతి చేతిలోనూ పెడతాడు. మళ్లీ ఓట్లను కొనుగోలు చేస్తాడు. మీరంతా మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి తాతను, ప్రతి అన్నను, ప్రతి అవ్వను కలవండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

రూ. 3 వేలకు మోసపోవద్దు
పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

ప్రతి అక్క కు రూ. 75 వేలు ఉచితం
పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి.  గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. ఆ వారం రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

పింఛ‌న్ రూ. 3 వేల‌కు పెంచుతూ..
అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. వారం రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి.  

ప్ర‌తి ఒక్క‌రికి పక్కా ఇల్లు..
ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. వారం రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి రాంబాబు అన్నను నిలబెడుతున్నాను. మీ ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణ దేవరాయలును నిలబెడుతున్నాను. వీరిద్దరిని ఆశీర్వదించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 
 

 

Back to Top